ఈ పూవుల వెలుగులు
ఉదయకాంతుల చేమంతులు
సంధ్య వెలుగుల ఆనందభైరవి రాగం
తెలుగు వెలుగుల ఉదయం తొలిపూవులు
ఈ ఫిబ్రవరి భారతమాత ప్రసవించిన వసంతరుతువు
వెలుగుతోరణాల పందిళ్లు
చలిరాత్రులకు ఆఖరిపొద్దులు
మామిడిపిందెలు కొరికే రామచిలుకలు
కోయిల పాటలతో రంజిళ్ళు రాగాలు
వేపచెట్లు చిగుళ్లుతొడిగి
తెలుపు వసంతాల లేతపూవులు
శివసత్తుల శివరాత్రి వేడుకలు
పొట్టకొచ్చిన పైరులన్నీ ప్రసవ వేదన తరుణం
రైతు కళ్ళల్లో అనిర్వచనీయమైన సంతోషం
ప్రకృతితీసే తీయదనాల పిల్లగాలులు
రాగరంజిత వృక్షాల శోభిళ్లు వసంతలక్ష్మి
వనితల కళ్ళు వెలుగుల ప్రమిదలు
ఆశలతో కొత్తఅల్లుళ్లు, కొత్తకోడళ్ల కోసం
గుమ్మాలన్నీ అలంకరించి ఎదురుతెన్నులు
పూచేపూవు వీచేగాలి తెలుపు తమపిల్లల యోగక్షేమాలు
వృద్ధదంపతుల కమిలిపోయిన కన్నీటిగాధలు
బ్రతుకులు ఈడ్చుతున్న వడలిపోయిన శరీరాలతో
కాలచక్రంలో వసంతాలు వడగాలులేన్నో
చవిచూసిన కళ్ళల్లో తేలిపోయే క్షణాలు
రేయి పూసిన నక్షత్రాలు అంబరం నిండా గిలిగింతలు గుసగుసలు
వెలుగురేఖల చమక్కులు చమరింతలు
కలలు పూసిన కళాఖండాలు పూర్ణిమలు
రానున్న ఉగాదులు ఉదయాలు ఉషస్సులు
శ్రీరామనవమి వేడుకలు ఖణఖణ మండే ఎండల్లో
తెలుగు వెలుగుల జ్యోతులు జగతికి జాగృతి ఎల్లప్పుడూ
తెలుగు వసంతాల మామిడాకుల ముద్దబంతుల తోరణాలు జగతి నిండా
తెలుగు నిన్న తెలుగు నేడు తెలుగు రేపు ఎల్లప్పుడూ తెలుగు వెలుగుల తేజస్సులే ఊపిరులు జగతికి
ఓ అవనీ తనయుడా తెలుగువాడా ఉద్యమాల నేపథ్యంలో పోరాటాల విజయుడా,,,,, ఓ జ్ఞాని తపస్వి,,,,!!
అపరాజిత్
సూర్యాపేట