భీంరావ్ రాంజీ అంబేద్కర్ (డా. బాబాసాహెబ్ అంబేద్కర్ గా సుపరిచితుడు) (1891 ఏప్రిల్ 14 – 1956 డిసెంబరు 6) ప్రముఖ భారతీయ న్యాయవాది, ఆర్థిక శాస్త్రవేత్త, రాజకీయ నేత, సంఘ సంస్కర్త. ఇతను అంటరానితనం, కుల నిర్మూలన కోసం ఎంతో కృషి చేశాడు. అతను స్వతంత్ర భారతదేశపు మొట్టమొదటి కేంద్ర న్యాయశాఖ మంత్రి, రాజ్యాంగ శిల్పి.
ఇతను కొలంబియా విశ్వవిద్యాలయం నుండి పి.హెచ్.డి., లండన్ విశ్వవిద్యాలయం నుండి డి.ఎస్.సి (డాక్టరేట్) పట్టాలను పొంది చాలా అరుదైన గౌరవాన్ని సంపాదించాడు. న్యాయ, సామాజిక, ఆర్థిక శాస్త్రాలలో పరిశోధనలు చేశాడు. మొదట్లో న్యాయవాదిగా, అధ్యాపకుడిగా, ఆర్థికవేత్తగా పనిచేశాడు. తరువాత భారతదేశ స్వాతంత్ర్యం, పత్రికల ప్రచురణ, దళితుల సామాజిక రాజకీయ హక్కులు, భారతదేశ రాజ్యాంగ వ్యవస్థాపన కోసం కృషి చేశాడు. 1956లో ఇతను బౌద్ధ మతాన్ని స్వీకరించడంతో దళితులు సామూహికంగా బౌద్ధంలోకి మత మార్పిడి చేసుకున్నారు.
1990లో భారత ప్రభుత్వం అత్యున్నత పౌర పురస్కారం భారత రత్నను ఇతనికి మరణాంతరం ప్రకటించింది. భారతదేశ చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచిన నాయకుడు. ఇతను చేసిన విశేష కృషికి ఇతని పుట్టినరోజును “అంబేద్కర్ జయంతి”గా జరుపుకుంటారు. 2012లో ది హిస్టరీ ఛానల్, రిలయన్స్ మొబైల్ భాగస్వామ్యంతో అవుట్ లుక్ మ్యాగజైన్ నిర్వహించిన ది గ్రేటెస్ట్ ఇండియన్ పోల్ లో అతను మొదటి స్థానంలో ఎంపికైయ్యాడు.
భీంరావ్ రాంజీ అంబేద్కర్ 1891 ఏప్రిల్ 14 న అప్పటి సెంట్రల్ ప్రావిన్సెస్‌లో సైనిక స్థావరమైన ‘మౌ’ అన్న గ్రామంలో (ఇప్పటి మధ్యప్రదేశ్ లో) రాంజీ మలోజీ సాక్వాల్, భీమాబాయ్ దంపతులకు చివరి సంతానంగా (14వ) జన్మించాడు. ఇతని అసలు పేరు భీమారావు రంజీ అంబావడేకర్. అతని కుటుంబం ఆధునిక మహారాష్ట్ర లోని రత్నగిరి జిల్లాలో అంటవాడ గ్రామంలో నివసించినందున వారు మరాఠీ నేపథ్యం కలవారు. వీరి వంశీకులు మహార్ కులానికి చెందినవారు. ఇతని తండ్రి బ్రిటీష్ ఇండియన్ ఆర్మీలో సుబేదారుగా పనిచేసాడు.
ఆరేళ్ళ వయసులోనే అశ్రద్ధ, అవగాహన లేకపోవడం, ఆర్థిక కష్టాల కారణంగా తల్లి చనిపోయింది. మొత్తం 13 మంది తోబుట్టువులలో తొమ్మిది మంది అకాల మృత్యువాత పడగా ఇద్దరు అక్కలు – మంజుల, తులసి, ఇద్దరు అన్నలు- బలరాం, ఆనందరావు మిగిలారు.
మెహర్లను అస్పృశ్యులుగా పరిగణించడం వలన అంబేద్కర్ చిన్నతం లోనే అంటరానితనాన్ని ఎదుర్కొన్నాడు. అతను వేరే పిల్లలతో కలవకుండా, మాట్లాడకుండా పాఠశాల గదిలో ఒక మూల కూర్చోబెట్టేవారు. మిగతా కులం వాళ్ళకి భిన్నంగా అస్పృశ్యులు నీళ్ళు తాగాలంటే ప్యూన్ (కార్మికుడు) వచ్చి ఇచ్చేవాడు. అతను లేకపోతే పిల్లలు నీళ్ళు తాగే అవకాశం వుండేది కాదు. ఈ దుస్థితిని అంబేద్కర్ క్లుప్తంగా – “ప్యూన్ లేడు కనుక నీళ్ళు లేవు” అని వివరించాడు.
డబ్బులు చెల్లించే స్తోమత వున్నా సేవలు అందిచేవాళ్ళు ముందుకు రాకపోవడం వలన (మంగలి మహార్లని, చాకలి వీరి బట్టలనూ ముట్టుకునేవారు కాదు) అతని సోదరులే ఇంట్లో బట్టలు ఉతకడం, జుట్టు కత్తిరించుకోవడం చేసుకునేవారు. అంబేద్కర్ తొమ్మిది సంవత్సరాల వయసులో మాసూర్ నుండి గోరేగావ్ కి ప్రయాణం చేయడానికి ఎడ్లబండి వాళ్ళు ఎవ్వరూ (అస్పృశ్యులని) ముందుకురాకపోతే, మసూర్ స్టేషన్ మాస్టర్ సహాయంతో బండివాడికి రెండింతలు కిరాయి ఇచ్చి బండివాడు వెనుక నడువగా అంబేద్కర్ సోదరులే సొంతగా బండి నడుపుకుని వెళ్లారు.
బరోడా మహారాజు శాయాజీరావ్ గైక్వాడ్ ఇచ్చిన 25 రూపాయల విద్యార్థి వేతనంతో 1912లో బి.ఏ. పరీక్షల్లో ఉత్తీర్ణుడయ్యాడు. పట్టభద్రుడైన వెంటనే బరోడా సంస్థానంలో ఉద్యోగం లభించింది. కాని పైచదువులు చదవాలన్న పట్టుదల వల్ల ఉద్యోగంలో చేరలేదు. మహారాజుకు తన కోరికను తెలిపాడు. విదేశంలో చదువు పూర్తిచేసిన తరువాత బరోడా సంస్థానంలో పదేళ్ళు పనిచేసే షరతుపై 1913లో రాజాగారి ఆర్థిక సహాయం అందుకొని కొలంబియా విశ్వవిద్యాలయంలో చేరాడు. 1915లో ఎం.ఏ., 1916లో పి.హెచ్.డి. పట్టాలను పొందాడు. ఆనాటి సిద్ధాంత వ్యాసమే పదేళ్ళ తర్వాత ది ఎవల్యూషన్ ఆఫ్ ప్రొవిన్షియల్ ఫైనాన్సస్ ఇన్ ఇండియా అనే పేరుతో ప్రచురితమయ్యింది. 1917లో డాక్టర్ అంబేద్కర్గా స్వదేశం వచ్చాడు. అప్పటికి అతని వయస్సు 27 ఏళ్ళు. ఒక దళితుడు అంత గొప్ప పేరు సంపాదించుకోవటం ఆనాటి అగ్రవర్ణాలవారికి ఆశ్చర్యం కల్గించింది.
మహారాజా శాయాజీరావ్ సంస్థానంలో సైనిక కార్యదర్శి అయ్యాడు. కాని కార్యాలయంలో నౌకర్లు కాగితాలు అతని బల్లపై ఎత్తివేసేవారు. కొల్హాపూర్ మహారాజు సాహూ మహరాజ్ అస్పృశ్యతా నివారణకెంతో కృషి చేస్తుండేవాడు. మహారాజా సహాయంతో అంబేద్కర్ ‘మూక నాయక్’ అనే పక్షపత్రికకు సంపాదకత్వం వహించాడు. సాహు మహారాజు ఆర్థిక సహాయం చేసి అంబేద్కర్‌ని పైచదువుల కొఱకు విదేశాలకు పంపించాడు. 32 సంవత్సరాల వయసులో డా.అంబేద్కర్, బార్-అట్-లా, కొలంబియా విశ్వవిద్యాలయం నుండి పి.హెచ్.డి., లండన్ విశ్వవిద్యాలయం నుండి డి.ఎస్.సి పట్టాలను పొందాడు. కానీ కార్యాలయంలో జనులు కూడా అతనిని అస్పృశ్యుడుగా చూశారు.
1927లో మహాద్లో దళిత జాతుల మహాసభ జరిగింది. మహారాష్ట్ర, గుజరాత్ల నుండి కొన్ని వేలమంది వచ్చారు. మహాద్ చెరువులోని నీటిని త్రాగుటకు వీలు లేకపోయినా, అంటరానివారికి ఆ చెరువులో ప్రవేశం లేకుండినది. అంబేద్కర్ నాయకత్వంలో వేలాదిమంది చెరువు నీరు స్వీకరించారు. ఈ సంఘటన మహారాష్ట్రంలో సంచలనం కలిగించింది. 1927లో అంబేద్కర్ ‘బహిష్కృత భారతి’ అనే మరాఠి పక్ష పత్రిక ప్రారంభించాడు. ఆ పత్రికలో ఒక వ్యాసం వ్రాస్తూ అంబేద్కర్ ఇలా అన్నాడు: తిలక్ గనుక అంటరానివాడుగా పుట్టివుంటే ‘స్వరాజ్యం నా జన్మ హక్కు’అని ఉండడు. ‘అస్పృశ్యతా నివారణే నా ధ్యేయం, నా జన్మ హక్కు’ అని ప్రకటించి ఉండేవాడని వ్రాశాడు. అంటే ఆనాడు అంబేద్కర్ కులతత్వ వాదులు పెట్టిన బాధలను ఎంతగా అనుభవించాడో తెలుస్తుంది. 1927లో ఛత్రపతి శివాజీ త్రిశతి జయంతి ఉత్సవాలు మహారాష్ట్ర అంతటా గొప్పగా జరిగాయి. అంబేద్కర్‌ను సాదరంగా ఆహ్వానించాడు కొలాబాలోని ఉత్సవ సంఘాధ్యక్షుడైన బ్రాహ్మణుడైన బాలాయ శాస్త్రి. ఆ ఉత్సవాలలో ప్రసంగిస్తూ అంబేద్కర్ పీష్వాల సామ్రాజ్య పతనానికి ముఖ్యకారణం అస్పృశ్యతను పాటించడమే అన్నాడు.
భారత జాతీయ కాంగ్రెస్ నడిపే జాతీయోద్యములో అంటరానితన నిర్మూలన కోసం గాంధీ కృషి చేస్తూ ఉంటే, ఆ కృషికి కాంగ్రెస్ సభ్యులనుండి పూర్తి స్థాయిలో మద్దతు లభించలేదనే చెప్పాలి. గాంధి వర్ణ వ్యవస్థను భారత సమాజపు ప్రత్యేక లక్షణమని, ఎవరి కుల వృత్తిని వారు అనుసరించడం వల్ల ఎటువంటి పోటీలేని ఆర్థిక వ్యవస్థ భారతసమాజములో ఉన్నదని ఆయన సమర్థించాడు. అయితే అంటరానివారుగా భావిస్తున్న కులాల వారు తమ ఆత్మగౌరవమును త్యాగము చేస్తూ సమాజ బాగు కోసం తాము చేసే వృత్తులను చేస్తున్నారని, అటువంటి వారిని ఇతర వర్ణముల వారందరూ గౌరవించాలని పేర్కొన్నాడు. ఇలా కుల, అంటరానితన సమస్యకు గాంధీ సామాజిక, సాంస్కృతిక పరిష్కారమును చూపగా అంబేద్కర్ ఈ విషయములో గాంధీతో విభేదించాడు. అంటరాని కులాలు ఆర్థికముగా బలపడనిదే, రాజకీయాధికారము పొందనిదే వారి సమస్యకు సమగ్రమైన పరిష్కారము దొరకదని అంబేద్కర్ భావించాడు.
దేశంలో ప్రతి రాజకీయపార్టీ పై అంబేద్కర్ ప్రభావముంది. ఇది కేవలం దళిత వోట్లు దక్కించుకొనటానికే కాని సమాజాభ్యుదయం జరగటంలేదనే విమర్శ ఉంది.
అంబేద్కర్ ను దహనం చేసిన ప్రాంతాన్ని చైత్యభూమిగా పిలుస్తూ, ఆయన స్మారక నిర్మాణాలను ఏర్పాటుచేశారు.
బి.ఆర్. అంబేద్కర్ రాజగృహం అనేది బి.ఆర్ అంబేద్కర్ స్మారక చిహ్నం, ఇల్లు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోనసీమ జిల్లాను డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాగా 2022 ఏప్రిల్ 2 న పేరు మార్చింది.
తెలంగాణ ప్రభుత్వం నూతనంగా నిర్మించిన సచివాలయ భవనానికి 2022 సెప్టెంబరు 15న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం అని పేరు పెట్టబడింది.
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ట్యాంక్‌బండ్ సమీపంలోతెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా డా. బి.ఆర్. అంబేద్కర్ స్మృతివనంలో నిర్మించిన 125 అడుగుల ఎత్తైన అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని 2023 ఏప్రిల్ 14న ఆంబేద్కర్ 132వ జయంతి సందర్భంగా ముఖ్యముంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆవిష్కరించాడు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ ముని మనవడు ప్రకాశ్ అంబేద్కర్, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులలోపాటు అన్ని నియోజకవర్గాల నుంచి 50 వేలమంది పాల్గొన్నారు.
మాధవి కాళ్ల
సేకరణ