మనోఫలకం పూల పరిమళం

మనోఫలకం పూల పరిమళం!

యెద కోయిల రాగాల జల్లులు
మల్లియ మొగ్గలు విచ్చుకున్నాయి నెచ్చెలీ
కుసుమ కోమల శ్యామలం నీ కరములు
లేత వెన్నెలలో మల్లియల గుభాలింపులు
తరుణి కళ్ళల్లో పారవశ్యపు మెరుపులు
చిగురించిన కళల ఊహల మందహాసం
మగువ మనసు మధురిమల చిలిపి ఆహార్యం!
ఎర్రని సిందూరం పూలు జాబిలి అందానికి మాల
అద్దంలో తెగమురిసిపోతూ మరుమల్లియలు జడనిండా!
సోగ కళ్ళతో సొగసరి సుందరి రూపం
విస్తుపోతూ చూసే కుర్రకారు కళ్ళు నేరేడి పళ్లు
మాయమర్మం తెలియని వయసు పూలతోట
ఏకధాటిగా కురుస్తున్న వెన్నెల పుష్పాల అలరింత!
అరమరికలు లేని స్నేహం బహుమాధుర్యం
అందాన్ని అందంగా చూడడం ఒక గొప్ప కళ
మల్లియలను ఏ మాత్రం చిదిమినా కరకుదనం!
మనోఫలకంపై సుతిమెత్తని భావాలు రాసుకో
జీవితం వెలుగు రేఖల్లో ఉర్రూతలూగాలి
అమాయకులనబడే వాళ్లే చిగురుటాకుల్లో సంపెంగలు
మగ ఆడ తేడా లేకుండా ముద్దు మురిపాల్లో మునిగితేలాలి
మనస్సు అద్దం ముక్కలు చేసేవాళ్ళు బహిశ్కృతులు
లేత పూలను చిదిమే వాళ్ళు వెలిపోయే గుంటనక్కలు!

అపరాజిత్
సూర్యాపేట

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *