నిజమైన వందనం

అక్షర కొరకు
అంశం :⁠- రిపబ్లిక్ డే
తేది:⁠- 24/01/2026
శీర్షిక:⁠- నిజమైన వందనం

               అది ఒక చిన్న పల్లెటూరు.ఆ ఊరి బడిలో రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.పిల్లలందరూ కొత్తబట్టలు వేసుకుని,చేతిలోచిన్న         చిన్న కాగితపు జెండాలతో సందడి చేస్తున్నారు. 

ఆ గుంపులో శివ అనే పదేళ్ల బాలుడు ఉన్నాడు. శివకి దేశం అన్నా, సైనికులన్నా ప్రాణం. వాడి తండ్రి కూడా సరిహద్దులో పనిచేస్తూ దేశం కోసం ప్రాణత్యాగం చేసిన వీరుడు.
వేడుకలు ముగిశాక, అందరూ స్వీట్లు తిని ఇళ్లకు వెళ్ళిపోతున్నారు. శివ మాత్రం బడి బయట రోడ్డు మీద పడి ఉన్న కొన్ని కాగితపు జెండాలను ఏరడం మొదలుపెట్టాడు. అది చూసి వాడి స్నేహితుడు రవి నవ్వుతూ,
“శివ! పండగ అయిపోయింది కదా! ఆ కాగితాలను ఏరి ఏం చేస్తావు పారేయ్?” అన్నాడు.
శివ చాలా గంభీరంగా రవి వైపు చూసి ,
“రవి! ఇది కేవలం కాగితం కాదు, మన దేశ గౌరవం. ఈ మువ్వన్నెల జెండా కోసం మా నాన్నలాంటి ఎంతోమంది ప్రాణాలు ఇచ్చారు.
పండగ రోజు చేతిలో పట్టుకుని, మరుసటి రోజు కాళ్ల కింద తొక్కడం దేశభక్తి అనిపించుకోదు.” శివ మాటలకు రవి మౌనంగా ఉండిపోయాడు.
అంతలో ఆ దారిలో వెళ్తున్న ఒక వృద్ధుడు వారి దగ్గర ఆగారు. ఆయన ఆ ఊరిలోనే ఉండే మాజీ సైనికుడు రామారావు గారు.
ఆయన శివ చేస్తున్న పనిని చూసి దగ్గరకు వచ్చి, శివ భుజం తట్టి ,
“బాబూ! ఈ రోజు మన దేశానికి రాజ్యాంగం వచ్చిన రోజు. అంటే మనందరికీ హక్కులతో పాటు కొన్ని బాధ్యతలు కూడా వచ్చిన రోజు.
జెండా ఎగురవేసి వందనం చేయడం ఒక ఎత్తైతే, ఆ జెండా గౌరవాన్ని కాపాడటం మరో ఎత్తు. నిజమైన రిపబ్లిక్ డే అంటే దేశం మనకు ఏమి ఇచ్చింది అని అడగడం కాదు?
దేశం కోసం మనం కనీసం ఒక చిన్న బాధ్యతనైనా నెరవేర్చడం. నువ్వు ఈ రోజు చేస్తున్న ఈ చిన్న పనిలో ఒక గొప్ప రాజ్యాంగ విలువ ఉంది” అన్నారు.
రామారావు గారి మాటలు విన్న మిగతా పిల్లలు కూడా శివతో కలిశారు. అందరూ కలిసి ఊరి వీధుల్లో పడి ఉన్న జెండాలను, చెత్తను శుభ్రం చేశారు. ఆ రోజు ఆ గ్రామంలో జెండా పండగ జరగలేదు, ఒక కొత్త చైతన్యం మొదలైంది.
శివ ఇంటికి వెళ్లి, గోడపై ఉన్న తన తండ్రి ఫోటోకి సెల్యూట్ చేస్తూ ,
‘నాన్న! నేను సైనికుడిని కాకపోయినా, ఒక బాధ్యత గల పౌరుడిగా మన దేశ గౌరవాన్ని ఎప్పుడూ కాపాడతాను?’ తన మనసులో అనుకున్నాడు.
దేశభక్తి అంటే యుద్ధం చేయడం మాత్రమే కాదు. మన పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం, జాతీయ చిహ్నాలను గౌరవించడం మరియు తోటి పౌరుల పట్ల బాధ్యతగా ఉండటం కూడా గొప్ప దేశభక్తే. అదే గణతంత్రం యొక్క అసలైన ఉద్దేశం.

మాధవి కాళ్ల..
హామీ పత్రం :⁠-

                 ఈ కథ నా సొంతమని హామీ ఇస్తున్నాను..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *