అసలు డ్రగ్స్ అంటే ఏమిటి?

Comments · 209 Views

అసలు డ్రగ్స్ అంటే ఏమిటి?

అసలు డ్రగ్స్ అంటే ఏమిటి?

ఈ మధ్య చాలా ఎక్కువగా వినిపిస్తున్న పదం డ్రగ్స్, వార్తల్లో మనం రోజు చూస్తూనే ఉన్నాం. డ్రగ్స్ పట్టివేత,కొన్ని కోట్ల విలువ చేస్తుంది అనే మాటలు వినిపిస్తున్నాయి. అసలు ఈ డ్రగ్స్ అంటే ఏమిటి? ఎలా తయారు చేస్తారు, దీనివల్ల లాభాలు ఏమిటి?నష్టాలూ ఏమిటి? ఎవరు వాడతారు అనేది తెల్సుకుందాం...

ఔషధం అనేది ఏదైనా రసాయన పదార్ధం, అది వినియోగించినప్పుడు శరీరంలో జరిగే మార్పును కలిగిస్తుంది. అంటే మనం జ్వరంతో డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు రాసే మందులు వేసుకున్నప్పుడు మన శరీరంలో కొన్ని మార్పులు జరుగుతాయి, చెమటలు పట్టడం, నిద్ర రావడం లాంటివి. ఇవి ఆరోగ్యం బాగు చేసుకోవడానికి మోతాదులో మన శరీరాన్ని బట్టి డాక్టర్లు రాస్తారు.

మరి డ్రగ్స్ అంటే ఏమిటి?

డ్రగ్స్ అనేది కేంద్ర నాడి వ్యవస్థ యొక్క పనితీరును ప్రభావితం చేసే పదార్ధాలు ,అవగాహన,మానసిక స్థితి లేదా సృహను మారుస్తుంది. ఈ డ్రగ్స్ రకరకాలుగా ఉంటాయి.రకరకాల రూపంలో దొరుకుతాయి. ఉదాహరణకు... డిప్రెసెంట్స్ యాంటిడిప్రెసెంట్స్, యాంజియోలైటిక్స్,యాంటిసైకోటిక్స్ ,మరియు హాలూసినోజెన్స్ ఇలాంటి రూపాల్లో దొరుకుతాయి.

డ్రగ్స్ వాడకం ఎలా చేస్తారు?

డ్రగ్స్ సరఫరా చేసేవారు యువతను లక్ష్యంగా చేసుకుంటారు.ఇదొక చెయిన్ లాగా సాగుతుంది. చిన్నగా కాలేజిలో టేస్ట్ రుచి చూడాలనే ఉద్దేశ్యంతో అబ్బాయిలు ,అమ్మాయిలు ఆసక్తిగా ఇవి తీసుకుంటారు. ఆ తర్వాత ఇక డ్రగ్స్ తీసుకోక పోతే ఉండలేని స్థితిలోకి వస్తారు.

యువత ఒకసారి ఈ మత్తులోకి పడిన తర్వాత విడిచి ఉండలేరు కాబట్టి డ్రగ్స్ సరఫరా చేసేవారు రకరకాల రూపంలో తాయారు చేసి అముతున్నారు, అంటే చాక్లెట్లు, సిగరెట్ల రూపంలో అలాగే ఇవి ఎక్కడ పడితే అక్కడ దొరికేలా మత్తు పదార్ధాల సరఫరా చేసేవారు చూసుకుంటారు.అంటే కాఫీ షాపుల్లో,కిరణా షాపుల్లో, కిళ్ళి షాపుల్లో వీటిని అమ్ముతూ ఉండడం వల్ల యువతకు తేలికగా దొరుకుతుంది.

డ్రగ్స్ తీసుకుంటే ఏం జరుగుతుంది?

డ్రగ్స్ తీసుకోవడం వలన శరీరం చాలా తేలికగా అన్పిస్తుంది, మనం వేరే లోకంలో ఉన్నట్టు , అక్కడ ఎదో తెలియని ఆనందాన్ని పొందుతున్నట్టు అనిపిస్తుంది.అయితే మద్యం తాగేవారికన్నా ఎక్కువ మత్తు వస్తుంది. మద్యం తాగితే తెల్లారేసరికి మత్తు పోతుంది.కానీ డ్రగ్స్ తీసుకోవడం వలన అది కొన్ని గంటల పాటు మత్తులో ఉంచుతుంది. అందువలన యువత, లేదా ఇతరులు ఆ అలౌకిక ఆనందాన్ని పొందడం కోసం డ్రగ్స్ వాడతారు. డ్రగ్స్ వాడడం వలన ఒక ఉహజనిత లోకంలోకి వెళ్తారు, చేతిలో ఫోన్ లేకున్నా ఉన్నట్టు, లేని వారిని ఉన్నట్టుగా ఉహించుకోవడం వారితో మాట్లాడడం,జరుగుతాయి,

అలాగే డ్రగ్స్ తీసుకోవడం వలన నొప్పి అనేది తెలియకుండా కూడా ఉంటుంది.ఎంత కొట్టినా కూడా వారికి ఆ మత్తు వలన ఏమి తెలియదు.ఇంకో రకమైన నార్కోటిక్ అనల్జేస్ వాడడం వల్ల నొప్పి తగ్గి ఉద్రేకాన్ని కలిగించి , ఆ సమయంలో వారు ఏం చేస్తున్నారో కూడా తెలియని స్థితిలో ఉంటూ,వారి భాగోద్వేగాలు మారిపోతూ ఉంటాయి. ఈ సమయంలోనే ఎక్కువగా అత్యాచారాలు వంటివి జరుగుతూ ఉంటాయి.

డ్రగ్స్ ప్రభావం ఎలా ఉంటుంది?

ఒకసారి డ్రగ్స్ అలవాటు అయిన తర్వాత వారి జీవన శైలి పూర్తిగా మారిపోతుంది.డ్రగ్స్ తీసుకోగానే వారు చేయాల్సిన పనులు,బాధ్యతలు మర్చిపోతారు,ఆగకుండా నవ్వడం,ఆనందపు అంచులలో ఉన్నట్లు ఉహించుకుంటూ ఉండడం చేస్తారు.ఎవరిని పట్టించుకోకుండా ఉండడం చేస్తారు.

వీరిని ఎలా గుర్తించాలి?

వీటికి అలవాటు పడడం వల్ల ఆకలి తగ్గిపోతుంది,నిద్ర పట్టదు,జ్ఞాపక శక్తి తగ్గిపోతుంది,మూడ్ ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటాయి.అందరితో గొడవ పడుతూ ఉంటారు.

కాళ్ళు ,చేతులు వణకడం,జుట్టు ఎండి పోవడం, వయసు మీరిపోయినట్లు కన్పిస్తారు,అలాగే మాటల్లో తడబాటు,కళ్ళ కింద నల్లటి వలయాలు ఏర్పడతాయి.నిజమైన ఆనందాన్ని కోల్పోయి,కుటుంబాన్ని పట్టించుకోకుండా ఉంటారు.

డ్రగ్స్ దొరకని సమయంలో విరు దొంగతనాలకు పాల్పడడం,ఆత్మహత్య చేసుకోవడం వంటివి చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి.అలాగే నరాలను ఉద్రేక పరిచి గుండె కొట్టుకునే వేగం పెరిగి, గుండెపోటు వచ్చే అవకాశాలు,సుఖ వ్యాధులు వచ్చే వీలు కూడా ఉంటుంది. ఉద్రేకంలో హత్యలు, అత్యాచారాలు చేసే అవకాశం చాలా ఎక్కువగా జరుగుతూ ఉంటాయి.

డ్రగ్స్ తీసుకునే వారిని బాగు చేయడం ఎలా ?

1.చిన్న వయసులో అలవాటు పడడానికి అవకాశాలు ఎక్కువ కాబట్టి తల్లిదండ్రులు పిల్లలను గమనిస్తూ ఉండాలి.

2.ఎక్కువ డబ్బు ఇవ్వకుండా,ఎప్పటికప్పుడు స్నేహితుల వివరాలు కనుక్కుంటూ ఉండాలి.

3.పిల్లల ప్రవర్తనాలి మార్పులు, అలాగే డబ్బు ఎక్కువగా ఖర్చు పెట్టడం,ఒంటరిగా ఉండడం చేస్తుంటే వెంటనే గమనించి దానికి అడ్డుకట్ట వేయాలి.

4.ఒక వేళ పిల్లలో ఇలాంటి మార్పులు మీరు అంటే తల్లిదండ్రులు గమనించగలిగితే ఆలస్యం చేయకుండా వెంటనే డీఅడిక్షన్ సెంటర్లను సంప్రదించి,కౌన్సిలింగ్ తో పాటూ చికిత్స అందేలా చూడాలి.

5.మంచి ఆహారం అందిస్తూ వారిని తప్పు చేసిన వారిలా చూడకుండా మెల్లిగా వారిలో మార్పు తేవడానికి ప్రయత్నం చేయాలి.

Comments
Venkata Bhanu prasad Chalasani 30 w

మాకు తెలియని సమాచారాన్ని తెలియజేశారు.