నిజమైన సంపద

అక్షర కొరకు
అంశం :⁠- నిందలతో కాపురం
తేది:⁠- 26/11/2025
శీర్షిక:⁠- నిజమైన సంపద…

                                     ప్రభుత్వం ఉద్యోగాలు అయిన ప్రవీణ్, అంజలిలది పెద్దలు కుదిర్చిన పెళ్లి. 
                   పెళ్లైన కొత్తలో వారి కాపురం ఆనందంగా ఉన్నా, అంజలి తల్లిదండ్రులు ఆర్థికంగా అంతంత మాత్రమే ఉండేవారు. 
                           ఈ ఒక్క కారణంగానే... ప్రవీణ్ తల్లి అంజలిని చిన్నచూపు చూడడం మొదలుపెట్టింది.

“మీ అమ్మ ఏం తెచ్చింది? మా వాడి హోదాకు తగ్గ కట్నం ఇది కానే కాదు. నీకు బుద్ధి ఉందా?” ప్రతి చిన్న విషయానికీ అంజలిపై నిందలు వేసేది అత్త.
అత్త మాటకు ప్రవీణ్ కూడా వత్తాసు పలికేవాడు.
“నిన్ను చేసుకున్నందుకు నాకు ఎంత అవమానమో తెలుసా? మా ఆఫీసులో అందరూ వాళ్ల భార్యల గురించి గొప్పలు చెబుతుంటే… నాకేం లేదనే బాధ!” ప్రవీణ్ నోటి నుండి వెలువడే ప్రతి నింద, అంజలి గుండెల్లో వేసిన పదునైన గాయంగా మారేది.
అంజలి ఎంతో మంచిదైనా, తెలివైనదైనా, ఏదీ సరిగా చేయలేదనే నిందలే ఆమెను చుట్టుముట్టేవి?
ఉదయం టిఫిన్ నుండి రాత్రి భోజనం వరకు, చిన్న జ్వరం వచ్చినా అంజలికే లోపమని, దరిద్రమంతా తనతోనే వచ్చిందనే నిందలు మోసేది. ఆమె ఆత్మవిశ్వాసం క్రమంగా నశించిపోయింది. ఇంట్లో ఎప్పుడూ మౌనంగా ఉండేది, నవ్వడం మర్చిపోయింది?
ఒకరోజు ప్రవీణ్‌కు ఆఫీసులో పెద్ద ప్రమోషన్ వచ్చింది. దానికి సంబంధించిన ముఖ్యమైన ప్రెజెంటేషన్ కాపీని అతను ఇంట్లో మర్చిపోయాడు.
ఆ సమయంలో అంజలికి తప్ప ఇంకెవరికీ ఆ విషయం గుర్తులేదు? నిందలతో కృంగిపోయిన అంజలి ఆ కాపీని ఆఫీసుకు తీసుకెళ్లి ఇవ్వడానికి బయలుదేరింది. ఆఫీసు బయట నిలబడి, అంజలిని చూసి ప్రవీణ్ ఆశ్చర్యపోయాడు.
ఆ కాపీని అందించినప్పుడు ప్రవీణ్ మొహం కాస్త కదిలింది. “ఎందుకొచ్చావు? నువ్వు ఏం చేసినా తప్పుగానే చేస్తావు కదా! ఇక్కడ కూడా ఏమైనా ఆపద తెస్తావేమో?” అన్నాడు అప్రయత్నంగా.
అంజలి కళ్ళల్లోంచి తొలిసారిగా కన్నీళ్లు రాలేదు. కానీ తీవ్రమైన నిశ్శబ్దం ఆవరించింది.
“మీరు నన్ను నిందించడానికి ప్రయత్నించే ప్రతిసారి నేను లోపల చచ్చిపోయాను. మీరు మీ హోదాకు ఆశపడ్డారు , మీ అమ్మ గారు నా కట్నానికి ఆశపడ్డారు. నేను కేవలం మీ ప్రేమకు మాత్రమే ఆశపడ్డాను. ఆ ప్రేమ లేనప్పుడు, ఈ కాపురం ఎందుకు?” అంది గంభీరంగా.
ఆ రోజు ప్రవీణ్ ఆ ప్రెజెంటేషన్ ఇచ్చి, ప్రమోషన్ పొందాడు. కానీ, ఇంటికి తిరిగి వచ్చేసరికి అంజలి కనిపించలేదు. ఆమె కేవలం ఒక ఉత్తరం రాసి వెళ్లింది.
“మీకు మీ హోదా ముఖ్యం. నాకు నా ఆత్మగౌరవం ముఖ్యం. నిందలతో నిండిన ఈ కాపురంలో, నేను కేవలం ఒక ఖాళీ పాత్రను. మీ విజయం మీకు శుభం కలిగించాలి. నేను వెళ్తున్నాను” అని ఉంది ఆ ఉత్తరంలో.
ప్రమోషన్, హోదాతో ప్రవీణ్ ఒంటరిగా మిగిలిపోయాడు. తన జీవితంలో నిందల వల్ల నిజమైన సంపదను కోల్పోయానని అర్థమైంది. అతడి ఇల్లు ఇప్పుడు నిశ్శబ్దంతో… నిందల ప్రతిధ్వనితో నిండి ఉంది. తన నిందలే తన కాపురాన్ని నాశనం చేసిందని తెలుసుకున్నాడు.

మాధవి కాళ్ల..
హామీ పత్రం :⁠-
                      ఈ కథ నా సొంతం అని హామీ ఇస్తున్నాను..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *