ఒంటరి ప్రయాణాన్ని నేను

ఒంటరి ప్రయాణాన్ని నేను…!!!

భారతాన ఉన్నోళ్ళందరు దేవుళ్ళే
తమవంతు కథలతో మెప్పుబడ్డారు…
కలియుగాన కారణంలేని పురిటితో
వ్యసనం విసరిన అనాధని అభాగ్యున్ని…
పేగు తెంచిన బంధంతో తల్లికి దూరమై
ఆప్యాయతలు అనురాగాల పాలనకు
నోచుకోని ఒంటరి ప్రయాణాన్ని నేను…

విస్తరుండని వీధి భాగవతాలతో
కలగనేదేముంటుంది ఈ జీవితాన…
సలిపిన ఆకలి దప్పికల పిలుపులతో
పసిదవడలను కొరికినా పచ్చినెత్తురే తప్పా
నా అన్నవారేలేని వింత బతుకు…
విసుగెత్తిన చూపుల చీత్కారాలతో
గాయపడినా ఆ మనస్సుకు మందేది
మరుపే మచ్చికై సాగిపోవడమేనా….

విస్తుపోయినా పస్తులుండక తప్పదు
తెలియని పయణం శాపమవుతు…
కష్టాల కడలిలో మునుగుతు తేలుతు
తీరం చేరినా తీరని అగచాట్ల పర్వంతో…
ఏకన్ను పూసిన కామమో కనుపాపలు
ఎండిన ముఖంతో ఆటలాడని బాల్యం
కాసిన మొగ్గలోనే చితికిపోతుంది…

మాకంటు ఏముంటుంది లోకాన
బతుకు బడిగా అరచేయిని చాపుతు…
అతుకుల బొంతని కప్పుకొని కూటికోసం
కోటి విద్యలు నిత్య పాఠాలై వినిపిస్తుంటే…
కునుకుపడని రోజు కుషలగీతమే…
కడుపు నిండని నాడు ఆనంద గీతమే
తేడాలేని భావనతో నిత్యానికి సంచారమే…

దేరంగుల భైరవ (కర్నూలు)
9100688396

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *