కాకర్లపూడి యోగ నారసింహ పతంజలి (మార్చి 29, 1952 – మార్చి 11, 2009) తెలుగు రచయిత, కవి, పత్రికా సంపాదకుడు, ఆయుర్వేద వైద్యుడు.
పతంజలి 1952 మార్చి 29న ఆంధ్ర రాష్ట్రంలో విశాఖపట్టణం జిల్లాలోని (ప్రస్తుతం విజయనగరం జిల్లాలో) అలమండ గ్రామంలో జన్మించాడు. తండ్రి వేంకట విజయగోపాలరాజు, తల్లి సీతాదేవి. వారిది క్షత్రియ కుటుంబం. వారిది వాశిష్ట గోత్రం, అతని కుటుంబపు చుట్టపక్కాల్లోని ఆంధ్రదేశంలోని పలు జమీందారీ, రాచ కుటుంబాల సహా విజయనగర సంస్థానాధీశులైన పూసపాటి వంశీకులు కూడా రక్త సంబంధీకులే. ఆలమండ గ్రామం రాజులకు పుట్ట. వేటలు చేయడాలు, పౌరుషాలు ప్రదర్శించుకోవడాలు, సరదాలకు డబ్బు ఖర్చుచేయడాలు, బంధువర్గానికి భారీ మర్యాదలు చేయడాలు- వంటి రాచ అలవాట్లు పతంజలి జన్మించేనాటికి ఊరిలో బంధువులు ఎందరి ఇళ్ళలోనో ఉన్నా పతంజలి తండ్రి గోపాలరాజు మాత్రం ఆధునికంగా ఉండేవాడు. పతంజలికి ఒక అన్న, నలుగురు తమ్ములు, ఒక చెల్లెలు ఉన్నారు.
పతంజలి తండ్రి గోపాలరాజు అలోపతీ, యునానీ, ఆయుర్వేద వైద్యాల కలగలుపు అయిన లైసెన్షియేట్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ మెడిసిన్ (ఎల్.ఐ.ఎం.) చదువుకుని వైద్యం చేసేవాడు. గోపాలరాజు వైద్యంతో పాటుగా ఖగోళ, జ్యోతిష శాస్త్రాలు, పాశ్చాత్య సాహిత్యం, భారతీయ సాహిత్యం, వేదాంతం వంటి ఎన్నో శాస్త్రాలు అధ్యయనం చేసేవాడు. అతను ఇంట్లో పెద్ద ఎత్తున ఆంగ్లం, సంస్కృతం, తెలుగు గ్రంథాలను, వివిధ శాస్త్రాలకు చెందిన పత్రికలను తెప్పించుకుని భారీ గ్రంథాలయం ఏర్పాటుచేసుకున్నాడు. భారతీయ శాస్త్రాల మీద తనకున్న ఇష్టం కారణంగానే రెండవ కుమారుడి పేరు సంస్కృత వ్యాకరణానికి మహాభాష్యాన్ని, యోగసూత్రాలను అందించిన పతంజలి పేరు (యోగ నారసింహ పతంజలి) పెట్టుకున్నాడు. అతని తర్వాత పుట్టిన మగపిల్లలకు వివిధ దర్శనాలను, వేదాంతాన్ని అందించిన మహర్షులు గౌతముడు (న్యాయ గౌతమశంకర్), కణాదుడు (వైశేషిక కణాద సూర్య ప్రభాకర్), జైమిని (భగవాన్ కృష్ణ మీమాంస జైమిని), వ్యాసుడు (వేదాంత వ్యాసప్రసాద్) పేర్లను గోపాలరాజు పెట్టుకున్నాడు.
పతంజలికి, అతని సోదరులకు సాహిత్యాభిలాష తండ్రి నుంచి నుంచి వారసత్వంగా వచ్చింది. తండ్రి నుంచి వైద్యాన్ని కూడా పతంజలి తర్వాత్తర్వాత పుణికిపుచ్చుకున్నాడు.
పతంజలి బాల్యం అలమండ గ్రామంలోనే సాగింది. రెండున్నర ఎకరాల సువిశాల క్షేత్రంలో చుట్టూ ప్రకారం మధ్యలో నాలుగిళ్ళ లోగిట్లో అతను పెరిగాడు. ఊరికి కొద్ది దూరంలోనే కొండలు, అడవి ఉండేవి. గ్రామంలోకి అప్పుడప్పుడూ చొరబడే అడవి జంతువులకు తోడు రకరకాల జంతువులను సీతాదేవి, గోపాలరాజు పెంచేవారు. ఇంట్లోనూ, బయటా ఉండే రకరకాల జంతువులు, పక్షులూ, ఇంటికి వైద్యం చేయించుకోవడానికి వచ్చే రకరకాల సామాన్యులూ, పేదలూ, తన బంధువర్గంలో రకరకాల వ్యక్తుల మాటతీరు, ఆలోచనా విధానం, గ్రామ జీవితం- ఇవన్నీ చిన్నతనం నుంచీ పతంజలి పరిశీలించేవాడు.
అందరూ బుచ్చి అని పిలుచుకునే అతని మేనమామ ఉప్పలపాటి అప్పల నరసింహరాజుతో పతంజలికి, అతని తమ్ముళ్ళకి మంచి సాన్నిహిత్యం ఉండేది. తన అక్క సీతమ్మ ఇంట్లోనే పెరిగినవాడు కావడంతో బుడతనపల్లి రాజేరు నుంచి ఎప్పడు తోచితే అప్పుడు అలమండ వచ్చి అక్కా బావల ఇంట్లో ఉండేవాడు బుచ్చి. బుచ్చిమామ వేట జట్లలో ఉండేవాడు, ఎంతో తిరిగినవాడు. అతను విన్న, చూసిన వేట కథలను, ఇతర విశేషాలను వేళాకోళం, వెక్కిరింతలతో హాస్యంగా వినిపిస్తే పతంజలి మరీ మరీ చెప్పించుకుని వినేవాడు. వీటికి తోడు ఎనిమిదేళ్ళ వయసు నుంచి ఇంట్లో దొరికిన ప్రతీ పుస్తకాన్ని ఆసక్తిగా చదవడం మొదలుపెట్టాడు. ఆ దశలోనే మామ చెప్పిన కథలను, తాను చదివే కథల్లాగా రాయాలన్న ఆసక్తి పుట్టుకువచ్చింది.
గోవాడ చక్కెర కర్మాగారంలో పతంజలి మేనమామలు పనిచేస్తూ ఉండడంతో, వారు కాస్త పర్యవేక్షిస్తూ ఉండే వీలుంటుందని, మెరుగైన విద్య లభిస్తుందని పతంజలిని నేటి విశాఖపట్టణం జిల్లాలోని చోడవరంలోని బోర్డింగ్ స్కూల్లో పెట్టి చదివించారు. హైస్కూలు దశకు వచ్చేసరికి పతంజలి చదువు చోడవరం నుంచి నేటి విజయనగరం జిల్లాలో భాగమైన కొత్తవలసకు మారింది. ఈ దశలో పతంజలి తెలుగు డిటెక్టివ్ నవలలు విపరీతంగా చదవడం మొదలుపెట్టాడు. కొమ్మూరి సాంబశివరావు, విశ్వప్రసాద్ వంటి రచయితలు రాసిన అపరాధ పరిశోధక నవలలు క్షుణ్ణంగా, ఆసక్తిగా చదువుకునేవాడు. ఐతే, వీటిని చెత్తపుస్తకాలుగా లెక్కించి, ఇవి చదివినందుకు పతంజలిని అతని తండ్రి చితకబాదేవాడు. ఈ వేడిలోనే 1963లో పదకొండేళ్ళ వయసులోనే పతంజలి తన జీవితంలో తొలి నవలగా “అస్థిపంజరం” అన్న అపరాధ పరిశోధక నవల రాశాడు. దాదాపు అదే వయసులో చైనా యుద్ధం గురించి ఓ కవిత కూడా అల్లాడు. కొన్నాళ్ళకు పతంజలి శ్రీశ్రీ రాసిన మహాప్రస్థానం, చలం రాసిన స్త్రీ చదివాడు. ఆ రెండు పుస్తకాలూ అతనిని చాలా కుదిపివేశాయి.
ఇలా పతంజలి కొత్తవలసలో ప్రీ యూనివర్శిటీ కోర్సు వరకూ పూర్తిచేసుకున్నాడు. బీ.కాం. చదువుకోవడానికి అన్నదమ్ములతో కలసి విజయనగరంలోని అద్దెగదిలో మకాం పెట్టాడు. రోజూ క్యారియర్ అలమండ నుంచే వచ్చేది. ఆంధ్ర ప్రదేశ్‌లో రాజకీయంగా శ్రీకాకుళం జిల్లాలో నక్సలిజం వ్యాపిస్తూ ఉన్న కాలమూ, తెలుగు సాహిత్యంలో శ్రీశ్రీ తీసుకువచ్చిన ఆవేశంతో అరసం, విరసం వంటి ఉద్యమాల నుంచి క్రమేణా దిగంబర సాహిత్య ఉద్యమం ప్రారంభమవుతున్న కాలమూ పాఠకుడిగా, ఔత్సాహిక బాల కవిగా, ఆపై యువకవిగా పతంజలి రూపుదిద్దుకుంటున్న కాలమూ 1960లు, తొలి 70లు. ఈ ప్రభావం అంతా పతంజలిపై పడింది. విజయనగరంలో సోదరులతో కలిసి భారతీయ, పాశ్చాత్య సాహిత్యంలో గొప్ప గొప్ప రచనలు ఎన్నిటినో చదివాడు. రావిశాస్త్రిని, గురజాడను ఆరాధించేవాడు. తన చుట్టూ ఉన్న తెలుగు సాహిత్య వాతావరణాన్ని అవగాహన చేసుకునేవాడు. 1968లో “చివరి రాత్రి” అనే కథానికతో మొదలుపెట్టి దానికి కొనసాగింపుగా మరిన్ని కథలు రాశాడు. గొప్ప రచయితలను పోలినట్టు రాయాలన్న తమకంతో ఉండేవాడు.
పతంజలికి ఎన్నో పురస్కారాలు కూడా దక్కాయి. వీటిలో ప్రధానమైనవి:
రావిశాస్త్రి రచనా పురస్కారం
చాసో స్ఫూర్తి పురస్కారం
కృష్ణవంశీ ‘సింధూరం’ సినిమాకు ఆయనకు ఉత్తమ మాటల రచయితగా బంగారు నంది అవార్డు దక్కింది.
పతంజలి నాటకోత్సవాలు థియేటర్ ఔట్రీచ్ యూనిట్ ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని గోల్డెన్ త్రెషోల్డ్లో జరిగాయి. సాహిత్యానికీ, రంగస్థలానికీ మధ్య వంతెన కట్టే కృషిలో నిమగ్నమయి వున్న పెద్ది రామారావు నిర్దేశకత్వంలో హైదరాబాద్ యూనివర్సిటీ పరిశోధక విద్యార్థులు చంద్రశేఖర్ ఇండ్ల, నరేశ్ బూర్ల, శివ ఈ ప్రయోగానికి నాంది పలికారు.
గత కొంతకాలంగా కాలేయ కాన్సర్ వ్యాధితో బాధపడుతూ విశాఖపట్నంలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ 2009, మార్చి 11 న కన్నుమూశారు. అతని గురించి ఆయన స్నేహితులు, అభిమానులు, తోటి ఉద్యోగులూ, ఇతరులూ రాసిన వ్యాసాల సంకలనం పతంజలి తలపులు.
మాధవి కాళ్ల
సేకరణ