అంతర్జాతీయ పురుషుల దినోత్సవం ప్రతి సంవత్సరం నవంబరు 19 న అంతర్జాతీయా స్థాయిలో జరుపబడే ఉత్సవం. 1992 ఫిబ్రవరి 7న ప్రొఫెసర్ థామస్ ఓస్టర్ చే ఈ దినము ప్రారంభించబడిననూ, ట్రినిడాడ్ , టొబాగో దేశస్థులు దీనికి కొత్త ఊపిరులు ఊదారు..దక్షిణ ఐరోపాకు చెందిన మాల్టా దీవిలో ఈ ఉత్సవాన్ని 1994 ఫిబ్రవరి 7 నుండి క్రమం తప్పక జరుపుతున్నారు. ఈ ఉత్సవాన్ని సుదీర్ఘ కాలంగా జరుపుతున్నది మాల్టా వారే. ఇది ఐక్య రాజ్య సమితి (United Nations) ఆమోదంతో మొదటగా ట్రినిడాడ్ , టొబాగోలో 1999 లో ప్రారంభించబడింది.
అంతర్జాతీయ పురుషుల దినోత్సవం జరుపటం నేపథ్యంలో గల ప్రాథమిక లక్ష్యాలు:
ఆదర్శ పురుషుల గురించి ప్రత్యేకించి తెలుపటం
కేవలం సినిమా తారలనో, క్రీడాకారులనో మాత్రమే కాక, దైనందిన జీవితంలో కాయకష్టం చేసుకునైనా సరే గౌరవప్రదమైన నిజాయితీపరమైన జీవితాలు గడిపేవారి గురించి కూడా చెప్పటం
సంఘానికి, వర్గానికి, కుటుంబానికి, వైవాహిక వ్యవస్థకు, శిశు సంరక్షణకు , పర్యావరణకు పురుషులు ఒనగూర్చిన ప్రయోజనాలను గుర్తించటం
పురుషుల సాంఘిక, భావోద్వేగ, శారీరక , ఆధ్యాత్మిక ఆరోగ్యంపై దృష్టి సారించటం
సాంఘిక సేవలలో, విలువలలో, అంచనాలలో , చట్టాలలో పురుషులేదుర్కొంటూన్న వివక్షను చాటటం
స్త్రీ-పురుషుల మధ్యన సఖ్యత, సరైన సంబంధాలను నెలకొల్పటం
లింగ సమానత్వాన్ని వ్యాపింపజేయటం
హాని గురించిన తలంపులు లేని, పరిపూర్ణ అభివృద్ధికి అవకాశాన్నిచ్చే సురక్షితమైన ప్రపంచం రూపొందించటానికి కృషి చేయటం
ఇవే కాక –
సంఘంలో పురుషులు/బాలురు ఎదుర్కొనే వివక్షను
పురుషజాతికి
సంఘం పట్ల
కుటుంబం పట్ల
వివాహం పట్ల
శిశు సంరక్షణ పట్ల గల సత్సంకల్పము, ఆయా దిశలలో పురుషజాతి సల్పే కృషి, వీటి వలన పురుషజాతికి కలిగే సాధకబాధకాలను
- విశదీకరించే సందర్భమే అంతర్జాతీయ పురుషుల దినోత్సవము. స్థూలంగా ఈ దినోత్సవం యొక్క విశాల , అంతిమ ధ్యేయం ప్రాథమిక మానవీయ విలువలను పెంపొందించటం.
19 నవంబరున ఈ ఉత్సవాన్ని 70కి పైగా దేశాలు ఈ దినోత్సవాన్ని జరుపుకొంటున్నాయి. 1960 ల నుండే రష్యాలో పురుషుల దినోత్సవ ప్రతిపాదన ఉంది. 1968లో అమెరికన్ విలేకరి జాన్ పి హారిస్, పురుషులకంటూ ఏ దినోత్సవం లేకుండానే మహిళా ఉద్యోగులు జరుపుకునే అంతర్జాతీయ మహిళా దినోత్సవం వలన సోవియట్ వ్యవస్థ లోని సమతూకం దెబ్బతిన్నదని వ్రాశాడు. తాను స్త్రీల దినోత్సవాన్ని వ్యతిరేకించటం లేదని, కానీ స్వామ్యవాద వ్యవస్థలో లింగ అసమానత ఒక తీరని లోటుగా నెలకొని ఉన్నదని ప్రస్తావించాడు.
పురుషుల హక్కుల కోసం పోరాడే దీపికా నారాయణ్ భరద్వాజ్ పురుషుల పై ఒక కవిత రాసి తన ట్విట్టర్ అకౌంటులో పోస్టు చేసింది. నిత్యజీవితంలో పురుషుడు ఎన్నో కష్టాలను పడుతుంటాడని అతని ఇది కేవలం ఒక చిన్ని కృతజ్ఞత అని తెలుపుతూ దీనిని పురుషులకు అంకితమిచ్చింది.
ప్రముఖ బాలీవుడ్ నటి సోనాలీ కులకర్ణి పురుషులందరికీ అంతర్జాతీయ పురుషుల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపినది. ఓటు హక్కు వచ్చీ రాకనే పురుషుడు సంపాదించవలసి వస్తోందని, పురుషుడే ఆధారవనరు అయిన కుటుంబాలలో ఇది మరీ ఎక్కువగా ఉన్నదని విచారం వ్యక్తం చేసింది. తనకేం కావాలో, తనకు ఇష్టమైనదేదో, తన మనస్తత్వమేమిటో తెలుసుకొనే లోపే పురుషుడు యాంత్రిక జీవితాన్ని అందిపుచ్చుకొంటాడని, పురుషుని త్యాగం అక్కడే మొదలవుతుందని తెలిపినది. స్త్రీ విమోచనకు కృషి చేసిన పురుషులను గుర్తు చేసుకొంటూ, వారు లేనిదే స్త్రీ జాతి ఈ రోజున ఇంత ముందుకు పోలేకపోయేదంది.
పురుషుల విషయంలో తను మాత్రం ‘కలవారి అమ్మాయినే’ నని తెలిపినది. తాను ఈ స్థాయికి ఎదిగినదంటే తన తండ్రి, సోదరుల వలననే తెలిపినది. తన తండ్రి చాలా సహనశీలుడని, తనకు సంగీతం నేర్పాలనుకొన్నది తన తండ్రేనని తెలిపినది. తన సోదరులెప్పుడూ తనలోని సృజనకు సాన పడుతూనే ఉంటారని తెలిపినది. తన భర్తకు తానంటే చాల ప్రేమ అని, అతనిది అర్థం చేసుకొనే గుణమని, స్త్రీలందరికీ అటువంటి భర్తే రావాలని తాను కోరుకొంటున్నాన్నది.
పురుషులు కూడా మానవులేనని, ఒక స్త్రీకి ప్రేమాభిమానాలు ఎంత అవసరమో, పురుషుడికి కూడా అంతే అవసరం అని, సృష్టిలో స్త్రీ-పురుషులిరువురూ భాగస్థులేనని తెలిపినది. పురుషులు మార్స్ నుండి రాలేదని (Men are not from Mars) అని తెలిపినది.
అంతర్జాతీయ పురుషుల దినోత్సవం యొక్క చరిత్ర బాలుర/పురుషుల సమస్యలను ప్రత్యేకించి పరిగణించటమే కాక స్ఫూర్తినిచ్చే ఆదర్శ పురుషులపై దృష్టి కేంద్రీకరించింది. ప్రస్తుత సాంఘిక దృక్పథంలో పురుషుడిని దురుసుగా ప్రవర్తించే ప్రతిబింబాలుగానే చూపటం జరుగుతోందని దీనిని మార్చవలసిన అవసరం ఎంతైనా ఉన్నదని ఈ దినోత్సవాన్ని జరిపే వారి అభిప్రాయం. ఆదర్శ పురుషులను స్మరించటం వలన పురుషులపై ఉన్న దురభిప్రాయాలను తొలగించే ప్రయత్నం చేస్తోంది.
మాధవి కాళ్ల
సేకరణ