పండు వెన్నెల చల్లని వెలుగుల్లో
ఆడుకునే చిరు చిరు నవ్వులు చిందించే పిల్లలు
ఆ నవ్వుల వెనుక పగలు చేసిన కాయ కష్టం దిగదుడుపు!
పద్నాలుగేళ్ళ లోపు పిల్లలయినా బడి గడప తొక్కని వాళ్ళు
మగపిల్లలు నాగలి పట్టి దుక్కి దున్నడానికి
ఆడపిల్లలు వరిచేలు నాట్లకు మరి కలుపుతీయడానికి
బడికి ఎప్పుడూ వెళ్ల లేదా?అంటే వెళ్ళారు
తల్లిదండ్రులు కూలీనాలీ చేసీ కుటుంబాన్ని పోషించే నిరుపేదలు
తాగుడుకు బానిసలు వాళ్ళు అమాయకులు
విజ్ఞత లేక తమలాగే తమ పిల్లలు అనుకునే నిరక్షరులు
మధ్యలోనే బడి మానివేసిన పిల్లలు!
మచ్చలేని చందమామల్లాంటి పిల్లల భవిష్యత్తు బుగ్గిపాలు!
చెంగల్లో అంటూ చెరువు కట్టపై ఆడుకుంటూ
చేపల షికారులో తెప్పలపై చెరువులో తేలియాడుతూ,,,,,,,!
రైతులకు పంటల సిరులు కురిపించే మొనగాళ్ళు
అంగడి బొమ్మయైన బాల్యం,,,,,,,!
ఆకలి తీరాలంటే ఏదో ఒక పని చేయాలి
వీళ్ళకు భవంతులవసరం లేదు భూములవసరం లేదు!
అణగదొక్కబడ్డ దళితులు గరీబులు!
ప్రభుత్వాలు కాగితాలపై ఎన్ని చట్టాలు చేసినా
వీళ్ళ వాడలకెళ్ళి వాళ్ళ బ్రతుకుల తీరుతెన్నులు పరిశీలించి
కనీసం పిల్లలకైనా సరియైన విద్యావ్యాసంగం కల్పిస్తే
సామాజిక దృక్పథంలో మార్పు సంభవిస్తుంది!
అపరాజిత్
సూర్యాపేట