🕉️ ఆశ్వయుజ బహుళ తదియనాడు జరుపుకునే స్త్రీల ప్రధాన పండుగే అట్లతద్ది.
దీనినే ఉయ్యాల పండుగ అని, గోరింటాకు పండుగ అని కూడా అంటారు.
ఉండ్రాళ్ల తద్దె మాదిరిగానే, అట్లతద్దెకు ముందు రోజు ముత్తయిదువులు, కన్నెపిల్లలు గోరింటాకులు వేయించుకుంటారు. మరుసటి రోజు తెల్లవారుజామున లేచి తలస్నానం చేసి, పీఠంపై బియ్యం వేసి, తమలపాకుపై పసుపుతో గౌరీదేవిని ప్రతిష్ఠించి పూజిస్తారు. గంధం, పువ్వులు, అట్లు నైవేద్యంగా సమర్పిస్తారు. ఆ తర్వాత శక్తికొద్దీ ముత్తయిదువులకు వాయినాలు ఇవ్వడం ఆనవాయితీ.
💫 ఈ పూజ ఫలితంగా గౌరీదేవి అనుగ్రహం లభించి, సౌభాగ్యం, సుఖాలు నిలిచిపోతాయని నమ్మకం. పిల్లలు తెల్లవారుజామునే అన్నం, గోంగూర పచ్చడి, పెరుగుతో కడుపునిండా తింటారు. “అట్లతద్దోయ్ ఆరట్లోయ్, ముద్దపప్పోయ్ మూడట్లోయ్” అంటూ పాటలు పాడుతూ ఊయలలూగుతారు.
పెద్దలు మాత్రం ఉపవాసం చేసి చంద్రోదయానంతరం పూజ చేసి అట్లు నైవేద్యంగా సమర్పించి భుజిస్తారు
🌸 అట్లతద్ది కథ 🌸
ఒకసారి రాజుగారి కూతురు, మంత్రి కూతురు, సేనాని కూతురు, పురోహితుని కూతురు కలిసి అట్లతద్దె పూజకు సిద్ధమవుతారు. ఆకలితో అలమటించిన రాజకుమార్తెకు ఆమె అన్నయ్య అద్దంలో చంద్రుని భ్రమ చూపించి, చంద్రోదయమైందని నమ్మించి ఆహారం తినిపిస్తాడు. కానీ వ్రతనియమం భంగమవుతుంది.
ఆ తరువాత ఆమెకు వృద్ధుడైన భర్త లభిస్తాడు. విచారంతో పార్వతీ-పరమేశ్వరులను ప్రార్థించగా, మరుసటి రోజు నిజమైన అట్లతద్దె పూజ చేసి భర్తపై అక్షతలు చల్లగానే ఆయన యవ్వనవంతుడవుతాడు. అప్పటినుంచి ఈ వ్రతం విశేషంగా ప్రసిద్ధి చెందింది.
🌸 అట్లతద్ది అంతరార్థం 🌸
నారదముని ప్రేరణతో గౌరీదేవి మొదటగా చేసిన వ్రతమే అట్లతద్దె అని పురాణాలు చెబుతున్నాయి.
• స్త్రీలు సౌభాగ్యం కోసం ఈ వ్రతాన్ని ఆచరిస్తారు.
• చంద్రారాధన వల్ల చంద్రకళల్లోని శక్తి భక్తులకు ప్రసాదమవుతుంది.
• అట్లు నైవేద్యంగా పెట్టడంలో కుజగ్రహం శాంతించటం, రాహు-చంద్ర ప్రభావాలు తొలగటం అనే అంతరార్థం ఉంది.
• మినపపిండి రాహువుకు, బియ్యం చంద్రునికి చెందినవి. వీటితో చేసిన అట్లు నైవేద్యంగా పెడితే గర్భసంబంధ సమస్యలు తొలగుతాయని నమ్మకం.
⸻
🌸 అట్లతద్ది ఆచారాలు 🌸
• తెల్లవారుజామున గౌరీదేవి పూజ.
• చంద్రదర్శనం అనంతరం 11 అట్లు నైవేద్యంగా సమర్పణ.
• 11 ముత్తయిదువులకు వాయనాలు (అట్లు, ఫలాలు, తాంబూలం).
• ఊయల ఊగటం, పాటలు పాడటం.
• పదేళ్లు వ్రతాన్ని కొనసాగించి ఉద్యాపనం చేసిన స్త్రీలు సంపూర్ణ సౌభాగ్యం పొందుతారని నమ్మకం….
ఇట్లు
మీ
కోటేశ్వరరావు ఉప్పాల