మా కాశీయాత్ర ( మహా కుంభమేళా)విశేషాలు


మా కాశీయాత్ర ( మహా కుంభమేళా)విశేషాలు


నేటికి సరిగ్గా ఏడాది క్రితం మేము చేసిన కాశీయాత్ర గురించి మన కుటుంబంతో పంచుకోవాలని, మా
అనుభవాలు మీకు పాఠాలుగా ఉపయోగ పడవచ్చునేమోనని ఆశిస్తూ తెలియజేయుటకు సంతోషంగా మీ ముందుకు తెస్తున్నాను.
శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదని మన హిందువుల నమ్మకం.దైవసంకల్పం ఉంటేనే మన కోరికలు నెరవేరుతాయి తప్ప,మనం ఎంత ఆరాటపడినా ఏవో ఆటంకాలు కలిగిస్తూనే ఉంటాడు.మేమైతే రెండవసారి కాశీయాత్ర చేస్తామని అనుకోలేదు.కాని చేశాము
గత డిసెంబర్ నెలలో నే “కాశీయాత్రకు మరల టిక్కెట్లు బుక్ చేశాము.ఇంకారెండుటిక్కెట్లున్నాయి.మీకూ చేస్తున్నాము”అన్నారు.ఏమీ ఆలోచించకుండానే సరేనన్నాము.
గతములో వారే మాకు టిక్కట్లు బుక్ చేసి తీసికెళ్ళారు.అందుకే ఇప్పుడూ సరేనన్నాము.
కానీ కాశీ యాత్ర అనగానే అప్పటి గత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటే “అవి మరచిపోలేని అనుభవాలు”.
ఆ ఇరుకు సందులు గొందులు,ఆవులు, కుక్కలు చూస్తూ… ఎన్నిసార్లు కొత్తవాళ్ళు ఆ వీధుల్లో నడిచినా…మనం ఉండే ఆశ్రమం లేదా సత్రమును సులభంగా కనుక్కోలేము.తెలిసిన వారి సాయంతో తెలుగు వారి సత్రములకు చేరగలం.
కాశీలో ఏ ఇంటిలో చూసినా అది ఒక శివాలయంగానే కనిపిస్తుంది.ప్రతియింటిలో అడుగడుగునా శివలింగా లే దర్శనమిస్తాయి.కారణము తెలుసుకుంటే….. “కాశీపై ముస్లిములు దండయాత్రలు చేసి కాశీ విశ్వనాథుని , శివలింగాలను ధ్వంసం చేయుటకు గుర్రాలపై వచ్చి దాడి చేసేవారట. ఆ గుర్రాలు సందు గొందుల్లో దూరకుండా ఇలా ఇరుకుగా నిర్మాణాలు చేసి, వారిని తికమక పెట్టుటకు ఎక్కడ చూసినా విశ్వనాథుడే కనిపించేట్లుగా… అసలైన విశ్వనాథుని గుర్తుపట్టకుండా, ధ్వంసం చేయకుండా కాపాడుకోగలిగారట” .
అప్పటి నుండి కాశీలో విశ్వనాథుడు నివాసమైనాడు.కాశీ క్షేత్రాన్ని నివాసంగా ఎంచుకున్న పురాతన పట్టణము.శివభక్తులకు ముక్తి క్షేత్రమైనది.ఇక్కడ దొంగల భయము ,ఆటో రిక్షాలవారి మోసాలు ఉంటాయని విన్నాము.మొదటిసారి
అనుభవమైనది కూడా.ఎలాగంటే
మాజట్టు నాయకుని జేబు కత్తిరించి 35 వేల రూపాయలు తస్కరించారు.
కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి.
ఇప్పుడు మన ప్రధానమంత్రి నరేంద్రమోదీ గారు కాశీ నుండి ఎన్నికై, కాశీ క్షేత్రమును విశాలమైన వీధులుగా పునరుద్ధరణ చేశారని, ఇరుకు వీధులు లేవనితెలిసి యాత్రకు సిద్ధమయ్యాము.
ఆయితే… జనవరి 13నుండి మహా కుంభమేళా మొదలైనది.45కోట్లమంది భక్తులు పుణ్య స్నానాలకు వస్తారని అన్ని ఏర్పాట్లు బాగా చేస్తున్నారనీ, ఎవరికీ ఇబ్బందులు కలగకుండా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం భక్తులకు భరోసా ఇచ్చింది.విదేశాల నుండి వచ్చిన పరిశీలకులు, ప్రజాప్రతినిధులు, మంత్రులు ఏర్పాట్లను చూసి సంతృప్తి ని వ్యక్తం చేస్తున్నారు.వేలాది అఘోరాలు , నాగ సాధువులు వచ్చిన సంధర్భములో జరిగిన తొక్కిసలాటలో కొందరు శివసాన్నిధ్యము చేరుకున్నారు.పౌర్ణమి ,మౌని అమావాస్య రోజుల్లో కోట్లాది భక్తులు వచ్చిన వార్తలు వింటూంటే “కాశీయాత్ర అనుకున్నాము కానీ ఈ
మహా కుంభమేళాలో మనం తట్టుకోలేము.ఆగిపోదాము ” అనుకున్నాము.అప్పటికే టిక్కెట్లు బుక్ అయ్యాయి.ఫిబ్రవరి20వతేదీకి.
కానీ. మా జట్టు లీడరు వీరభద్రం గారి
శ్రీమతి భారతి గారు చాలా చురుకైనది , సమయస్ఫూర్తి కలిగినది.నాయకత్వ లక్షణాలు పుష్కలంగా ఉన్న ఆమె… “మనం చాలా అదృష్టవంతులం అనుకోకుండా. ” మహా కుంభమేళా ” లో ప్రయాగ రాజ్ లో గంగాస్నానం చేయబోతున్నాము.144 సంవత్సరాల కు అంటే 12 పుష్కరాలకు ఒక్కసారి… మూడు తరాలకైనా రాని అవకాశం మనకు వచ్చింది.అది కూడా శివానుగ్రహమే.మనం ఆగిపోవద్దు.మీ కన్నా ముసలివాళ్ళు హాయిగా పోయి వచ్చారు “అని భరోసా ఇచ్చింది. మా భయాన్ని పోగొట్టి ప్రయాణానికి సిద్ధం చేసింది.

19-02-2025 నాటికి లగేజీలన్ని సర్దుకున్నాము.9 జంటలు +ఒకరు కలిసి మొత్తము 19 మంది మా జట్టు.

19  ఫిబ్రవరి 2025 బుధవారం రాత్రి 11-30 గంటలకు అందరం ఖమ్మం రైల్వేస్టేషన్ కు లగేజీలతో చేరుకున్నాము.తెల్లవారి అనగా ఉదయం 4-50 గంటలకు మా  స్పెషల్ ట్రేయిన్.మొదటి ప్లాట్ ఫారం చేరుకున్నాము. కాని కొద్దిసేపటికి రెండవ ప్లాట్ ఫారమునకు రైలు రాబోతుందని అనౌన్స్ చేశారు.అప్పుడు లగేజీలన్ని ఒక్కొక్కరికి రెండు , మూడు పట్టుకొని రెండవ నంబరుకు చేరుకున్నాము.
  స్పెషల్ ట్రేయిన్ లో లేడీస్ కంపార్ట్ మెంట్ లో  ఐదుగురికి మాత్రమే సీట్లు ఖరారైనవి.అది ముందు ఉంది.మిగతా వారికి మధ్య లో ఒకే బోగీలో అక్కడక్కడ సీట్లు వచ్చాయి.కొందరు వెళ్ళి ఆడ వారిని వారి సీట్లలో కూర్చోబెట్టి వచ్చారు. మేమంతా లగేజీలతో ఎక్కి, సీట్లు వెతుక్కొని కూర్చునేసరికి అరగంట పట్టింది.  5 గంటలకు తెల్లవారుతుండగా సీట్లలో పడుకొని 8 గంటలకు లేచాము.
 
                                                                                        -కోట పెంటయ్య 


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *