రవి తన స్నేహితుడు విజయ్ ఇద్దరూ పట్టణంలో ఉద్యోగాలు చేసే యువకులు. దీపావళి అంటే వారికి కొత్త బట్టలు, పిండి వంటలు, ఖరీదైన టపాసులు మాత్రమే.
కానీ , ఈసారి రవి తండ్రి ,
“దీపావళి అంటే చీకటిని తరిమేయడం. నీ చుట్టూ ఉన్న చీకటిని కూడా తరిమేయాలి”అని చెప్పారు. ఆ మాట రవి మనసులో బలంగా నాటుకుంది.
“విజయ్! ఈసారి మనం దీపావళిని కొత్తగా జరుపుకుందాం. కేవలం మన ఇల్లు మెరిస్తే చాలదు, మన చుట్టూ ఉన్న సమాజంలో కూడా వెలుగులు నిండాలి” అన్నాడు రవి.
వారు మొదటగా తమ ఇంటికి దగ్గరలో ఉన్న మాతృఛాయ అనే వృద్ధాశ్రమానికి వెళ్లారు.
అక్కడ ఉన్న వృద్ధులలో చాలా మందికి తమ కుటుంబ సభ్యులను కలుసుకోలేదనే బాధ, ఒంటరితనం వారి కళ్ళలో కనిపించాయి.
రవి, విజయ్ ఆ రోజు ఉదయమంతా అక్కడే ఉన్నారు. వృద్ధులకు కొత్త బట్టలు అందించి , రుచికరమైన మిఠాయిలు తినిపించారు.
వారితో కలిసి సరదాగా ముచ్చటించారు , పాత పాటలు పాడారు. సాయంత్రం వృద్ధులు స్వయంగా మట్టి దీపాలకు నూనె పోసి వెలిగిస్తుంటే…
ఆ దీపాల కాంతి వారి ముఖాలపై కొత్త మెరుపును తెచ్చింది.
“ఈ దీపావళి ఎన్నో ఏళ్ల తర్వాత మాకు నిజమైన పండుగలా అనిపిస్తోంది , బిడ్డా! మీరు వచ్చి మాలోని ఒంటరితనం అనే చీకటిని తరిమేశారు” అని కన్నీళ్లతో దీవించారు ఒక అవ్వ.
ఆ రాత్రి రవి, విజయ్ తమ ఇంటికి వెళ్ళారు.
వారు టపాసులు కాల్చలేదు! కానీ , వారి హృదయాలు మాత్రం వెయ్యి దీపాల కాంతితో మెరిశాయి. రవి తండ్రి వచ్చి, రవిని దగ్గరకు తీసుకుని,
“ఇదే నిజమైన దీపావళి నాన్నా! బయట మట్టి దీపాలు వెలిగించడంతో పాటు, ఇంకొకరి హృదయంలో ఆశ అనే దీపం వెలిగించడం అత్యంత గొప్ప పండుగ. నువ్వు ఈరోజు సామాజిక దీపావళిని జరుపుకున్నావు” అన్నారు.
ఆ మాటలు విని మౌనంగా ఉండిపోయాడు రవి.
మాధవి కాళ్ల..
హామీ పత్రం :-
ఈ కథ నా సొంతం అని హామీ ఇస్తున్నాను..