నా ప్రేమ

అమ్మ చేతి వంట వాసన
ఇప్పటికీ నా చుట్టే తిరుగుతూ ఉంటుంది,
డబ్బు లేని రోజుల్లో కూడా
ఆ వాసనే నాకు ధైర్యం అయింది.

నాన్న మాటలు ఎక్కువగా ఉండవు,
కానీ నిశ్శబ్దంలోనే
బాధ్యతల బరువు మోస్తూ
ఆయన నిలబడ్డ తీరు నాకు మార్గమయ్యింది.

అమ్మ కళ్లలో కనిపించే అలసట
నన్ను నిద్రపోనివ్వదు,
నాన్న మౌనంలో దాచిన ఆశలు
నన్ను ఆగనివ్వవు.

పిల్లల నవ్వు…
ప్రపంచం ఎంత క్రూరంగా ఉన్నా
నేను ఇంకా ఓడిపోలేదని
రోజూ గుర్తు చేస్తుంది.

కుటుంబం అంటే
ఒకే ఇంట్లో ఉండడం కాదు,
ఒకరి కోసం ఒకరు
ఎడబాటును భరిస్తూ నిలబడడం.

ప్రేమ అనేది
పూలు, మాటలు, హామీలు కాదు,
బాధ్యతగా మారి
మనిషిని నెమ్మదిగా
బలంగా చేసే పేరు.

కొన్ని రోజులు ప్రేమను పలకలేము,
కొన్ని రోజులు బాధ్యతే ప్రేమభాష అవుతుంది,
కొన్ని రోజులు
నేను నేను కాకుండా పోతాను,
కానీ
వాళ్ల కోసం
నన్నే మర్చిపోవడం
నా ప్రేమ అవుతుంది….

  • నాని
  • ఈ రచన నా సొంతమే అని హామీ ఇస్తున్నాను

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *