అక్షర లిపి

తేదీ: 11/10/2024

అంశం : మహిళల అభివృద్ధి ఎటువైపు

శీర్షిక : తరతరాలలో మహిళలు (వ్యాసం)

రచన : విత్తనాల విజయకుమార్
హైదరాబాద్
9985117789

ఈ వ్యాస రచన నా సొంత రచనని హామీ ఇస్తున్నాను

•••••••••••••~•

ఆటవిక రోజులలో ఎలా ఉండేదో చదివాము.

పురాణేతిహాసాలలో ఏమున్నదో విన్నాము – వింటున్నాము – వింటూనే ఉంటాము.

నాగరికత వివిధ ప్రాంతాల్లో ఎలా అభివృద్ధి చెందిందో చూసాము – చూస్తున్నాము – మరింత ఊహిస్తాము.

ఆటవిక రోజులు పూర్తిగా అవసరాలపై ఆధారపడిన రోజులు. బలవంతులు బలహీనులపై పెత్తనం చలాయించిన రోజులు. అక్కడ ఎక్కడ చూచినా అధికంగా అన్యాయం జరిగింది మహిళకే. అయితే మహిళలు అంతరించిపోలేదు. అలా జరిగే అవకాశమే లేదు. మహిళలు అవసరం చాలా ఎక్కువ. మహిళలను వాడుకున్నారు. అవసరాలకు వాడుకున్నారు. బలహీనులు బలవంతులకు దాసులయ్యారు. అది ఆటవిక సమాజం. అందులో అసహజత్వం ఏమున్నది! దానినే అసహజంగా చూపడానికి ఓ కల్పిత దృశ్యాన్ని ఆలోచించి చూడండి.

మహిళ పురుషుని కన్నా శారీరకంగా బలమైనది అనుకుందాము. వేటాడగలిగేది. నలుగురితో పోట్లాడగలిగేది. చంపటానికైనా చస్తానికైనా సిద్ధంగా ఉండేది. అలాంటప్పుడు మహిళల దగ్గర పురుషులు బానిసలుగానే ఉండాలి కదా. ఆటవిక ప్రపంచం అంతే. ఇప్పటికీ జంతువులు అలాగే ఉన్నాయి. ఆ ప్రపంచంలో మనుషులకూ జంతువులకు మరీ అంత తేడా లేదు. అందుకని ఆ విషయాలు ఇప్పుడు చెప్పుకొని బాధపడటం శుద్ధ దండుగ. కాదంటారా!

ఇక రెండో విషయానికి వద్దాం. పురాణేతిహాసాలు. అందరూ గౌరవిస్తారు. అతి తక్కువ మంది వ్యతిరేకిస్తారు. స్త్రీని శక్తిగా చూపారు. దేవతల కన్నా దేవుళ్లకు ప్రాధాన్యతను ఎక్కువ ఇచ్చారు. శీలం ప్రాధాన్యత అత్యంత అధికం. అక్కడ కూడా పక్షపాతమే కనబడుతుంది. వాల్మీకి మగవాడే కదా. పక్షపాతం ఉండటంలో ఆశ్చర్యం ఏముంది! అనుకుందాం. మరి ఆ పాత్రలను విమర్శించే ధైర్యం ఎందుకు ఎవ్వరూ చేయడం లేదు. అతి తక్కువ మంది చేస్తున్నారని ఇప్పటికే చెప్పాను. మహిళను గౌరవించమని చెబుతూనే కష్టాలు ఓర్చుకొని సహనంతో పాతివ్రత్యాన్ని నిలబెట్టుకోమని చెబుతున్నాయి పురాణాలు. ఆపురాణాలనే అత్యధికంగా గౌరవిస్తున్నారు నేటి మహిళలు. పురుషాధిక్యతను ఒప్పుకున్నట్లా లేక ఒప్పుకోవడం లేదా అనేదానికి జవాబు ఏమిటో నేను చెప్పక్కర్లేదు.

ఇక ఇప్పుడు అసలు పాయింట్లోకి వద్దాం. నాగరికత అభివృద్ధి. దీని మీద నిష్పక్షపాతంగా విశ్లేషించుకుంటే అందరికీ మంచిది.

నాగరికత ఎంతగానో పెరిగింది. ఎన్నో మార్పులను తెచ్చింది. మూర్ఖత్వాలను పక్కన పెట్టింది. మహిళల అభివృద్ధి ఆటవిక రోజుల్లో లాగా లేదు. పురాణాలలో లాగా చాలా అరుదుగా కనపడితే వాళ్లను అమ్మమ్మలు నానమ్మలు అంటారు.

జరగవలసిన అభివృద్ధి జరిగింది. మరింత అభివృద్ధి జరగాలి. గ్రాఫ్ ను పరిశీలిస్తే ఏ స్థితి నుండి ఏ స్థితికి వచ్చారో కనబడుతుంది.

కోట్లమంది నివసిస్తున్న ఓ రాష్ట్రంలో ఓ నీచుడు ఓ మహిళను బలాత్కారం చేస్తే దాని గురించి ఎంత రాద్ధాంతం చేస్తున్నారు. జరిగింది ముమ్మాటికీ తప్పే. ఆ నీచుడ్ని అక్కడికక్కడే చంపటం ఏమాత్రం తప్పు కాదు. అటువంటి పనులు జరగకుండా అత్యంత భద్రతను తీసుకొని విధానాలను ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ, చట్టాలను కఠినం చేసుకుంటూ, ప్రజలను విద్యావంతులను చేయడం అవసరం.

అలా కాకుండా జరిగిన అభివృద్ధిని ఓ పక్కన పెట్టేసి, జరగబోయే అభివృద్ధిని చెప్పకుండా ఎక్కడ చూసినా అసభ్యంగా

టీవీల్లో

సినిమాల్లో

కథల్లో

కవితల్లో

అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు.

మహిళలు ఈరోజు వరకు ఏమి సాధించారో చెప్పడం లేదు.

ఇంకా ఏమి సాధించాలో చెప్పడం లేదు.

ఎలా ఉండకూడదన్నది చెప్పడం లేదు.

లోకంలో అతి తక్కువగా కనిపిస్తున్న సంఘటనలను చెప్పడం బాధాకరం.

కనీసం ఆ అతి తక్కువ సంఘటనలు జరగకుండా చేయవలసిన పనులను కూడా చెప్పరు. పరిష్కారాలు చెప్పరు. జాతి అభివృద్ధికి పురుష ప్రపంచం ముందుకు వచ్చి తీరాలి. కనీసం మహిళలైనా మారాలని ఆవేదనతో ఇదంతా ఈరోజు ఈ సందర్భంగా చెబుతున్నాను.

ముగింపు:

  1. ఇప్పటికైనా స్త్రీలు సాధించిన అభివృద్ధిని గుర్తించుదాం.
  2. సాధించవలసిన అభివృద్ధికి పాటుపడదాం.
  3. అరుదుగా జరిగే సంఘటనలు జరగకుండా తీసుకోవలసిన పరిష్కార మార్గాలను సూచించుదాం.
  4. శారీరకంగా బలహీనులైనా మానసికంగా అన్నింటిలో పురుషులకు మహిళలు ఏమాత్రం తక్కువ కాదని చెప్పి తీరుదాం.

అందరమూ మనుషులమే. మనుషులకే మనసుంటాది. మనసుతో ఆలోచించి చూడండి.

•••••••••••••~•

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *