కనువిప్పు కథ
ఏమండోయ్ మిమ్మల్నే స్నానాధికాములు కానించి కాస్త తెమలండీ అనసూయ హడావిడి చేస్తోంది.
పరంధామయ్య లేని ఊపిరి బిగబట్టుకుని ఏమిటే ఇవ్వాల ఇంత హుషారుగా ఉన్నావు అంటూ కుర్చీలోంచి లేచాడు.
మనమ్మాయి ఐశ్వర్యకు సంబంధమొకటి పక్క ఊరిలోనే పెళ్ళిళ్ళ పేరయ్య చూశాడు. మనం వెళ్లడమే తరువాయి కట్నకానుకలు లేకుండా ఒప్పేసుకుంటారట. మనమ్మాయిని అబ్బాయి చూశాడట చాలా బాగా నచ్చిందట అంటూ అనసూయ ఏకరువు పెడుతోంది.
పరంధామయ్య అనుమానంగా ఇంతకు అబ్బాయి ఏం చేస్తుంటాడు? అని అడిగాడు
ప్రతిదానికి మీ అనుమానం మీరూను, అబ్బాయి లక్షణంగా పట్నంలో పెద్ద ఉద్యోగం చేస్తున్నాడట అంటూ చెప్పుకుపోతోంది అనసూయ.
ఎలాగైతేనేం ఎడ్ల బండిపై అనసూయ, పరంధామయ్య అబ్బాయి ఇంటికి చేరుకున్నారు.
అబ్బాయి అమ్మా నాన్నలు ఎదురుగా వచ్చి సాదరంగా ఆహ్వానించారు. అబ్బాయి సూటులో హీరో లా ఉన్నాడు. అబ్బాయి తండ్రి తన కుమారుడు పట్నంలో చేస్తున్న ఉద్యోగం అవీ చాలా గొప్పగా చెబుతుంటే అనసూయ ఉబ్బితబ్బిబ్బు అవుతోంది.
అబ్బాయి తండ్రి తమకు కట్నకానుకలు అవసరం లేదు. మా అబ్బాయి మీ అమ్మాయిని చాలా సార్లు చూసి ఇష్టపడుతున్నాడు, అంటూ చెప్పుకుపోతున్నాడు.
తరువాత అందరూ భోజనాలకు కూర్చున్నారు.
పరంధామయ్యకు అనసూయకు వెండి కంచాలలో భోజనం వడ్డించారు. అనసూయకు ఆనందమే ఆనందం.
పరంధామయ్య ముభావంగా గుంభనంగా ఉన్నాడు.
అనసూయ పరమానందంతో వెళ్లి వస్తామండీ.ఓ మంచి రోజున మీకు కబురంపుతాం మా ఇంటికి వచ్చి ఏకంగా పెళ్ళి నిశ్చయం చేసుకుందాం అంటూ గడగడా చెప్పుకుపోతోంది అనసూయ.
ఎడ్ల బండిపై ఇంటికి వెళ్తుంటే పరంధామయ్యకు మనస్సులో మనస్సులేదు.
ఇంట్లోకి వెళ్ళగానే పరంధామయ్య గుండెల నిండా ఉబికివస్తున్న కోపంతో అనసూయను నీవు మనిషివేనా ప్రతి దానికి ఉబ్బితబ్బిబ్బయి ఆలోచించేదే లేదా? నీవు నేను అన్నం తిన్న వెండి కంచాలు మనింట్లో దొంగలు పడ్డప్పుడు దోచుకెళ్ళిన మన కంచాలు. వాటిమీద నా పేరు చెరగకుండా చెక్కాడు కంసాలి.నేను అనుకోకుండా చూశాను కాబట్టి సరిపోయింది. లేకపోతే మనమ్మాయిని దొంగోడికిచ్చి పెళ్ళి చేయాల్సి వచ్చేది.
అనసూయ బోరున ఏడుస్తూ లబోదిబోమంటోంది.
అపరాజిత్
సూర్యాపేట
హామీపత్రం :ఈ రచన నా కలం సేతయని నా హామీ.