దాసోహపు విశ్వమంత్రం

దాసోహపు విశ్వమంత్రం…!!!

తోడు నడిచేదనుకొంటే పొరబాటే
వీడి నడువాలను కొంటే అగుచాటే…
ఎవరిని అడుగను ఏమని చెప్పుకోను
ప్రపంచాన్ని పలికించే ముందు మాటది…!!
డబ్బుకు లోకం దాసోహపు విశ్వమంత్రం
దర్పణంకాని దౌర్భాగ్యాన్ని వరించాలంటే…
పేదోడు తనబొందిలో రోజుకొక ఎముకని
విరుచుకొని కషాయంగా తాగవలసిందే…

అందని ద్రాక్షగా పుల్లనై చిటారు
కొమ్మన మిఠాయి పొట్లంగా దొరకకా…
అమ్మబోతే అడివై కొనబోతే కొరివై కాలుతు
పెరిగిన ధరలతో గొంతును తడుపుకోలేక…
నీరుగారిన నిరాశలతో పెచ్చులూడిపోయి
మనస్సు క్షణాలను బరువుగా కలగంటు…
వేకువలేని ఊహాలోకంలో బతకడమేనా…

కరువో కాలమో కనువిప్పు కాని
నిరంతర నైవేద్యం చిలిన ఆకైపోయి…
శ్రమలకు ఫలితం ఆశించనిదై కూటిని
కలిపే చేయికి పేదోడు నేరమైపోయి…
వినియోగంకాని సమయం చీలిపోయి…
బోధపడని వ్యవస్థలో సగటు మనుషులు
రాసుకొన్న పేజీలు చెదబట్టిపోతున్నాయి…

అడిగేవారంటే మీకు కోపమైనా
తీరని వేదనగా అదిమాకు శాపమైనా…
ఎదన మడుగులను నెర్రెలు పోనీయక
శాశ్వతం పూరించిన సూర్యోదయంలో…
డబ్బుతో కొనలేనివి ఎన్నో వున్నాయని…
అమ్ముడుపోని బతుకు మనిషి ధర్మమై…
మానవతా విలువల మధ్యన ఆశయాలను
బతికించడం కోసం నిత్యాన్ని నేర్చుకోవాలి…

దేరంగుల భైరవ (కర్నూలు)
9100688396

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *