నారు నాగనార్య(సాహితీవేత్త)

నారు నాగనార్య (జులై 3, 1903 – జనవరి 18, 1973) సాహితీవేత్త. నారు నాగనార్య 1903 జూలై 3లో సుబ్బమ్మ నరసింహం దంపతులకు జన్మించాడు. తెలిక కులస్థుడు. స్వగ్రామం వైఎస్ఆర్ కడప జిల్లా రైల్వే కోడూరు సమీపంలో ఉన్న రాఘవరాజుపురం. నెల్లూరు జిల్లా వెంకటగిరిలో అష్టావధాని అల్లాడి జగన్నాథశాస్త్రి వద్ద చంధస్సు, అలంకార శాస్త్రాలు నేర్చుకున్నాడు. జనమంచి శేషాద్రిశర్మ వద్ద శ్రీవిద్య ఉపాసనము చేశాడు. ఇతడు స్వాతంత్ర్యప్రియుడు. 1921లో సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొన్నాడు. పర్లపాడు సత్యాగ్రహాశ్రమములో నివసించి ఖద్దరు సేవ చేశాడు. 1923,1947లలో సత్యాగ్రహంలో పాల్గొని జైలుకు వెళ్లాడు. 1949నుండి సాహిత్యంవైపు దృష్టి మరలించాడు. ఇతనికి వైద్యవిద్యలో ప్రవేశం ఉంది. రమణ మహర్షి పట్ల ఆకర్షితుడైనాడు. 1973 జనవరి 18న మరణించాడు.

ఇతనికి సంస్కృతాంధ్ర భాషలంటే అభిమానము. సుమారు 70 గ్రంథాలు రచించాడు. ఏకథాటిగా వందలకొద్దీ పద్యాలను అల్లగలిగే శక్తి ఉంది. అచ్చతెలుగు పై ఎక్కువ మమకారము ఉన్నవాడు. పెద్దన మనుచరిత్రను మనువుపుట్టువు అనే పేరుతోను, ముక్కు తిమ్మన పారిజాతాపహరణమును మెచ్చులపచ్చమ్రుచ్చిలి అనే పేరుతోను అచ్చతెలుగులో అనువదించాడు. ఇతని రచనలు గడియారం వేంకట శేషశాస్త్రి, జనమంచి వేంకట సుబ్రహ్మణ్యశర్మ మొదలైన పండితుల మెప్పును పొందాయి.

రచనలు

వీరపూజ
శ్రీ పృథ్వీరాజవిజయము
తిలోత్తమాసాహసికము
మనువు పుట్టువు
మెచ్చులపచ్చ మ్రుచ్చిలి.

బిరుదులు

విద్వత్కవి
సత్కవి
ఆర్య
కవితాకళానిధి.

మాధవి కాళ్ల
సేకరణ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *