తేది 21 ఫిబ్రవరి 2025 శుక్రవారం
ఉదయం 7 గంటలవుతుంది. నేను టూత్ బ్రష్ ,పేస్టు పట్టుకొని వెళ్ళి బ్రష్ చేసుకొని, కాలకృత్యాలు తీర్చుకుని ప్రశాంతత పొందాను.నిన్నటి నుండి మాకు విభూది స్నానాలే.కాశీలో దిగాలనుకున్న మాజట్టు పెద్దలు మళ్ళీ వెనుకకు రావడం మెందుకు? ప్రయాగ రాజ్ లో దిగుతామని, ఇక్కడే గంగా స్నానము చేసుకొని కాశీకి వెళదామని నిర్ణయించారు అప్పటికప్పుడు.ఇట్టే సమయము లేదు. 10 ని.లలో రైలు ప్రయాగ రాజ్ లో ఆగుతుంది అని ముందుగా లగేజీలన్ని డోరువద్దకు చేర్చాలని మా టీము లీడరు వీరభద్రం గారు హెచ్చరించారు.అయితే దారికడ్డంగా వున్న జనమంతా దిగితేనే మా లగేజీలు తీయడం వీలవుతుంది.వారు దిగినాకే మేము దిగుదామని అనుకున్నాము.7-30గం.లకు ప్రయాగ రాజ్ స్టేషన్ వచ్చేసింది. ముందుగా మాలో ఒకరు దిగి లగేజీలన్నీ ఒకరికొకరు అందిస్తూంటే ఎక్కే వాళ్ళు ఎక్కేప్రయత్నం చేస్తున్నారు. భద్రంగారు వారిని అదిలించి మమ్మల్ని దిగేవరకు మీరు ఎక్కవద్దని ఆపారు. అందరం దిగి లగేజీలన్నీ వచ్చాయా అని చూసుకున్నాము. “హమ్మయ్య ” అని ఊపిరి పీల్చుకున్నాము.అంతలోనే మరోరైలు వస్తుందని ప్లాటఫాం ఖాళీ చేయాలని, లగేజీలు తీయాలని పోలీసువారు హెచ్చరిస్తూ ,తొందరపెడుతున్నారు.
ప్లాట్ఫారం కిటకిటలాడుతుంది.పరిసరాలన్నీ దుర్గంధంగా ఉన్నాయి.కూర్చనే చోటు లేదు.లగేజీలు కొంచం వెనక్కి జరిపి అక్కడే పూరీలు , చపాతీలు తిన్నాం.మమ్మల్ని అక్కడే ఉండమని ఇద్దరు ముగ్గురు పెద్దవారు బయట ఎక్కడ బస దొరుకుతుందో కనుక్కొని వస్తామని వెళ్ళారు.మాస్కులు ధరించినా మా ముక్కు పుటాలు అదిరిపోతున్నాయి. అరగంట వరకు ఆ దుర్గంధాన్నే సుగంధంగా భరించాము.అప్పుడు బయటకు వెళ్ళినవారు వచ్చి ” స్టేషన్ కు దగ్గరలోనే ..*శ్రీ రామా వాటిక “లో గదులు ఉన్నాయనీ ,మాట్లాడి వచ్చామనీ , చెప్పగా లగేజీలన్నీ పట్టుకొని దాదాపు 400 మీటర్లు నడిచి ఆ సత్రములో ఒక పెద్ద గదిలో ప్రవేశించాము. అందులోనే హోటల్ , లాడ్జి ,అద్దెగదులు, ఫంక్షన్ హాల్ ,చిన్న పార్కు… ఇలా అనేక రకాలుగా ఉపయోగకరంగా ఉంది.
మా గదిలో లగేజీలన్ని పెట్టి కొందరు కూర్చుని , కొందరు పడుకొని , కొందరు స్నానంచేసి సేదతీరారు.అప్పటికి 10-30 కావస్తుంది.సంగమ స్నానానికి వెళ్ళాలని ,అందుకు ఆటోల్లో కాకుండా అందరికీ ఒకే వాహనమైతే బాగుంటుందని ట్రాలీలో బయలు దేరాము.స్నానాల రేవు 7 కిలోమీటర్ల దూరంఉంది.పైన ఎండవల్ల , ట్రాలీలో నిలబడి ప్రయాణము చేయడం వల్ల కొందరికి కళ్ళు తిరిగి , ఒళ్ళు తిరుగు తున్నాయి.ఇంకా కిలో మీటరున్నర రేవు కు ముందే దింపాడు.ఇక ముందుకు పోదన్నాడు ట్రాలీడ్రైవరు.
కళ్ళు , ఒళ్ళు తిరిగిన కొందరు అక్కడే కూర్చున్నారు . కొందరు కొబ్బరి బోండాలు తాగారు , టీలు తాగారు ,కొద్దిసేపు కూర్చున్నారు. అక్కడి నుంచి ఒకటిన్నర కిలోమీటర్ల దూరం నడిచి రేవు వద్దకు చేరుకున్నాము. ఆ దూరం కూడా నడవలేని వారికి బైకులపై తీసుకుపోతున్నారు. అందుకు 100 నుండి 200 రూపాయలు డబ్బులు తీసుకుంటున్నారు. మేమంతా ఓపిక చేసుకొని నడుచుకుంటూ వెళ్ళాము.అప్పటికి మధ్యాహ్నం దాటింది. రేవు వద్ద మరీ రద్దీగా లేదు.స్నానాలు చేయుటకు ఇబ్బంది లేకుండానే ఉంది. కొందరు బ్రిడ్జిపై నడిచి ఆవలి ఒడ్డుకు వెళ్ళి స్నానాలు చేస్తున్నారు.మాకు అంతదూరం నడిచే ఓపిక లేక ఈవలి ఒడ్డునే దగ్గరి రేవుకు చేరుకున్నాము. నడుము లోతు నీళ్ళలోకి వెళ్ళి “హర హర మహదేవ శంభో శంకర. , గంగేచ యమునేచైవ గోదావరి సరస్వతీ. .. అంటూ , శ్లోకం రానివారు గంగా. .. గంగా.. గంగా ..అని ముమ్మారు మునిగి మహా కుంభ మేళాలో సంతోషంగా స్నానాలు చేశాము.
ప్రతి నిమిషము హెలికాప్టర్ ల ద్వారా నిఘా ఏర్పాట్లు , పర్యవేక్షణ తో నిరంతరం అప్రమత్తమై, ఎవ్వరికీ ఏ ఇబ్బందీ కలగకుండా చక్కటి వసతులు కల్పించిన యు. పి . ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్య నాథ్ , వారణాసి ఎమ్. పి . , ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారల ముందు చూపుకు ధన్యవాదములు తెలుసుకుంటూ , 144 సం.రాలకు ఒక్కసారి వచ్చే ” మహా కుంభమేళాలో ‘” గంగా స్నానము చేసే అవకాశము , అదృష్టము మాకు కలిగించినందుకు ఆ శివయ్యకు మనసులోనే కోటి నమస్కారాలు చేసుకున్నాం .
అందరి స్నానాలు అవగానే అనుకోకుండా మావద్దకు ఒక అయ్యవారు వచ్చి హిందీలో మాట్లాడుతూ “గంగమ్మ తల్లికి దీపార్చన చేసి మీ కోర్కెలు తీర్చాలని సంకల్పం చెప్పుకోండి ” అని అంటూ మహిళా మణులందరిచే దీపార్చన చేయించి సంకల్పం చెప్పించారు.వారికి తగిన సంభావనలిచ్చి, వెనుకకు మళ్ళగా నుదుటిపై గంధపు బొట్లు పెట్టేవారు సిద్ధముగా ఉన్నారు.అందరం గంధముతో నుదుటిపై అద్ది త్రిశూలం గుర్తులతో నామాలు పెట్టించుకున్నాము.అందరం శివభక్తులుగా ,భుజాలపై గులాబీ కండువాలతో ముఖాలు దేదీప్యమానంగా వెలిగి పోతున్నాయి. మా జట్టు లీడరు మేము ఎవ్వరం తప్పి పోకుండా , సులభంగా గుర్తుపట్టేందుకు ఈ కండువాలు ధరించే ఏర్పాట్లు చేశారు. అవి మాకు చాలా ఉపయోగపడ్డాయి. ఈ సమయంలో అందరం కలిసి ఫోటో దిగాలని అనుకున్నాము.మగవారంతా ఒక గ్రూపు ఫోటో దిగారు.అలాగే మహిళామణులు అంతా ఒక గ్రూపు ఫోటో దిగారు. అందరం కలిసి మరో ఫోటో దిగాము.అందరం కలిసి దిగాలనుకున్న కోరిక ఇప్పుడు నెరవేరింది.
హిందూ సనాతన ధర్మం గొప్పదనాన్ని ,సమతాభావాన్ని , పరోపకార గుణాన్ని మానవతా దృక్పథాన్ని చాటుతున్న ఈ సంగమ స్నాన ఘట్టాల్లో స్నానాలు చేస్తూ మనసులోని ప్రాపంచిక కోరికలన్నీ వదలి ప్రారబ్దము, కర్మ ఫలములు పొందాలని ఈశ్వరేచ్ఛ. ఎవరి కర్మఫలములను వారికి అనుభవించే మరుజన్మలు ప్రసాధించడములో సకల ప్రాణికోటిపై ఈశ్వరుడు నిష్పక్షపాతము చూపుతాడు. స్నానాల రేవునుండి వెనుదిరిగి వస్తూంటే అక్కడి భక్తులకు వీడ్కోలు చెప్తూ, యు.పి. ప్రభుత్వానికి మరొక్కమారు ధన్యవాదాలు తెలుపుకున్నాము.
మేము రేవు నుండి వస్తుంటే సంగమ రేవులకు వెళ్ళే అనేక దారులు ఒక్కటవుతున్నాయి. మేము వెళ్ళిన రేవు 43 వది. ఇంకా ఎన్ని రేవులున్నాయో మాకు తెలియదు. ఆ ప్రాంతమంతా అనేక గుడారాలతో ఒక క్రమపద్ధతిలో , విశాలమైన వీధులులతో ఉన్నాయి. వేరు వేరు ప్రాంతాల నుండి వచ్చిన వారు, వారి సాంప్రదాయ కళా నృత్యాలు ,భజనలు, ప్రదర్శనలు చేయుటకు పెద్ద పెద్ద ప్రాంగణాలు ఏర్పాట్లు చేయబడి ఉన్నాయి. దారిలో మేము ఒడిస్సావారో బీహార్ వారో కళాప్రదర్శనలు చేస్తుంటే కొద్ది నిమిషాలు కూర్చొని ఆస్వాదించాము చీకటి పడితే శివతాండవం, గంగావతరణము లేజర్ షోలు మొదలైన అనేక ప్రదర్శనలు ఉంటాయట.అప్పటి వరకు ఉండలేక అక్కడి నుండి కొంచము ముందుకు నడిచి , రెండు ఆటోలు మాట్లాడుకొని మా బస “శ్రీ రామ వాటిక “కు చేరుకున్నాము.మొదట ట్రాలీకి ఒక్కొక్కరికి 50/-ల చొప్పున అయితే ఆటో లో మనిషికి 100/-ల చొప్పున చార్జీ తీసుకున్నాడు.అయినా నడువలేని మాలాంటి వారికి సౌకర్యమే.కాని ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఉంటుందని సందుగొందుల్లో, ఎగుడు దిగుడుల్లో ఆటోలు నడిపించగా మా ఒళ్ళు హూనం అయింది.అంతా అలసిపోయి ఉన్నందున గదిలో ఒకగంట సేదదీరి, అందులోనే హోటలుకూడా ఉన్నందున ఎవరికి తగిన ఆహారం వారు తిని వచ్చి ,” రేపు ఉదయం కాశీకి వెళ్దాము ” అని చెప్పుకొని అంతా నిద్రించాము.
🕉️🙏🕉️
-కోట పెంటయ్య