ఈ యుద్ధంజగతి కోరనిదన్నది యధార్ధం!

గత కొన్నాళ్లుగా
ఎక్కడ విన్నా..
ఏది చూసినా..
యుద్ధం యుద్ధం యుద్ధం అన్నమాటే…

మామూలుగా యుద్ధాలకు దారితీసేది
సరిహద్దు సమస్యలు..
సైద్ధాంతిక వైరుధ్యాలు..
ఆర్థిక అంతరాలు..

ఇవన్నీ కా”రణాలు” కావచ్చునేమో కాని..
వీటన్నిటినీ మించినది
ఆధిపత్య కాంక్ష..

ఆర్థికంగా..సాంకేతికంగా
అభివృద్ధి చెందిన దేశాలు
తమకు కొన్ని విషయాల్లో కిట్టని దేశాలపై దాడులు..యుద్ధాలకు తెగబడి ఆ దేశాలను
తమ ఆధిపత్యంలోకి
తెచ్చుకునే ప్రయత్నమే
యుద్ధం..కొన్ని దేశాలు
చిన్నవైనా గాని వాటి అధీనంలో ఉండే అత్యంత విలువైన వనరులను
తమ వశం చేసుకునే
భయంకరమైన కుట్రకు
మరోపేరు కూడా యుద్ధమే.

ప్రస్తుత తరుణంలో ప్రపంచంలో జరుగుతున్న
యుద్ధాలకు ఇలాంటి వక్ర బుద్ధులే ప్రధాన కారణం..

సరే..ఆయా దేశాల అధినేతలు..పాలకులు..
ప్రభుత్వాలు..ఆ సంగతులు
ఎలా ఉన్నా యుద్ధాల కారణంగా ప్రధానంగా
ఈ మొత్తం ప్రక్రియలతో
అస్సలు సంబంధమే ఉండని
పౌరులు…వారు ఏ దేశం వారైనా గాని..యుద్ధాల మూలంగా జనం ప్రాణభయంతో పాటు
ఆర్థిక సమస్యలు..
నిత్యావసరాల కొరత..
ప్రశాంతత లేమి..
భవిష్యత్తుపై ఆందోళన..
ఇలాంటి ఎన్నో సమస్యలకు
గురి కాక తప్పదు.

యుద్ధంలో ప్రత్యక్షంగా పాలు
పంచుకుంటున్న దేశాలు మాత్రమే గాక..సంబంధం ఉండని దేశాల్లో కూడా
ఈ ఆందోళనలన్నీ తప్పదు..

ఇప్పుడు జరుగుతున్నది అదే..యుద్ధాల ప్రభావం ప్రపంచం మొత్తంపై కనిపిస్తోంది..అసలు ఈ పరిస్థితి మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందా..
చాలా మందిలో ఇదే భయం.
అంతవరకు వెళ్ళకున్నా కొన్ని దేశాల్లో అప్పుడే పౌర జీవనం
అతలాకుతలం అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
ముఖ్యంగా రవాణా.. ఇంధన రంగాలు కొన్ని దేశాల్లో అప్పుడే కుదేలవుతున్నాయి.
ఇదే పరిస్థితి ఇంకొన్నాళ్ళు
సాగితే అప్పుడు ఏంటి..!?
ప్రపంచం ఎలా ఉండబోతోంది..
జనం ఎలా తట్టుకోగలుగుతారు..
ప్రభుత్వాలు ఎలా ఎదుర్కొంటాయి..??

ఈ యుద్ధాలు మనకి చాలా విషయాలు చెబుతున్నాయి.
దేశాల బలాబలాల గురించి
పెద్దగా అవగాహన ఉండని
జనం ఏమనుకుంటారంటే
అమెరికా తలచుకుంటే
ఏ దేశాన్నయినా క్షణాల్లో
నామరూపాలు లేకుండా చేసేస్తుందని..

అవతల ఉన్నది ఎంత పెద్ద దేశమైనా వార్ ఎప్పుడూ
వన్ సైడ్ కాదని చరిత్ర చాలాసార్లు చెప్పింది.
కువైట్..ఇరాక్ అతి సమర్థంగా
ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొన్న వాస్తవాన్ని మనం
చూసాం.

ఇప్పుడు తాజా పరిస్థితుల్లో కూడా యుద్ధాలు ఎక్కడా ఏకపక్షంగా జరిగిపోవడం లేదు..ఆలా జరుగుతూ ఉంటే
మొదలైన ఒకటి రెండ్రోజుల్లోనే
కథ పరిసమాప్తం అయిపోయి ఉండేది.!

సరే..వర్తమాన భీకర సంగ్రామాల్లో ఎవరిది పై చేయి అవుతుంది..ఏ దేశం ఆధిపత్యం సాధిస్తుంది..
ఏ దేశం నామరూపాలు లేకుండా అయిపోతుంది..
అన్న విషయాలను ప్రస్తుతానికి కాలానికే వదిలిపెట్టినా..ప్రపంచం మొత్తం యుద్ధ ప్రభావంతో
అల్లాడుతూ ఉందనేది తిరుగులేని వాస్తవం..

అభివృద్ధి..
ఇది జరగడానికి సంవత్సరాలు..దశాబ్దాలు..
శతాబ్దాల పర్యంతం పోరాటం తప్పదు..

కానీ ఒక్క పోరాటం ఈ మొత్తం అభివృద్ధి క్షణాల్లోనో.. రోజుల్లోనో నాశనం అయిపోతుంది..

ఈ క్లిష్ట సమయంలో
ప్రపంచానికి కావలసింది..

సహనం..సంయమనం..
ధైర్యం..నిబద్ధత..

పాలకులు తెలుసుకోవాల్సింది..
నాశనం చేయడం సులువని..
నిర్మించడం కష్టమని..

యుద్ధం కంటే శాంతి.. సామరస్యత చాలా విలువైనవని..
ఏ దేశ ప్రజలైనా వాటినే కోరుకుంటారని..

నిజానికి..
యుద్ధం గెలవడం కంటే..
యుద్ధాన్ని నిలువరించడమే
అతి పెద్ద విజయమని
ప్రపంచంలోని ప్రతి దేశం..
ప్రతి ఏలిక తెలుసుకోవాలి.

అంతటి శ్రీకృష్ణుడు కూడా యుద్ధాన్ని నిలువరించలేకపోయాడనే సూత్రాలను వల్లె వేయొద్దు..
అది నాటి కాలమాన పరిస్థితులను అనుసరించి..
అయినా..ధర్మస్థాపన జరిగింది అనుకున్నా..
అప్పుడైనా..ఇప్పుడైనా..
ఆమాటకొస్తే ఎప్పుడైనా యుద్ధం వినాశానికే
దారితీస్తుందనేది
నిజం.. నిజం..నిజం!
ఇట్లు
మీ
కోటేశ్వరరావు ఉప్పాల

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *