కొందరు కొన్నింటిని మరి
కొందరు బహుళమ్ముగాను గూర్చిన కవితల్!
కొందరు ముద్రించిన మరి
కొందరు ముద్రించ లేదు కుదరక కృష్ణా!!
చేపలు చేతికినీయక
చేపలు పట్టుటను నేర్ప జీవితమున తా
చేపలు పట్టి బ్రతుకుచున్
చేపల బేరమ్ము జేయు చివరకు కృష్ణా!!
పొగడకు పరసతులనెపుడు
పొగడకు పరసంతునిలను, పొగడుము సంతున్
పొగడకుమా పర జనకుల
పొగడిన పొగడు కులసతిని పొలుపుగ కృష్ణా!!
బంతులుగా జేసియు నా
పంతుళ్ళను తూలనాడు పాలకులేలన్
గొంతెమ్మ కోర్కులంచును
పంతుళ్ళు బకాయిలడగ బాదిరి కృష్ణా!!
నడిపించగ తలిదండ్రులు
నడవడికను నేర్పు గురులు నమ్మిన యెడలన్
సడలించక భార్యామణి
కడవరకును నిలుచు కలిసి గదరా! కృష్ణా!!
మలమూత్రాలను కడుగుచు
నెలవంకను జూపిముద్ద నేర్పుగ బెట్టన్
నెలజీతమ్మును బొందియు
తలిదండ్రుల గనని సంతు దండుగ కృష్ణా!!
ఇనుముకు పట్టిన త్రుప్పది
కనగా నాశనముజేయు గదలక యున్నన్
మనిషికి చెడు తలపు గలుగ
పనిగట్టుకు క్రుంగదీయు పట్టున కృష్ణా!!
గడ్డం కృష్ణారెడ్డి.రేపాల సూర్యాపేట!!