అక్షర ప్రేమలేఖల కొరకు
అంశం :- చిత్రం
తేది:- 05/01/2026
శీర్షిక:- నీ జ్ఞాపకాల సాగర తీరంలో…
“నా ప్రాణ సమానురాలైన నీకు ,
నా మనసు ఆ నిశ్శబ్ద సముద్రపు హోరులాగే అలజడికి లోనవుతోంది. ఎదురుగా నువ్వు , మౌనంగా ఉన్న ఆకాశం. ఈ క్షణంలోనే ఆగిపోతే ఎంత బాగుండు అనిపిస్తోంది?
నీకు గుర్తుందా? మొదటిసారి నిన్ను ఆ సూర్యాస్తమయంలో చూసినప్పుడు , నీ అందానికి వెలవెలబోయింది. ఆ రోజు మన మధ్య మాటలు లేవు. కానీ , మన కళ్ళు మౌనంగానే ఒకరికొకరు ఎన్నో కథలు చెప్పుకున్నాయి. నీ చిరునవ్వు చిందిస్తుంటే… ఆ నిమిషం ఈ ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిని నేనే అనిపించింది.
ప్రేమ అంటే ఏమిటి? అని ఎవరైనా అడిగితే.. ఒకప్పుడు నాకు సమాధానం తెలీదు. కానీ నిన్ను చూశాక అర్థమైంది ,
ప్రేమ అంటే పట్టు వస్త్రాలు, విలాసవంతమైన కార్లు కాదు. ప్రేమ అంటే..
ఎవరూ లేని ఆ నిర్మానుష్య తీరంలో మనమిద్దరం కలిసి పంచుకునే ఆ నిశ్శబ్దం. నా చొక్కాని నువ్వు సర్దుతున్నప్పుడు నీ కళ్ళలో కనిపించే ఆ ఆత్మీయత , అదే నిజమైన ప్రేమ.
మనం కలిసిన ఈ ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు రావచ్చు. కానీ నీ తోడు ఉంటే చాలు, ఏ కష్టమైనా నాకు తీపి జ్ఞాపకంలాగే మారుతుంది.
నీ సంతోషమే నా గమ్యం. నీ కంటి నుంచి ఒక్క కన్నీటి చుక్క కూడా రానివ్వనని, ఈ పంచభూతాల సాక్షిగా నీకు మాట ఇస్తున్నాను.
లోకం మారిపోవచ్చు , మనుషులు మారిపోవచ్చు చివరికి కాలం కూడా తన గమనాన్ని మార్చుకోవచ్చు. కానీ నీపై నాకున్న అనురాగం ఆ సముద్రపు లోతులాగే అంతులేకుండా ఉంటుంది. ఆకాశంలో నక్షత్రాలు వెలిగినా, అస్తమించినా.. మన ప్రేమ మాత్రం ఆ ధ్రువతారలాగే నిరంతరం ప్రకాశిస్తూనే ఉంటుంది.
నీ నవ్వు అది నా ప్రపంచానికి వెలుగు.
నీ మాట అది నా హృదయానికి ఊరట.
నీ మౌనం నేను చదువుకోవాలనుకునే గొప్ప కావ్యం.
నీతో గడిపే ప్రతి నిమిషం నాకు ఒక వేడుక.
నీ జ్ఞాపకాలు లేని క్షణం నా జీవితంలో ఉండకూడదని కోరుకుంటున్నాను.
మనం ముసలివాళ్ళమైపోయినా, మన జుట్టు నెరిసినా మళ్ళీ ఒకరి చేతులు ఒకరం పట్టుకుని ఆ పాత రోజులను నెమరువేసుకుందాం. అప్పుడు కూడా మన మధ్య అదే స్వచ్ఛమైన ప్రేమ ఉంటుంది. మన ప్రేమ కావ్యం అనంతం. అది అజరామరం.
ఎప్పటికీ నీ తోడు నీడగా నిలిచిపోతూ…
నీ ప్రేమికుడు.
మాధవి కాళ్ల..
హామీ పత్రం :-
ఈ లేఖ నా సొంతం అని హామీ ఇస్తున్నాను..