పరిచయమైన బంధాలు…!!!
కనిపించనిది దేవుడైనా…
భక్తి పారవశ్యంతో పిలిచిన జీవుడికి
కలిపిన పదార్థంలా ముక్తికి మార్గమవుతు
కదిలే జీవన్ముక్తికి దగ్గరైన దూరాలెన్నో…
అనుభవాలు నేర్పవుతు కష్టాల కడలిని
దాటుకొంటూ నలుగురితో నడిచిన…
నీ ప్రయాణానికి పరిచయమైన బంధాలు
అనుబంధాలతో దగ్గరైన దూరాలే…
సాగర తీరాలు కనిపించని
సుడిగుండాలు ఆటుపోటులతో కమ్మిన
మేఘాలు నేలకు వినిపించని పిలుపైనా…
తొలకరి నేస్తంతో దగ్గరైన దూరాలే…
మనస్సుతో మానవత్వం పూజితమైన
మానవుడే మహనీయుడై శాసనాలతో
దగ్గరైన దూరాలు నిత్య మందిరాలే…
నింగి నేల కలువకపోయినా…
చీకటి వెలుగులు క్రమం తప్పని
కాలచక్రంతో వచ్చే ఎన్నో వసంతాలు
మరెన్నో ఋతువులతో దగ్గరైన దూరాలే…
దయ కరుణ శాంతి ప్రేమ వాత్సల్యాలతో
కన్న తల్లిదండ్రులు గురువు దైవాలనే
ఆరాధ్యాలతో చేసిన స్తుతింపుల సారంతో
పరమార్థ సత్యాలన్ని దగ్గరైన దూరాలే…
సమాజం నిలిచిన స్థూపం కాదు
బతుకు సూత్రాలతో జ్ఞాన విజ్ఞానాలను
పంచుకొనే సమయానుకూలతల దిక్సూచి
మంచి చెడులతో నీతి నిజాయితీలతో…
మనుషుల మనుగడలను నేర్పుతూ…
భవితవ్యాల భవిష్యత్తును దేశ ప్రగతిని
ఖండాంతరాల ఖ్యాతితో శిఖరాగ్రమైనా…
కీర్తించబడే రోజులు దగ్గరైన దూరాలే…
దేరంగుల భైరవ (కర్నూలు)
9100688396