ఇందిరా ప్రియదర్శిని గాంధీ (నవంబర్ 19, 1917 – అక్టోబర్ 31, 1984) భారతదేశపు మొట్టమొదటి, ఏకైక మహిళా ప్రధానమంత్రి. ఆమె 1966 నుండి 1977 వరకు వరుసగా 3 పర్యాయాలు, 1980లో 4వ పర్యాయం ప్రధానమంత్రిగా పనిచేసింది. ఆమె భారత తొలి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ ఏకైక కుమార్తె. జవహర్ లాల్ నెహ్రుకి మొదటి సారి ప్రధాన మంత్రిగా ఉన్నప్పుడు ప్రధానమంత్రికి కార్యదర్శిగా జీతం లేకుండా పనిచేసింది. 1964 సంవత్సరములో తండ్రి మరణం తరువాత రాజ్యసభకు ఎన్నిక అయింది. లాల్ బహదుర్ శాస్త్రి మంత్రి మండలిలో ప్రసారశాఖ మంత్రిగా పనిచేసింది.
మోతీలాల్ నెహ్రూ పేరుమోసిన న్యాయవాది. సంపదలకు నెలవైన ఆ ఇంటికి మోతీలాల్ ఇంగ్లీషు స్నేహితులు (బ్రిటిష్ వారు), స్వదేశీ స్నేహితులు వస్తూ పోతూ ఉండేవారు. అతని కుమారుడు జవహర్‌లాల్ నెహ్రూ, కోడలు కమలా నెహ్రూ. కమలా నెహ్రూ సాంప్రదాయక కాశ్మీరీ బ్రాహ్మణ కుటుంబం నుంచి రావడం వల్ల అత్తవారింటికి అలవాటు పడటానికి మొదట్లో కొంచెం ఇబ్బంది పడింది. మోతీలాల్ కుటుంబంలోని వారు నవీన సంప్రదాయానికి అలవాటు పడినవారు.
ఇందిరా ప్రియదర్శిని 1917, నవంబర్ 19 తేదీన జవహర్ లాల్ నెహ్రూ, కమలా నెహ్రూ ల ఏకైక సంతానంగా అలహాబాదులోని ఆనంద్ భవన్ లో జన్మించింది. ఆమె మోతీలాల్ నెహ్రూకు మనుమరాలు. మోతీలాల్‌కు మనుమరాలంటే చాలా ఇష్టం. అప్పటికే ఆయన నేషనల్ కాంగ్రెస్ సభ్యునిగా ఉన్నాడు. అయినా తన వృత్తిని వదలలేదు. 1919లో పంజాబ్ లోని వైశాఖీ పండుగ జరుగుతున్న తరుణంలో బ్రిటిష్ వారు జలియన్ వాలా బాగ్‌లో జరిపిన మారణకాండలో కొన్ని వేలమంది బలయ్యారు. ఈ సంఘటన మోతీలాల్ హృదయాన్ని కదిలించి వేసింది. వెంటనే తన వృత్తిని వదిలిపెట్టాడు. తన వద్ద ఉన్న ఖరీదైన విదేశీ వస్తులనన్నింటినీ తగులబెట్టాడు. ఖద్దరు దుస్తులను మాత్రమే ధరించడం మొదలు పెట్టాడు. తన కుమార్తెకు కాన్వెంట్ స్కూలు మానిపించాడు.
ఇలాంటి తరుణంలో మోహన్‌దాస్ కరంచంద్ గాంధీ వారి ఇంటికి వచ్చాడు. నెహ్రూతో చాలా సేపు మాట్లాడాడు. ఇందిరకు వారు మాట్లాడుకున్నది ఏమిటో అర్థం కాకపోయినా ఇంటిలో జరిగే మార్పులకు ఒక చిన్ని ప్రేక్షకురాలిగా ఉంది. అది మొదలు వారి ఇల్లు స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొనే వీరులకు తమ కార్యక్రమాలను రూపొందించుకునే కేంద్రంగా మారింది. ఆమె తల్లి, తండ్రి ఇద్దరూ స్వాంతంత్ర్యం కోసం కదనరంగంలోకి దూకారు.
చిన్నారి ఇందిర సైతం తన విదేశీ బొమ్మలను వదిలివేసింది. ఇప్పటి దాకా భోగ భాగ్యాలకు అలవాటు పడిన నెహ్రూలు కష్టాలను కోరి ఆహ్వానించినా ఆ కష్టాలను ధైర్యంగా ఎదురీది స్వతంత్ర భారత చరిత్రలో వారికి ఒక స్థానాన్ని సంపాదించుకున్నారు.వారి వంశానికి ఎనలేని కీర్తిని సంపాదించుకున్నారు.
ఇందిర తొలి పేరు ప్రియదర్శిని ఇందిర. తండ్రి జవహర్ లాల్ నెహ్రూ రాజకీయాలలో ఆరితేరిన వ్యక్తి. తాత మోతీలాల్ నెహ్రూ కూడా అలహాబాదులో పేరుపొందిన న్యాయవాదే కాకుండా జాతీయోద్యమ నాయకులలో ప్రముఖుడు.
ఇందిర పుట్టేసరికి భారతదేశమంతా ఆంగ్లేయుల పాలనలో ఆర్థికంగాను, సామాజికంగాను అనేక సమస్యలతో అల్లకల్లోలంగా ఉంది. ప్రతీ ఒక్కరూ వారి పాలనకు వ్యతిరేకిస్తున్నారు. వారిలో సమైక్యతను తీసుకురావలసిన అవసరం ఏర్పడింది. జాతీయ భావాన్ని పెంపొందించాల్సిన అవసరం వచ్చింది. దీనికి శరీరంలోని ప్రతీ అవయవంలోనూ దేశభక్తి నిండిన నాయకులు కావాలి. బాల గంగాధర్ తిలక్, గోపాలకృష్ణ గోఖలే, సరోజినీ నాయుడు, జవహర్‌లాల్ నెహ్రూ, మహాత్మా గాంధీ వంటి నాయకులు ఈ పనికి పూనుకున్నారు.
జవహర్‌లాల్ నెహ్రూ, కమలా నెహ్రూ స్వాతంత్ర్య పోరాట సమయంలో కారాగారానికి వెళ్ళవలసి వచ్చేది. అటువంటి సమయంలో చిన్నారి ఇందిరకు ఆమె తాతగారైన మోతీలాల్ నెహ్రూ తోడుగా ఉండేవారు. మోతీలాల్ కూడా కారాగారానికి వెళ్ళవలసి వచ్చినపుడు ఆమెకు తోడు ఎవరూ లేక ఒంటరితనాన్ని అనుభవించేది.
ఒక చిన్నారి తన ఎదురుగా జరిగే సంఘటనలను బట్టి తన వ్యక్తిత్వాన్ని మలుచుకుంటుంది. తాను ఆడుకొనే ఆటలు సైతం ఆ సంఘటనలకు అనుగుణంగా ఉండేవి. ఇందిర తాను ఆడుకునే ప్రతీ ఆటలో బ్రిటిష్ వారిని ఎదిరించి పోరాడే ఒక దేశభక్తురాలిగానే తనను ఊహించుకుంటూ ఆడుకొనేది. ఆమె ఆటలు ఆమెలో దేశభక్తిని ఎంత బాగా నింపాయంటే ఆమె స్వాతంత్ర్య పోరాటంలో చిన్నతనంలోనే తనతోటి వారితో కలసి పాల్గొనేలా చేసాయి.
స్వాతంత్ర్య పోరాట సమయంలో నాయకులకు బ్రిటిష్ వారు తమని ఏ క్షణాన అరెస్టు చేస్తారో తెలిసేది కాదు. కాంగ్రెస్ కార్యకర్తల మీద ఎప్పుడు దాడి చేస్తారో కూడా తెలిసేది కాదు. ఒకరి నుండి ఒకరికి వార్తలు చేరటం కష్టంగా ఉండేది. అటువంటి సమయంలో ఇందిర తన స్నేహితులతో కలసి “వానర సేన”ను ఏర్పాటు చేసింది.
వారు వార్తలను చేరవేయడం, జెండాలను తయారుచేయడం పోలీసుల చర్యలపై గూఢచర్యం చేయడం వంటి పనులను చేసేవారు. ఈ వానరసేనకు ఇందిర నాయకత్వం వహించి చెయ్యవలసిన పనులను వారికి నిర్దేశిస్తూ ఉండేది. “మనం పిల్లలమైనా స్వాతంత్ర్యం కోసం మనవంతు కృషి చెయ్యాలి”. అని తోటి పిల్లలకు చెప్తూ ఉండేది.
గాంధీజీ నిరాహార దీక్షలో ఉన్నప్పుడు ఆయన పక్కనే కూర్చుని తమ పిల్లల మద్దతు ఆయనకుందని తెలియజెప్పేది. ఆమె విద్యార్థినిగా ఉన్న సమయంలో తన తల్లిదండ్రులు, గాంధీజీ మొదలైన కాంగ్రెస్ నాయకులు ఉన్న కారాగారాలకు వెళ్ళి వారిని చూసి వచ్చేది. ఇందిర వయసులో చిన్నదైనా భారతదేశపు చరిత్రను, స్వాతంత్ర్య పోరాటం గురించి క్షుణ్ణంగా తెలుసుకుంది.
ఆమె తండ్రి నెహ్రూ తన బిడ్డకు లోకజ్ఞానం గురించి తెలియజెప్పవలసిన సమయంలో ఎక్కువ కాలం కారాగారములో ఉండటం వలన ఇందిరకు ఏమీ నేర్పే అవకాశం లేదని ఆలోచించి కారాగారము నుండే ఆమెకు భారతదేశ సంస్కృతి గురించి, భారతదేశ చరిత్ర గురించి, ప్రపంచ చరిత్ర గురించి ఉత్తరాలను రాసేవారు. ఆయన తన కుమార్తె ఇందిరను ప్రియదర్శిని అని పిలిచేవాడు.
పూణే విశ్వవిద్యాలయం నుండి మెట్రిక్ పరీక్షలో ఆమె ఉత్తీర్ణురాలయింది. రవీంద్రనాథ్ ఠాగూర్ స్థాపించిన శాంతినికేతన్లో చేరింది. అక్కడ క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని గడిపింది. తరచుగా కారాగారానికి వెళ్ళడం మూలాన కమలా నెహ్రూ ఆరోగ్యం చెడిపోయింది. ఆమెను చికిత్స కోసం స్విట్జర్లాండ్ తీసుకువెళ్ళారు. తల్లికి తోడుగా ఆమె అక్కడే ఒక బడిలో చేరింది. ఎంత చికిత్స చేయించినా కమలా నెహ్రూ ఆరోగ్యం కుటుదపడలేదు. పైగా అంతకంతకూ క్షీణించింది. ఇందిరకు పదిహేడు సంవత్సరాల వయస్సు వచ్చేటప్పడికి ఆమె ఎంతో అభిమానించే తల్లి మరణం ఆమెను ఒంటరిని చేసింది .
తల్లి మరణం వలన ఏర్పడిన ఒంటరితనం నుండి ఆమె త్వరగా కోలుకోవాలంటే ఆమె ఐరోపాలోనే చదవాలని నెహ్రూ నిర్ణయించాడు. అక్కడ ఆమె చదువు ఆమెకు మనోధైర్యాన్ని, వ్యక్తిత్వాన్ని సరైన రీతిలో నిర్మించుకుని నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవడానికి సహాయపడుతుందని నెహ్రూగారి ఆశయం
తండ్రి ఆశయానికి అనుగుణంగా నడుచుకోవాలని ఇందిర కూడా నిర్ణయించుకుంది. పశ్చిమ విద్యను అభ్యసిస్తూ ఆమె తనలోని సంకోచాన్ని, ఒంటరితనాన్ని వదిలించుకుంది. లండన్లో ఎక్కువ రోజులు గడిపింది. ఇంగ్లండు లోని ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం లోని సోమర్ విల్ కళాశాలలో చదివేటప్పుడు, స్వాతంత్ర్యం సంపాదించడంకోసం లండనులో స్థాపించబడిన ఇండియాలీగ్ లో, 1930 లో, చేరింది. ఆ తర్వాత లండన్ లోని ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంలో చదువుకునే సమయంలోనే, పాత్రికేయుడు ఫిరోజ్ గాంధీతో స్నేహం ఏర్పడింది. ఫిరోజ్ తో స్నేహం ఆమె ఒంటరితనాన్ని పోగొట్టింది.
ఫిరోజ్ తో పరిచయము క్రమంగా పరిణయానికి దారి తీసింది. ఫిరోజ్ గాంధీ నెహ్రూ కుటుంబానికి తెలిసినవాడు మాత్రమే కాదు స్నేహితుడు కూడా. ఇందిరకు అతని వ్యక్తిత్వం బాగా నచ్చింది. అతడినే వివాహం చేసుకోవాలని నిశ్చయించుకుంది. ఫిరోజ్ పూర్వీకులు పర్షియా నుండి భారతదేశానికి వలస వచ్చి స్థిరపడ్డారు. వారు పార్సీలు. నెహ్రూ కాశ్మీరీ బ్రాహ్మణ కుటుంబానికి చెందినవారు. అందువల్ల ముందు నెహ్రూ వీరి వివాహానికి అంగీకరించలేదు. నెహ్రూ ఇందిర నిశ్చయాన్ని విని గాంధీ సలహాని తీసుకోవాల్సిందిగా ఇందిరను కోరాడు. గాంధీ వీరి ప్రేమను అర్థం చేసుకుని వారి వివాహానికి అంగీకరించాల్సిందిగా నెహ్రూను కోరాడు. మహాత్మా గాంధీ ఒప్పించడంతో 1942లో ఇందిర, ఫిరోజ్ ల వివాహం జరిగింది
1942లో క్విట్ ఇండియా ఉద్యమం మొదలయింది. జవహర్‌లాల్ నెహ్రూ కారాగారం నుండి విడుదల అవుతూనే మళ్ళీ అరెస్టు అయ్యారు. గాంధీజీ కూడా అరెస్టు అయ్యారు. అరెస్టుకు నిరసనగా దేశమంతా సమ్మెలు జరిగాయి. అయితే బ్రిటిష్ వారు పోలీసు బలంతో సమ్మెలను అణచివేసారు. ఈ నేపథ్యంలో ఆమె అరెస్టు అయి కారాగారానికి వెళ్ళి 1943 మే 13 న విడుదలైంది. కారాగారంలో ఉండగానే ఆమె ఒక మగ పిల్లవాడికి తల్లి అయింది. ఆ పిల్లవాడికి రాజీవ్ అని పేరు పెట్టింది. పెళ్ళి జరిగినది మొదలు అరెస్టు అయ్యి, విడదలయ అయ్యేలోపు ఆమెలో జాతీయ భావం పెరిగి పెద్దయ్యింది. దేశం కోసం పనిచేయాలి అనే తపన మొదలయింది.
రాజీవ్ గాంధీకి రెండు సంవత్సరాల వయసు ఉండగా వారు లక్నో బయలుదేరి వెళ్లారు. అక్కడ నేషనల్ హెరాల్డు పత్రికా సంపాదకునిగా ఫిరోజ్ గాంధీ పనిచేసేవాడు. రాజీవ్ గాంధీకి తమ్ముడు సంజయ్ గాంధీ జన్మించాడు.
భర్తతో కలిసి అలహాబాదులో ఉంటున్న సమయంలో విభేదాలు రావడంతో అలహాబాదును వదలి ఢిల్లీ చేరి తండ్రితో జీవించింది. తండ్రికి కూతురు మాదిరిగానే కాకుండా కార్యదర్శిగా, స్నేహితుడిగా మెలగింది. 1951లో జరిగిన మొదటి సార్వత్రిక ఎన్నికలలో జవహర్ లాల్ నెహ్రూకు పోటీగా ఫిరోజ్ గాంధీ రాయ్‌బరేలీ నియోజకవర్గంలో పోటీ చేసినప్పుడూ ఇందిర తండ్రి తరఫున ప్రచారం చేసి గెలిపించింది. ఫిరోజ్ గాంధీ, నెహ్రూకు వ్యతిరేకంగా గళమెత్తి అవినీతి అక్రమాలను ముఖ్యంగా బీమా కుంభకోణాన్ని బయటపెట్టాడు. తత్ఫలితంగా అప్పటి నెహ్రూ మంత్రివర్గంలో ఆర్థిక మంత్రి అయిన టి.టి.కృష్ణమాచారి రాజీనామా చేయవలసి వచ్చింది.
ఇందిర ఎన్నో సంవత్సరాలపాటు నెహ్రూగారి వెనుకనే ఉన్నా, అనుకోని విధంగా తన రాజకీయ జీవితానికి శ్రీకారం చుట్టింది. ఇది ఆమె ప్రమేయం లేకుండానే జరిగిపోయింది. కాంగ్రెస్ పార్టీ ప్రచారంలోను, తండ్రి రాలేక పోయిన సభలలో ఆమె మాట్లాడవలసి వచ్చేది. ఆమె ఉపన్యాసం, ముఖ్యంగా ఖంగుమని మోగే కంఠస్వరం, సామాన్యులలో కలసిపోయే ఆమె స్వభావం అందరినీ ఆకట్టుకునేవి. ఇది గమనించిన కాంగ్రెస్ కార్యకర్తలు ఆమెను 1959 ఫిబ్రవరి 2 న భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఎన్నుకున్నారు. సెప్టెంబరు 8న ఆమె భర్త ఫిరోజ్ గాంధీ మరణించాడు. ఇది ఆమెలో అభద్రతా భావాన్ని కలుగజేసింది. అయితే పార్టీ అధ్యక్షురాలిగా బాధ్యతలను నిర్వహించడం, భర్త మరణం వలన ఏర్పడిన ఒంటరితనం ఆమె మౌనాన్ని పెంచడంతో పాటు, ఆమెకు జీవితం పట్ల అవగాహనను, ఆత్మస్థైర్యాన్ని కూడా పెంచింది. నెమ్మదిగా నెహ్రూగారి స్నేహితులతోను, రాజకీయ నాయకులతోనూ సంభాషణలలో పాల్గొనడం ప్రారంభించింది.
ఇందిరా గాంధీ స్వతంత్ర భారతదేశంలో పలు రాజ్యాంగ వ్యవస్థల పతనానికి నాంది పలికిన ప్రధానిగా విమర్శలు ఎదుర్కొంది.
మాధవి కాళ్ల
సేకరణ