మరో వేమన మన కృష్ణారెడ్డి

మరో వేమన మన కృష్ణారెడ్డి


               ఒక పరిశీలన 
           *****

 అక్షర లిపి సమూహ మిత్రులకు నమస్కారములు.యాజమాన్యమునకుప్రత్యేక వందనములు.మన సమూహసభ్యులందరూ సాహిత్యములోని అన్ని ప్రక్రియల్లో ప్రావీణ్యం సంపాదించి మంచి రచనలు చేస్తూ అక్షర లిపికి వన్నె తేవాలనే తాపత్రయముతో అవసరమైన సూచనలు, సలహాలు ఇస్తూ ప్రోత్సహిస్తున్నందుకు అభినందనలు.
 సంగీత సాహిత్యాలు సరస్వతి స్తనద్వయం అంటారు.సంగీతం--ఆపాత మధురం, సాహిత్యం--ఆలోచనామృతం.
 మనలో సాహిత్య పరంగానేగాక లలిత కళల్లో. ఏదో ఒక కళలో కొంతమందికి అదనపు కళ వరించింది.భవ్యగారు-నాట్యంలో,శ్యామాచార్యగారికి --లలిత సంగీతంలో డిప్లొమా.మిగతా....భరద్వాజగారు,అపరాజిత్ గారు, రాంబాబు గారు,మాధవి గారు,శారదగారు ఇలా....అనేకమిత్రులు గద్య ప్రక్రియల్లో రచనలు చేస్తున్నారు.అందుకు కావలసింది ముఖ్యముగా ఆసక్తి.ఇంకా కోరికతోపాటు తీరిక,తపన,సాధన,సమాజ పరిశీలన, ప్రతిభ కూడా అవసరం. పై వాటితో పాటు పద్యరచన చేసేవారికి అదనంగా ఛందస్సులో కూడా పరిజ్ఞానం ఉండాలి.ఛందస్సు తెలియనివారు పద్య రచన చేయలేరు.

పద్యములలో అనేక రకములుంటాయి.వాటిలో ఆటవెలది, తేటగీతి, ఉత్పలమాల, చంపకమాల,సీసం,కందం మొదలైనవి.వీటిలో కందం రాసినవాడే కవి.పందిని పొడిచిన వాడే బంటు అనడం నానుడి.కందం అంత కఠినమైనదని అర్థం.అలాంటి కందపద్యములు కూడా వ్రాస్తూ,సాహిత్యంలో సాముగరిడీలు చేస్తూ,భాషాపండితులకే క్లిష్టతరమైన పద్యరచనలను కేవలం విజ్ఞాన శాస్త్ర ఉపాధ్యాయుడు వ్రాయడం నాకు ఆశ్చర్యం కలిగిస్తున్నది.వారే అభినవ వేమారెడ్డి (వేమన) కవి మన గడ్డం కృష్ణారెడ్డి గారు.””కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు “”అనేదానికి వీరే తార్కాణం.వీరి ప్రతిభా పాండిత్యమునకు నా ప్రణామములు.
సమాజములో ఉండే కుళ్ళు కుతంత్రాలను,దురాచారాలను,మోసాలను,చెడుఅలవాట్లను ఎలా తూర్పార బట్టారో సింహావలోకనంగా పరిశీలించి ,ఆనందిస్తూ అందరితో పంచుకుంటున్నాను.
వీరు ఏమి చెప్పారంటే. ……….
🙏💐🙏. తల్లదండ్రుల గురించి —-
నవమాసములు మోసి,కని,పెంచుచూ,ఎటూ కదలలేని నీ మలమూత్రములను చీదరించుకో కుండా,ఎంతో ప్రేమగా స్నానం చేయించి, ఉగ్గుపాలు పోసి,ఊయలలో వేసి ఊపుతూ, జోల పాడి నిద్రపుచ్చుతూ,ప్రేమనుపంచి,పోషించి, బుద్దులు నేర్పిన తల్లిదండ్రులు ప్రత్యక్ష దైవాలు.నీ జన్మకు కారకులు.ఎల్లప్పుడూ వారిని గౌరవిస్తూ,సేవలు చేస్తూ,ఆదరిస్తూ,ప్రేమను పంచాలి.అప్పుడే తల్లిదండ్రుల ఋణం తీర్చుకున్న పుత్రునిగా నీ జన్మ ధన్యమవుతుంది.అడిగినవి ఇవ్వలేదని, కోర్కెలు తీర్చలేదని ముసలితనములో వారిని ఈసడించుకోకు.వారిని కలత పెట్టకు.నిర్లక్ష్యముగా చూడకు.అంటూ పుత్రుల కళ్ళు తెరిపించారు కృష్ణారెడ్డి గారు.
🙏💐🙏 గురువుల గురించి ——
అతడొక బ్రహ్మ పదార్థము.ఒక విజ్ఞాన సర్వస్వం.ఒక గ్రంథాలయం.అక్షర బిక్ష పెట్టి, జ్ఞాన దృష్టి నిచ్చి,లోకాన్ని చూపిన దీర్గదర్శి గురువు.ఎప్పుడూ నశించనిదీ,నీ పొట్ట నింపేది చదువే.అట్టిచదువు నేర్పిన గురువును అవమానించకు, ఎగతాళి చేయకు.గురువు మాట జవదాటకు.అప్పుడేనీవు ప్రయోజకుడివి అవుతావు.గురువు ఆగ్రహమునకు గురికావద్దు.తల్లిదండ్రివలె లాలించి, విజ్ఞానమును పంచి గురువును మించిన శిష్యుడుగా నిన్ను తయారు చేస్తారు.అట్టిగురువు మాట విని నిరంతరం పుస్తక పఠనం చేయి.చదువును నిర్లక్ష్యం చేయకు.అలాగే గురుదక్షిణ నిచ్చి గురువు ఋణం తీర్చుకోవాలంటూ… గురువు యొక్క ప్రాముఖ్యతను, ఔన్నత్యాన్ని తెలిపి కర్తవ్య నిర్దేశం చేశారు.
,💐🙏💐 మాతృభాష గురించి—–
మాతృభాష లో మాధుర్యముంది.తేనెలొలుకు తెలుగు భాష.తెలుగు నా మాతృభాష.అన్యభాషలలో కాక నా మాతృభాషలోనే మాట్లాడుతానని భాషపై మమకారాన్ని తెలియజేశారు.మా సూర్యాపేటలో కవులు గద్య పద్యరచనలు చేస్తూ రాణిస్తున్నారని సంతోషం వ్యక్తంచేశారు.” నాకు ఒక వేదిక దొరికితే….” ” తెలుగులో ఎన్నో సూక్తులు, హితోక్తులు చెప్పుతాను.అవి మీకు నచ్చినచో మీరూ ఇతరులకు నేర్పండి”” అంటారు.మంచి విషయాలు అందరికీ తెలియాలని కవి తాపత్రయం.ఇలా తెలుగును ఆపాదమస్తకం ఇముడ్చుకొని * * తెలుసుకోర లెస్స తెలుగు భాష* * అంటూ, * * తెలుసుకోర కృష్ణ తెలివి తోడ* * అనే మకుటాలతో శతకాలు వ్రాసి తెలుగు తల్లి కంఠహారాలుగా వేశారు.ప్రతిరోజు పద్యాలతో హారతులిస్తూనే ఉన్నారు. అవి గ్రంథస్థమై సాహిత్యాభిలాషుల హస్తభూషణాలుగా ప్రకాశించాలని ఆశిస్తున్నాను.
🙏💐🙏 దేశభక్తి గురించి ——
విదేశీయులు అనేక కుట్రలు, కుతంత్రాలతో మన దేశాన్ని స్వాధీనపరచుకొని,మన ఆలయాలను ధ్వంసం చేసి,సంపదలను దోచుకపోయారు.భారత సైనికులు పోరాడి, ప్రజలంతా తిరుగబడినారు.రజాకార్లదౌర్జన్యాలను దొడ్డి కొమురయ్య, చాకలి ఐలమ్మ లాంటి వారు దుడ్డు కర్రలతో ఎదిరించి పోరాడి స్వేచ్ఛను పొందారు.అందరం ఐకమత్యంతో ఉండి దేశాభివృద్ధికి తోడ్పడాలి.నేడు మన భారత ముద్దుబిడ్డ మరో శివాజీ, యుగపురుషుడు అయిన నరేంద్ర మోడీ లాంటి విజ్ఞాన వంతుడు, నిస్వార్థపరుడు, దేశద్రోహుల కుట్రలను భగ్నం చేస్తూ, దేశాన్ని అభివృద్ది మార్గములో నడిపిస్తున్నారు.అట్టి నిస్వార్థ దేశభక్తులను మనం గెలిపించుకోవాలి. అంటు తన దేశభక్తిని చాటుకున్నారు.
,💐🕉️💐పండుగలను గురించి ——
మన మహిళా మణులు, బాలికలు వేకువజామున నిద్రలేచి వాకిళ్ళలో ముత్యాల ముగ్గులు వేసి,రంగు రంగుల తంగేడు,గునుగు, గుమ్మడి అనేక పువ్వులతో అందముగా బతుకమ్మలను పేర్చి,ఒకచోట పెట్టి,వాటిచుట్టూ తిరుగుతూ బతుకమ్మ పాటలను పాడుతూ కోలాటములాడుతూ ధనిక,పేద తారతమ్యము లేక ఐకమత్యంతో ఆడి పాడి ఊరి చివర లో ఉన్న చెరువులో విడిచి సాగనంపుతారు.అందరూ గుంపులుగా కూర్చొని ఒకరికొకరు వాయినాలు,ప్రసాదాలు పంచుకుంటూ సంతోషంగా ఇండ్లకు పోతారు.అలాగే నరకుడనే రాక్షసులను టపాసులతో కాల్చి దీపావళి పండుగ జరుపుకుంటారని కవి అందముగా కళ్ళకు కట్టినట్లుగా వర్ణించారు.
👌💐👌 సూక్తులు హితోక్తులు —-
ఎన్నో సూక్తులు హితోక్తులను చెప్పారు.స్థలాభావముతో మరియు నా ఓపిక సన్నగిల్లి కొన్నిటినే ప్రస్తావిస్తున్నాను.మనం తినే ఆహారం ఔషధంగా ఉండాలనీ,అతి ఏదైనా అనర్థదాయకమనీ,మాదకద్రవ్యాలు,శీతల పానీయాలు, రోడ్లపై చిరుతిండ్ల జోలికి పోవద్దని,ధనమే ప్రమాదకరమైనది నీ,పరాన్నజీవిగా కాక,కష్టపడి జీవించాలని ,దీపమున్నపుడే ఇల్లు చక్కబెట్టుకోవాలనీ,తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని…. ఇలా అనేక సూక్తులు చెప్పారు కవిగారు.
,💐✊🤔

సాము గరిడీలు —–
ఒకప్పుడు పద్యం ఎంతో వైభవంతో ప్రజల నాల్కలపై నర్తించిందనీ, నేడు పద్యప్రభ మసకబారి మాయమై పోతుందని వాపోయారు.పద్యాలు మంత్రాల వంటివి.వాటినిమననం చేస్తుంటే మరచిపోకుండా ఉంటామని,పద్యరచనలో పట్టుసాధించిన కవిగారు అక్షర విన్యాసాలు చేసి,పద్యాలతో ఆడుకున్నారు.ఛందస్సుద్వారాచమత్కారాలుచేశారు
👇 క్రింద వారి చమత్కార పద్యాలను గమనిస్తారని కోరుతున్నాను.

త్రాగ(గా లి)క్కరు కాఫి రమ్ము జిన్ను
త్రాగుచుండ తే(నీరు)ను త్రాగ వైను
త్రాగ(నేల) బీరును విస్కి దమ్మునైన
మానని యెడ(నింగి)ని చేర్చు మాను కృష్ణ!!

(కా)శీ విశ్వేశ్వర హర
కా(శీ) నగరంబు చేర్చి కాచిన యెడలన్
కాశీ (ఖం)డంబు జదివి
కాశీలో (డం)బములను కాల్చెద!! కృష్ణా!!


అ)క్షరాలు నేర్పు ఆ)దిగురువునమ్మ
ఇం)టిలోనె జెప్పు ఈ)శ్వరమ్మ!
ఉ)త్తమ కథలెల్ల ఊ)రించి జెప్పంగ
ఋ)ణము దీర్చుకొనుము ఋ)షివి యయ్యి!!

కవితలు పండించును కవి
కవి తలపై వాలి రెట్ట కవియే వేయున్
కవి లేనిదె హరి నిలువదు
కవియె వనములోన కూయు కమ్మగ కృష్ణా!!

కవి రచయిత పండితుడు
కవి కాకి
కవి కళ్ళెము
కవి కోకిల

గడ్డం కృష్ణారెడ్డి.రేపాల.సూర్యాపేట!!

(మా)సమందు మొదటి మాసంబునేదయ్య
తెలుగు నెలల లో(న)
తెలుపవయ్య!
(స)కలశుభములొసగు సౌభాగ్యదాయిని
చైత్రమాస(ము) గద సరిగ! కృష్ణ!!


(కోక)ల మాటున చిక్కిన
(రైక)లు దూరమ్మవంగ; రమణుల మేనిన్
జాకెటు (లంగా) చేరగ
సోకుల (లుంగీ)లు వాలె చురుకుగ కృష్ణా!!

గడ్డం కృష్ణారెడ్డి.రేపాల సూర్యాపేట గారు ఇలా అనేక చమత్కార పద్యాలు వ్రాసి వారి ప్రతిభను చాటుతున్నారు.ఇలాగే వీరి కలమునుండి అనేక శతకములు, రచనలు వెలవడి ప్రజలలో చైతన్యము నింపి. కవిగా…..కష్టజీవికి ముందు వెనుకల అండగా ఉండాలని ఆకాంక్షిస్తూ…. ఆశీస్సులతో…. అభినందనలు .

                                                                                            కవి గారికి అభిమానిగా....

కోట పెంటయ్య.విశ్రాంత భాషోపాధ్యాయులు కారేపల్లి ఖమ్మం జిల్లా.9014977041 .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *