కొక్కొండ వేంకటరత్నం పంతులు(మహామహోపాధ్యాయ బిరుదు పొందిన ఆధునికాంధ్రులలో రెండవ వ్యక్తిగా ఘనత వహించిన సంగీతజ్ఞుడు, కవి, నాటక రచయిత)

కొక్కొండ వెంకటరత్నం పంతులు (1842 మార్చి 14 – 1915 డిసెంబరు 14) కవి, నాటక రచయిత, పత్రికా సంపాదకుడు, ఉపాధ్యాయుడు, సంగీతజ్ఞుడు. గ్రాంధికమే మాట్లాడేవాడు. మహామహోపాధ్యాయ బిరుదు పొందిన ఆధునికాంధ్రులలో రెండవ వ్యక్తిగా ఘనత వహించాడు. “ఆంధ్రభాషా జాన్‌సన్” అనే గౌరవం కూడా పొందాడు. ఆంధ్ర వాజ్మయంలో నవయుగ ప్రవర్తకత్రయం (చిన్నయసూరి, వెంకటరత్నము, వీరేశలింగము) లో ఇతను మధ్యమ స్థానాన్ని ఆక్రమించాడు.

ఇరవై రెండు సంవత్సరాలు మద్రాసు రాజధాని కళాశాలలోనూ, ఎనిమిది సంవత్సరాలు రాజమండ్రి కళాశాలలోనూ తెలుగు పండితులుగా పనిచేసాడు. ఇతను 1871 లో ‘ఆంధ్రభాషా సంజీవిని’అనే పత్రికను స్థాపించి 20 సంవత్సరాలు నడిపాడు. చెన్నైలో ఆంధ్రులచే నడుపడిన పత్రికలో ఇదే మొదటిది పత్రిక. ఆ తర్వాత ‘హాస్యవర్ధని’ అనే పత్రికను నడిపాడు. హిందూ శ్రేయోభివర్ధనీ సభను స్థాపించి, ఆంధ్రభాషలో వక్తృత్వం, ఉపన్యాస పద్ధతి నెలకొల్పి వాటిద్వారా ఆర్యమత ప్రచారం చేశాడు.

శ్రవ్యకావ్యాలను, 5 రూపకాలను, అజామీళోపాఖ్యానం అనే యక్షగానమును రచించాడు. ఇతను అనువదించిన ఐదు రూపకాలలో కేవలం మూడు మాత్రమే ముద్రించబడ్డాయి. అవి నరకాసుర విజయవ్యాయోగం (1872),[1] ధనుంజయ విజయ వ్యాయోగం (1894), ఆంధ్ర్రపసన్న రాఘవం (1897) . ‘పౌండరీకం’ అనే భాణము, శ్రీమతి బాధవం అనే నాటకం ముద్రితం కాలేదు. సంస్కృత నాటకాలను అనువదించడంలో పద్యానికి పద్యం, గద్యానికి గద్యం వరుసగా వ్రాసే పద్ధతిని ఈయనే ఏర్పరచాడు. ఈ పద్ధతి నేటికీ అవలంభించబడుతోంది. నరకాసుర విజయవ్యాయోగం రెండవ సంస్కృతాంధ్రనువాదమైనా, లభ్యమైన వాటిలో నరకాసుర విజయవ్యాయోగమే మొదటి సంస్కృతాంధ్రానువాదంగా పేర్కొనబడుతుంది.

ఇతను 1843 మార్చి 24న నరసింగరావు పంతులు, రామాంబ దంపతులకు వినుకొండలో జన్మించాడు. తండ్రి 1845లో మరణించాడు. మేనమామ అప్పయ సోమయాజి, పెదతండ్రి నందిరాజు లక్ష్మీనారాయణ దీక్షితులు. వెంకటరత్నం సంస్కృతాంధ్ర గ్రంథములు ఇంటివద్దనే చదువుతూ ఇంగ్లీషు పాఠశాలలో చదివాడు. 1855లో మేనరిక వివాహం జరిగింది.

15వ ఏటనే గుంటూరు కలెక్టరు కచ్చేరీలో గుమాస్తాగా ఉద్యోగంలో చేరాడు. 1856లో మొదటిసారి చెన్నపట్టణం వెళ్ళాడు. 1856 కంపెనీ సర్కారు సర్వే పార్టీలో ఉద్యోగానికి దరఖాస్తు చేయగా సేలంలోని సర్వే పార్టీలో ఉద్యోగం వచ్చింది. అటుతరువాత కోయంబత్తూరు దగ్గరలోని పాల్ఘాట్ వెళ్లి అక్కడ తెలుగు పాఠశాల పెట్టాడు. అందులో కన్నడం, తమిళం కూడా బోధించేవారు. కోయంబత్తూరులో నారాయణ అయ్యర్ వారి వద్ద సంగీతం నేర్చుకున్నాడు. 1864లో ఉడుపి యాత్రలో తల్లి మరణించింది. 1863లో సర్వే పార్టీ మూసివేసిన తరువాత 1866లో చెన్నపట్టణం రెవెన్యూ బోర్డులో ఉద్యోగం చేశాడు. 1870లో చెన్నపట్టణంలో హిందూ ప్రొప్రయటరీ స్కూలులో తెలుగు పండితులుగా చేరాడు. 1870 సంవత్సరములో హిందూ శ్రేయోభివర్ధనీ సమాజంను స్థాపించి దానిలో విద్యార్థులను, ఉపాధ్యాయులను, ఉద్యోగస్తులను సమావేశ పరచి ఒకొక్కసారి ఒకొక్క విషయంపై ఉపన్యాసం చేసేవాడు.

1871లో ఆంధ్ర భాషాసంజీవని పత్రిక స్ధాపించాడు. అందులో పత్రికా లక్షణాల గురించి, పత్రికా సంపాదకు లక్షణాల గురించి పద్యాలు వ్రాసేవాడు. ఆ పత్రికలో ఇంగ్లీషు పత్రికలలాగా సంపాదకీయాలు ప్రారంభించాడు. ఆ పత్రిక 1871 నుండి 1883 వరకూ, అటుతరువాత మళ్ళీ 1892 నుడీ 1900 వరకూ నడిచింది. బందరు నుండి ప్రచురించబడే పురుషార్ధ ప్రదాయిని పత్రిక 1872 జూలై సంకలనంలో కొక్కొండ స్థాపించిన ఆంధ్ర భాషాసంజీవని గూర్చి ప్రశంసిస్తూ ఇంగ్లీషులోను తెలుగులోనూ సమీక్షలు రాశాడు. ఆ పత్రికలో ప్రచురించబడిన ముఖ్య విషయాలను ఇంగ్లీషు ప్రభుత్వ ట్రాన్సలేటర్ లెఫ్టనెన్టు కర్నల్ లేన్ దొర (Lt.Col Lane) ఇంగ్లీషులోకి తర్జుమాచేసి ప్రతినెలా మద్రాసు ప్రభుత్వానికి రిపోర్టు పంపించేవాడు. 1874 నవంబరులో ఆంధ్రభాషా సంజీవని పత్రికలో సంజీవిని సమాచారమని పేరుతో దేశ పరిపాలన వ్యవహారాల గురించి 16 ప్రశ్నలు రాశాడు. ఈ ప్రశ్నలు తమ పాఠకులు చదివి తమ అభిప్రాయాలను కారణాలు ఉదాహరణలు వ్రాసి పంపమని పత్రికాధివతి కోరారు. ఆ 16 ప్రశ్నలనూ గూడా ప్రభుత్వ ట్రాన్సలేటర్ కర్నల్ లేన్ దొర ఇంగ్లీషులోకి తర్జుమా చేసి ప్రభుత్వానికి పంపాడు. ఆ 16 ప్రశ్నలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన ఆంధ్రప్రదేశ్ స్వాతంత్ర్య చరిత్ర మొదటి సంకలనములో 58వ చారిత్రక పఠముగా “Report on Telugu Newspaper for November 1874″లో ఉంది. ఆంధ్రభాషా సంజీవిని గూర్చి తిరుమల రామచంద్రగారి వ్యాసం 1986.[3] 1874 అక్టోబరులో స్ధాపించిన కందుకూరి వీరేశలింగం వివేకవర్ధని పత్రిక ఆంధ్ర భాషాసంజీవనికి పోటీ పత్రికగా నుండేది. 1871లో కందుకూరి వీరేశలింగం, కొక్కొండ వెంకటరత్నంను ప్రశంసిస్తూ వ్రాసిన లేఖ 1951, జూలై నెల భారతి ప్రచురణలో నిడదవోలు వెంకటరావు ప్రచురించాడు. కానీ 1874 నుంచీ వివేకవర్ధనిలో కందుకూరి వీరేశలింగం కొక్కొండ సంజీవని పత్రికపై విమర్శలు ప్రచురించటం ప్రారంభించాడు. 1875లో వెంకటరత్నం “హాస్యవర్ధని” స్థాపించాడు. 1876లో కందుకూరి వీరేశలింగం “హాస్య సంజీవని” ప్రచురణ ప్రారంభించాడు. ఆవిధంగా కొక్కొండ, కందుకూరిల మధ్య వ్యంగ్య వాదోపవాదాలు కొనసాగుతూ వుండేవి. 1877లో కొక్కొెండ వెంకటరత్నం మద్రాసు ప్రెసిడెన్సీ కాలేజీలో తెలుగు పండితుడిగా నియమింపబడ్డారు. 1890లో ప్రెసిడెన్సీ కాలేజీలో కొక్కొండ ఆంధ్రభాషావర్ధని స్థాపించాడు. బ్రిటిష్ ప్రభుత్వం కేవలం సంస్కృత పండితులకే ఇచ్చే మహామహోపాధ్యాయ బిరుదును 1907లో కొక్కొండ వెంకటరత్నం అందుకున్నాడు. ఆ బిరుదు అందుకున్న ప్రప్రథమ ఆంధ్ర పండితుడు ఇతడే. రాజమండ్రిలో జరిగిన ఆంధ్ర సాహిత్యపరిషత్తు సమావేశాలలో 1912 ఏప్రిల్ 23వతేదీన, 1913 ఏప్రిల్ 22 తేదీన జరిగిన సమావేశాలకు కొక్కొండ వెంకటరత్నం అధ్యక్షత వహించాడు. ఆంధ్రపత్రిక 1915 సంవత్సరాది సంచికలో ఇతని పద్యాలు.

ఇతను రచించిన మహాశ్వేత (1867) తెలుగులో తొలి నవలగా కొంతమంది భావిస్తున్నారు.
కొక్కొండ వెంకటరత్నం పంతులు 1915 డిసెంబరు 14 న మరణించాడు.

రచనలు
విగ్రహతంత్రము
ప్రిన్సాఫ్ వేల్స్ హిందూస్థాన సందర్శనం
శ్రీ బిల్వేశ్వరీయ మహాకావ్యము (తిరువెళ్ళం క్షేత్ర మహాత్మ్యము)
కోర్కొండ మహాత్మ్యము
మంగళగిరి క్షేత్ర మహాత్మ్యము
ఘటికాచల క్షేత్ర మహాత్మ్యము
అన్నవర క్షేత్ర మహాత్య్మము.

మాధవి కాళ్ల
సేకరణ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *