శీర్షిక:”అంతకు మించి”

దీపావళి అంటే
అభ్యంగన స్నానాలు
ఆచరించటమేనా?

సాయం సంధ్య వేళ
దివ్వెలు వెలిగించడమేనా!!

“అంతకు మించి”
దీపాల వెలుగులో
ఆశావాదాన్ని ప్రబోధించాలి…!!

దీపావళి అంటే
దిక్కులు మారుమోగేలా
టపాసులు కాల్చటమేనా….

“అంతకుమించి”
కొత్తగా మనలను
ఆవిష్కరించుకోవాలి….

మనిషిలోని
రాక్షస ప్రవృత్తికి
నిదర్శనమైన
నరకాసురుని వధించటమే
“దీపావళి సంకేతం”…!!

ఇలా‌…
ఎన్నో అంతరార్ధాలతో కూడిన
వెలుగు పువ్వుల పండుగ…!

అంతకు మించి
దీపం లక్ష్యం
విధ్వంసం కాదు వికాసం…
దీపాన్ని
వెలిగించవలసినది
మన గుండె గుహల్లో
అదే ..విమల విజ్ఞాన దీపం….!!

అధర్మంపై ధర్మం ,
అన్యాయంపై న్యాయం ,
మూర్ఖత్వం పై వివేకం ,
చెడుపై మంచి పైచేయి
సాధించటమే
నిజమైన తిమిర సంహారం…!!

పురాణ గాథల సందేశం
ప్రాచీన రుషులు,
ఆధునిక శాస్త్రవేత్తలు
కన్న కలలకు..పడే తపనలకు….
మనిషి సమాధానంగా
మారటమే కాంతి పర్వం…!!

“అంతకు మించి”
మనలోని అజ్ఞానమనే
కాళరాత్రిని దీప రాత్రిగా
మలుచుకోవటంలోనే
ఇమిడి ఉంది
భారతీయ జ్ఞాన సంపద…..!!

అంతర్గత
శబ్ద కాలుష్యానికి దూరంగా
దురాలోచనలకు అతీతంగా
అభ్యుదయ పథంలో
మనిషి అడుగిడడమే
జ్యోతి ప్రజ్వలనం…!!

“అంతకు మించి”
లోకమంతా ఒక్క ఇల్లే అన్న
కవుల భావనలు
ఎప్పుడు నిజం అవుతాయో
అదే…
“ఆనంద దీపావళి ఆగమనం”….!!
ఇట్లు
మీ
కోటేశ్వరరావు ఉప్పాల

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *