బాడిగ వెంకట నరసింహారావు(కవి, సాహితీ వేత్త, బాల సాహిత్యకారుడు)

బాడిగ వెంకట నరసింహారావు (ఆగస్టు 15, 1913 – జనవరి 6, 1994) బాలబంధు బిరుదాంకితుడు. ప్రముఖ కవి, సాహితీ వేత్త, బాల సాహిత్యకారుడు.

బి.వి.నరసింహారావు బాలసాహిత్యకారుడు,బాలబంధు. 1913 ఆగస్టు 15న కృష్ణాజిల్లా కౌతరం గ్రామంలో జన్మించాడు.వందల సంఖ్యలో బాలగేయాలు రాశారు. కథలూ, నాటికలు, గేయ నాటికలు, బాల సాహిత్యంపై అనేక వ్యాసాలు రాశారు. బాలసాహిత్యం తయారు చేయడమేగాక, ఆడి, పాడి ప్రచారం చేశాడు. కాకినాడ ఆంధ్ర సేవా సంఘంలో చేరాడు. కస్తూరి శివరావు, రేలంగి వెంకట్రామయ్య ఆయనకు అక్కడ సహాధ్యాయులు. ఆ పాఠశాలలో తెలుగు పండితులు వింజమూరి లక్ష్మీ నరసింహారావు రచించిన ‘అనార్కలి’ నాటకంలో అనార్కలి పాత్ర వేశారు. ఆనాటి నుంచి ‘అనార్కలి నరసింహారావు’గా పేరొందారు. ‘పాలబడి పాటలు’ 1958లో జాతీయ బహుమతి పొందింది. 1975లో ప్రపంచ తెలుగు మహాసభలలో రాష్ట్ర ప్రభుత్వం ఆయనను సత్కరించింది. ఆంధ్రప్రదేశ్ బాలల అకాడమీ ‘బాలబంధు’ బిరుదాన్ని వారికి ప్రసాదించింది. నార్ల వెంకటేశ్వరరావు సూచన మేరకు దాదాపు 30 ఏళ్లపాటు నాట్యరంగానికి బి.వి. విశేషసేవ చేశారు. జానపదాలకు నాట్యాభినయం కూర్చారు. కృష్ణశాస్త్రి, శ్రీశ్రీ, నండూరి, కొనకళ్ల వంటి కవుల గీతాలకు నాట్యాన్ని కూర్చారు. 1942లో పాలకొల్లులో బి.వి. నాట్యాన్ని తిలకించిన ఆదిభట్ల నారాయణ దాసు మనసు పులకించి అమాంతంగా రంగస్థలం మీదికి దుమికి ‘ఒరే! నా ఒళ్ళు మొగ్గతొడిగిందిరా నీ నాట్య దర్శనంతో’ అంటూ ఆశువుగా పద్యం చెప్పి ఆశీర్వదించారు. కవిసామ్రాట్ విశ్వనాథ బి.వి. నాట్యానికి ‘భావనాట్యం’ అని పేరుపెట్టారు. బి.వి.నరసింహారావు తనకు చలం రాసిన లేఖలను పుస్తకంగా వెలువరించారు. ఇతని శతజయంతి సందర్భంగా దేవినేని సీతారామమ్మ ఫౌండేషన్ వారు అందరి బంధువయ పేరుతో మూడు సంపుటాలుగా ఇతని సమగ్ర సాహిత్యాన్ని వెలువరించారు.

రచనలు

బాలరసాలు
పాలబడి పాటలు
ఆవు-హరిశ్చంధ్ర
విరిసినపూలు
నా కథలు

భావాలు

“బాలల భావాలు బాలభాషలో వెలార్చడానికి ముందు బాల మనస్కత మనలో పుష్కలంగా ఉండాలి’
నా కొలిచే దేవుళ్ళు పసివాళ్ళు
గుండెగుడిని నిండుగ కొలు
వుండిన దేవుళ్ళు పసివాళ్ళు’’
అల్లారుముద్దు పిల్లల్లారా!
ఇల్లారండి భయపడకండి
ఇదిగో నాహృది! మీ విడిది!
ఇట దొరుకుతుంది మీకు వలసింది’’

1994, జనవరి 6 వ తేదీన విజయవాడ పుస్తక ప్రదర్శనలో చలం శతజయంతి సభలో ప్రసంగిస్తూ గుండెపోటుకు గురై హఠాన్మరణం చెందారు.

మాధవి కాళ్ల
సేకరణ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *