కాశీయాత్ర ( మొదటి రోజు )

తేదీ 20 ఫిబ్రవరి 2025 గురువారం 

ఉదయం 8 గం.లకు నిద్రలేచాము.కొందరు 9 గం.లకు లేచి ముఖాలు కడుక్కొని, కాలకృత్యాలు తీర్చుకున్నారు. వెంటతెచ్చుకున్న తినుబండారాలు… చపాతీలు ,పూరీలు, పులిహోర , కారప్పూస ,పండ్లు తిని టిఫిను అయిందనిపించాము.కొందరు టీలు తాగారు. కొందరు లేచి సీట్లల్లో కూర్చున్నారు.సీట్లు లేని కొందరు పైబెర్తులో ఆలాగే పడుకున్నారు, కూర్చున్నారు.సాయంత్రం కావస్తున్నది.అయినా తెలంగాణా సరిహద్ధులు దాటలేదు. రోజూ నడిచే రైలు కానందున ఏ రైలు అడ్డు వచ్చినా మా రైలును ఆపేస్తున్నారు.అందువల్ల ఆలస్యముగా నడుస్తున్నది.1450 కి.మీ మా ప్రయాణంలో ఎప్పటికైనా వెళ్ళనీ…మనం చేసేదేమీ లేదు అని పడుకున్నాము.
మా రైలు బలార్సా.. నాగపూర్ దాటిందేమో. రాత్రి 12-30 గం.లకుచందానగర్ స్టేషన్ ప్రాంతంలో రైలు ఆగగానే మా స్లీపర్ కోచ్ లో విపరీతంగా జనం ఎక్కారు.కారణం …రోజూ నడిచే రైలును ఈ రోజు రద్ధు చేశారట. ఆ జనం అంతా ఇందులో ఎక్కారు. కాలుపెట్టే సందు లేకుండా దారిలోనే వారి లగేజీలు పెట్టి, దుప్పట్లు పరుచుకొని ,ఒకరిమీద ఒకరు ఒరిగి పడుకున్నారు.ఇలాంటి పరిస్థితి వస్తుందని ఊహించని మేము, ముఖ్యంగా మహిళలు .. బాత్ రూముకు వెళ్ళడమెలా? అని వాపోతున్నారు.కింద బెర్తు పై పడుకున్నవారు ఎటూ కదలడానికి వీలు లేదు.అలా గంటల కొలది ప్రయాణము చేసినా తెల్లవారదు, గమ్యం రాదు.పాపం కింది బెర్తులో ఆడవారు అనంతపురం జిల్లా వారు.20 మంది జట్టు వారిది .బోగీ ఇదే కాని మనకు లాగేసీట్లు ఒకేదగ్గర రాలేదు.వారి ఇబ్బందిని గమనించిన మా జట్టు లోని కోటేశ్వరరావు గారు…. “ఇలా రండి నా వెనకాల .కాలు తగులుతుంది , వేలు తగులుతుంది అని అనుకోకుండా పడుకున్న వారి మధ్యలో,లగేజీల మీద కాలు ఆనిస్తూ… ఒక్కొక్క అడుగు వేస్తూ , ఇద్దరు మహిళలను బాత్ రూము వరకు తీసుకెళ్ళారు.అక్కడ బాత్ రూము తెరిచే పరిస్థితి లేకుండా ఉన్నది. అలా పద్మవ్యూహాన్ని ఛేదించుకుంటూ వెళ్ళి ప్రకృతి అవస్థ నుండి సేదదీరి , మరల అలాంటి యుద్ధమే చేసుకుంటూ వచ్చి సీట్లలో చేరారు. నేనూ స్పైడర్ మ్యాన్ లా పై బెర్తులను పట్టుకొని కింది సీట్ల అంచుల్లో కాళ్ళు పెట్టుకుంటూ గాలిలోనే పయనిస్తూ బాత్రూమ్ కు వెళ్లి వచ్చాను. అప్పటికి తెల్లవారింది.దారిలో పడుకున్నవారు ఇంకా గాఢనిద్రలోనే ఉన్నారు.ఇడ్లీ , సమోసా ,టీ , బిస్కెట్లు , వాటర్ బాటిల్స్ అమ్మేవారు నిర్దాక్షిణ్యంగా ఒరుసుకుంటూ అటూ ఇటూ తిరుగుతున్నారు.

-కోట పెంటయ్య
🕉️💐🕉️

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *