నువ్వు డౌనైతే కౌంట్ డౌనే!
🌹🌹🌹🌹🌹🌹
(పెన్షనర్ల దినోత్సవం సందర్భంగా..)
ఇచ్చేసావా మొత్తం నీ సిరి..
ఇక నీ పని సరి..
ఇంకేమి మిగిలున్నా ఇవ్వు..
సలహా మినహా..!
ఆఫీసులో పదవీ విరమణ
ఇంట్లో పెదవీ విరమణ..
విధులకు గుర్తింపుగా పెన్షన్
ఇంట్లో మొదలయ్యే టెన్షన్
అక్కడ చివర రోజున సన్మానం
ఇక్కడ మొదటి రోజు నుంచే అవమానం..
ఇన్నాళ్లు విధినిర్వహణ…
ఇకపై కష్టసుఖాల
ఆరోహణ అవరోహణ…!
వృద్ధాప్యమంటే మంటే..
పంటి బిగువున బాధ..
కంటిలో కనిపించని ధార..
గుండెల్ని పిండేసే వేదన…
వడలే మోము..కదిలే పళ్లు..
అవయవాలకు తెగుళ్ళు..
మనసుకు పగుళ్లు..
భారంగా గడిచే పగళ్లు..
చివరగా నిద్రపట్టని రాత్రుళ్ళు..
నెమరువేసుకుంటూ
గతకాలపు స్మృతులు..
అనుభవిస్తూ వర్తమానపు
చేదు అనుభూతులు!
వృద్ధాప్యం..
నీకుగా అనిపించకపోయినా
ఇంట్లో వారు వేసేసే ముద్ర..
ఆపై శాశ్వత నిద్ర..
ఊరు పొమ్మంటుంది
కాడు రమ్మంటుంది..
నరకమో.. స్వర్గమో
అది చేరేలోగానే
ఇంట్లో మొదలయ్యే నరకం
మారే బంధువుల వాలకం..!
మెయిన్ హాలు నుంచి
మూల గదిలోకి మారే
నీ మకాం..
అప్పటి నుంచి
అన్నిటికీ బీ కాం
ఫించను ఠంచనుగా వస్తే ఓకే
లేదంటే చిక్కుబ్రతుకే..
అయితే ఈ వయసులో
ఆ ఫించనే భరోసా..
వృద్ధ దంపతులకు
కాస్త కులాసా..
విలాసాలకు కాకపోయినా
మందుల ఖర్చులకి..!
ఇన్నాళ్లు నీ వారి కోసం
నువ్వు పెట్టిన పరుగు..
ఇప్పుడేమి మిగిలేను
నిన్ను చూస్తేనే విసుగు…
ఇంటి పనులకైనా
పనికొస్తుందేమో అమ్మ..
నాన్న ఉత్తి దిష్టిబొమ్మ!
అయితే నిన్ను నువ్వు నిలబెట్టుకుంటే..
నీకు నువ్వు ధైర్యం చెప్పుకుంటూ
ముందుకు సాగితే..
ఠంచనుగా వస్తే ఫించను
అప్పుడు నువ్వు
ఎప్పటికీ హుషారే..
వయసు పెరిగినా
ఉండని ఇబ్బంది..
నీపై నీ నమ్మకం..
చెదరని నీ విశ్వాసమే
నీ సిబ్బంది..!
🌹🌹🌹🌹🌹🌹
పెన్షనర్ల దినోత్సవం సందర్భంగా..*
ఇట్లు
మీ
కోటేశ్వరరావు ఉప్పాల