భాదితుడు అభాగ్యుడు

భాదితుడు అభాగ్యుడు…!!!

ఎవరన్నారో ఈ దేశం అభివృద్ధిని
సాధించిన ప్రజాస్వామ్యమని…
ప్రగతి పథాలతో విజయ సోపానమని
చీకటినే కాదు పగలును కూడా దోచే
దొంగలతో రైతుల బతుకులు లూటీనే…
గిట్టుబాటు ధరలు లేక పెట్టుబడి రాక
విరగని కొమ్మన తలలకు ఊరితాడే…

ఎండనకా వాననకా పచ్చికరువైనా
పండని ఒట్టి కరువైనా లెక్కచేయక…
రెక్కలిరుచుకొని దుక్కి దున్నిన రైతన్న
భారత స్వరాజ్యంలో దోయబడిన
మొదటి భాదితుడు అభాగ్యుడు…
అందుకొరకేనా అట్టుడుగున పరిస్థితి
దైన్యతను చూపుకోలేని దీనస్థితి…

రోజులు పంచకపోయినా గుణాన్ని
ఏమార్చక సవాళ్ళను ఎదుర్కొంటూనే…
జీవితమనే పుస్తకంలో రాయని పేజీలెన్నో
దొరకని సంక్షేమాలతో కుంటుపడేదెందరో
ఆశపడిన దేహాలతో జీవచ్ఛాలెందరివో…
ఉచితాల ఉప్పెనలు సంక్షేమ సాగరాలు
పారేదెంతవరకో నిలిచేది ఏ దరికో…!!
ఇది ఎత్తులతో రాజకీయ చదరంగమా
లేక ప్రజాదనాలు దుర్వినియోగమా…

ఎవరడిగారనో ఎందుకీ గారడీలు
భూమిని నమ్మిన భూమి పుత్రులమని…
దేశానికి అన్నం పెట్టేవాడు రైతే రాజునని
పేరుకు చెప్పుకొనే ప్రగల్భాలు మాత్రమే…
ఏతమేయని బతుకులు ఎక్కడ వేసిన
గొంగడి అక్కడైతే సాగు చేసుకునేదెప్పుడు…
సాలు నింపేదెవ్వరో తెలియని వైనంలో…
దేశమా ఆలకించలేవా రైతుల దీనగాధలు…

దేరంగుల భైరవ (కర్నూలు)
9100688396

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *