అక్షర కొరకు
అంశం :- నేటి పిల్లల ప్రవర్తన,సామాజిక బాధ్యతలు
తేది:- 09/12/2025
శీర్షిక:- పాత ఇల్లు కొత్త ఆలోచన
రఘు పదహారేళ్ల కుర్రాడు. అతడి ప్రపంచమంతా తన హై-స్పీడ్ ఇంటర్నెట్ ప్యాకేజీ
మరియు అత్యాధునిక గేమింగ్ కన్సోల్లోనే ఉండేది.
బయట ఏమవుతున్నా, స్నేహితులు ఏం చేస్తున్నా రఘుకు పట్టేది కాదు?
తన రూమ్ గోడలపై వేలాడదీసిన గేమ్ పోస్టర్లు తప్ప, వేరే ప్రపంచం అతనికి అవసరం లేదు. అతని ప్రవర్తన ఏకాంతం వైపు మొగ్గు చూపింది.
ఆదివారం రోజు రఘు తండ్రి అతడిని బలవంతంగా బయటికి తీసుకువెళ్లారు.
“రఘు! మన పాత వీధిలో అమ్మమ్మ ఇల్లు ఉంది కదా. అది చాలా శిథిలమైపోయింది. దాన్ని శుభ్రం చేయాలి. వెళ్లి అంకుల్స్‌కి సహాయం చెయ్” అన్నారు.
“నేనా? నేనెందుకు? అది నా గేమ్ లెవెల్‌ను పాడు చేస్తుంది!” అని విసుక్కున్నాడు రఘు.
అయినా తప్పక వెళ్ళాడు. పాత ఇల్లు, కరెంట్ పోయి ఉంది. దుమ్ము, చెత్తతో నిండి ఉంది. అక్కడ రఘు వయసున్న మరో ఇద్దరు పిల్లలు రాజ్, సీత వాళ్ల తండ్రులతో కలిసి పని చేస్తున్నారు.
రాజ్, సీత కూడా మొబైల్స్‌కు అలవాటు పడినవారే. కానీ వాళ్లు ఆ రోజు పనిలో లీనమై ఉన్నారు. వాళ్ళు చేతులకు గ్లౌజులు వేసుకుని, పాత ఫర్నిచర్‌ను కదుపుతూ, చెత్త వేరు చేస్తున్నారు.
రఘు అయిష్టంగానే… ఒక మూల కూర్చుని తన ఫోన్లో వార్తలు చూడసాగాడు. అదే సమయంలో రాజ్ ఒక గోడ మూలన దాచిన ఒక పాత ఫోటో ఆల్బమ్ ను కనుగొన్నాడు.
“వావ్ చూడండి! మన నాన్నల చిన్నప్పటి ఫోటోలు!” అన్నాడు రాజ్ ఉత్సాహంగా.
ముగ్గురూ ఆల్బమ్‌ను చూశారు. అందులో రఘు తండ్రి చిన్నప్పుడు సైకిల్ రేసులో గెలిచిన ఫోటో ఉంది. పక్కనే రాజ్ తండ్రి మొక్కలు నాటుతున్న చిత్రం, సీత తండ్రి పాత పేపర్లతో క్రాఫ్ట్స్ చేస్తున్న ఫోటోలు ఉన్నాయి.
“మన నాన్నలు అప్పుడు ఎంత క్రియేటివ్‌గా ఉండేవాళ్లో కదా?” అంది సీత ఆశ్చర్యంగా.
“మనం మాత్రం ఒక స్క్రీన్‌కే అతుక్కుపోయాం” అన్నాడు రాజ్ నిట్టూరుస్తూ.
రఘు మనసులో ఏదో కదిలింది. అతడు ఫోన్ పక్కన పెట్టి, మొదటిసారి చుట్టూ చూశాడు. అక్కడ ఉన్న పని భారీగా కనిపించింది. అప్పుడు సీత ఇలా చెప్పింది ,
“ఈ ఇంటిని శుభ్రం చేస్తే, ఈ పాత హాల్లో పిల్లల కోసం ఉచితంగా చిన్న కోచింగ్ సెంటర్ పెడతారట. ముఖ్యంగా పర్యావరణం, డిజిటల్ భద్రత గురించి నేర్పిస్తారట.”
రఘులో ఉన్న సామాజిక బాధ్యత ఒక్కసారిగా మేల్కొంది. “కోచింగ్ సెంటరా? అయితే ఇది మన ప్రాజెక్ట్ లాంటిదే! మనమంతా టీమ్‌గా పని చేయాలి!” అన్నాడు ఉత్సాహంగా.
ఆ రోజు రఘు తన చేతులకు దుమ్ము అంటించుకున్నాడు, చెమట పట్టాడు. గేమ్‌లో ఒక లెవెల్ దాటిన దానికంటే ఎక్కువ సహకారంతో, శ్రమతో కూడిన ఆనందాన్ని అనుభవించాడు.
సాయంత్రానికి ఆ పాత ఇల్లు సగం శుభ్రం చేశారు. అలసిపోయిన రఘు, రాజ్, సీత ముగ్గురూ నవ్వుకుంటూ టీ తాగుతుంటే… రఘు తండ్రి వచ్చి అతడి భుజం తట్టారు. “చూశావ్‌రా రఘు? నిజ జీవితంలో సాధించే విజయానికి ఉండే సంతృప్తే వేరు” అన్నారు.
రఘు తల ఊపాడు. పాత ఇంటికి కాంతిని తీసుకురావడం ద్వారా, తన మనసుకు కొత్త కాంతి వచ్చిందని గ్రహించాడు. సాంకేతికత ఎంత వేగంగా ఉన్నా, మానవ సంబంధాలు, సామాజిక బాధ్యతలే జీవితంలో ప్రధానమని , ఆ రోజు అర్థమైంది.
ఇకపై తన ప్రవర్తన కేవలం గదిలోపల కాదని, చుట్టూ ఉన్న సమాజంపై కూడా ప్రభావం చూపేలా ఉండాలని నిర్ణయించుకున్నాడు.
మాధవి కాళ్ల..
హామీ పత్రం :-
ఈ కథ నా సొంతమని హామీ ఇస్తున్నాను..