ఎండిపోయిన పగుళ్ళు దేరిన బీడు
గుండెలపై సమ్మెటతో బండలు కొట్టినట్లు
ఊహల కందని హృదయం లోతుల్లోంచి పెగులుతున్న పెనుచీకట్ల పగళ్ళు
అస్తమయమంటూ తెలియని శ్రమల జీవితం
ముడ్డికి బట్టకట్టినప్పటి నుంచి ఎడతెరిపి లేని చాకిరి
తన ఎనబయో పడిలో కొడుకులకు అదే కష్టాల వ్యవసాయం నేర్పించి కన్నీళ్లు పెగలని జీవితం,,,,,,,,,
చిన్నప్పుడు అమ్మా నాయిన ఇద్దరు తమ్ముళ్లు గత్తర రోగంతో పోయారు
తను పటేలు ఇంట్లో చాకిరీకి కుదిరాడు
పటేలు నాగలి మేడిపట్టుకుని నడుస్తుంటే ముసలి ఎద్దుతో పాటు తాను ఎద్దయి కాడి భుజాన పెట్టుకుని బురద పొలాలు దున్నాడు,,,,,,,,,
పటేల్ తో పాటు పచ్చడి మెతుకుల గంజి తాగాడు
పెళ్లి ఈడు రాకున్నా పెళ్ళాం ఇద్దరు పిల్లల సంసారం
కరువు కాటకాల్లో తను పిల్లలు గంజినీళ్లతో జీవశ్చవాలై బ్రతుకు వెళ్లదీశారు,,,,,,,,,
పటేల్ వృద్ధుడై తనను కౌలుకు కుదిర్చాడు
ఎద్దులు లేక తన కొడుకులే ఎద్దులై భుజాన నాగలి కాడిని పెట్టుకుని బురద పొలంలోగుంజుతుంటే తన గుండెల్లో కెలుకుతున్న దుఃఖం మేడి పట్టుకున్న చేతులు ఇంత విషం తాగి చస్తే బాగుండు ననిపించేది,,,,,,,,,
తను బర్రెలు మేపుతున్నాడనే కాని ఒక్కొక్కటిగా పొరలు పోరాలుగా గుర్తుకొచ్చి తనుపడ్డ కష్టాల శ్రమలు అన్నీ ఇన్నీ కావు,,,,,,,,,
కొడుకులు ఎదిగి పెళ్లిళ్లయి తమ పిల్లలతో అప్పుడొకసారి అప్పుడొకసారి దూరప్రాంతాలకు వెళ్లి వరికోతలు నూర్పిళ్ల పనులు చేసి ఇన్ని పైసలతో పటేల్ భూమిని కొన్నారు,,,,,,,,,
ఈ గుదిబండ లాంటి వ్యవసాయం కండలు పిండిచేసే కాయాకష్టంలో ఆరితేరారు,,,,,,,,
నిప్పుల కుంపటి రగులుతున్నట్లు ఒక్కోటి గుర్తుకు వస్తున్నాయి,,,,,,,
పొద్దుపోతున్న చప్పుడుకు ఉలిక్కిపడి చూశాడు బర్రెలు ఇంకా మేస్తూనే ఉన్నాయి,,,,,,,
నాకంటే ఆ బర్రెలే నయం ఏం బ్రతుకు నాది గుండెల్లో అగ్గి రగులుతోంది వాటిని తోలుకుని ఇంటిదారి పట్టాడు,,,,,,,,,,,
అపరాజిత్
సూర్యాపేట