అక్షర కొరకు
అంశం :- నిందలతో కాపురం
తేది:- 26/11/2025
శీర్షిక:- ఆడవారి కన్నా మగవాళ్లే బలహీనులు
మీ పేరు : విత్తనాల విజయకుమార్
హైదరాబాద్
హామీ పత్రం: ఈ రచన నా సొంత రచనని హామీ ఇస్తున్నాను.
••••••••••••••••••••
“నేను పెళ్లికి ముందే చెప్పాను. నాకు ఆ అలవాటు ఉందని. అప్పుడు లేని అభ్యంతరం ఇప్పుడు కొత్తగా వచ్చిందా” మీద పడి అరుస్తున్న భార్య సుచరితకు ఏ మాత్రం తగ్గకుండా చెప్పాడు మధు.
“కొంచెం తాగే అలవాటుందని చెప్పావ్. తాగాక ఉన్నవీ లేనివీ వాగుతావని నాకేం తెలుసు!” ఏమాత్రం తగ్గలేదామె.
“వాగుతానా! ఏం మాట్లాడుతున్నావ్. ఒళ్ళు దగ్గర పెట్టుకో” చూపుడు వేలెత్తి హెచ్చరించాడు.
నాలుగు సంవత్సరాల క్రితం పెద్దలు కుదిర్చిన సంబంధం. ఒకరికొకరు ఇష్టపడే పెళ్లి చేసుకొన్నారు. పెళ్లి చూపుల్లోనే అబ్బాయితో ఒంటరిగా మాట్లాడాలని ధైర్యంగా అడిగింది సుచరిత.
ఒక పెద్దామె ఒక గదిలోకి వాళ్లను తీసుకెళ్లి ఒంటరిగా వదిలింది. పెళ్లికూతురు ఏం మాట్లాడుతుందోనని ఆలోచిస్తున్న మధుకి తాను ప్రేమలో మోసపోయానని సుచరిత చెప్పితే కంగు తిని సర్దుకున్నాడు.
“నేను ప్రేమించిన అబ్బాయి పేరు రవి. అతను మంచివాడే. కానీ అభద్రతాభావం ఎక్కువ అందుకే అతనితో విడిపోవలసి వచ్చింద”ని చెప్పింది నిర్భయంగా.
“అభద్రతాభావం అతనిలో ఉందని ఎలా అనుకున్నారు మీరు?” ఆమె మనసును చదవాలనే ప్రయత్నంతో అడిగాడు మధు.
“నేను చాలా అందగత్తెననీ, నా వెనుకపడి ప్రపోజ్ చేసేవారు ఎక్కువనీ, ఎప్పుడో ఒకప్పుడు అతనికి దక్కకుండా పోతానేమోనని మాటిమాటికీ అనేవాడు” చెప్పింది సుచరిత.
“అంతేనా ఇంకేమైనానా ” అడిగాడు మధు.
“అలాంటి మాటలే అనేవాడు. నిన్ను నేను సుఖ పెట్టగలనా? మీ ఇంట్లో వాళ్ళు పెళ్లికి ఒప్పుకోరు అంటున్నావు కదా! నువ్వు మాత్రం వాళ్లకు భయపడకుండా నాతో రాగలవా! మీ వాళ్లు నిన్ను వదిలేసి నన్ను చంపేస్తే!” ఇలా ఏవేవో ఇష్టం వచ్చినట్లు మాట్లాడేవాడు.
“ఎలా బ్రేకప్ అయ్యింది!” ఆరా తీశాడు.
“అతనికి అలా మాట్లాడొద్దని ఎన్నోసార్లు చెప్పాను. అనవసరంగా అపోహలు పడొద్దని కూడా చెప్పాను. ప్రేమ మనసుకు సంబంధించిందనీ, ప్రేమించిన వాళ్ళ కంటికి ప్రేమించిన వాళ్లు అందంగానే ఉంటారని చెప్పాను. ఒక్క అమ్మాయి తెగించి అయిన వారిని కాదని కోరుకున్న వాడితో వచ్చిందంటే, అనుక్షణం తోడుండి కాపాడే భర్త తోడు ఉంటాడనే నమ్మకమేనని చెప్పాను. అయినా అతనిలో ఏ మార్పూ నాకు కనబడలేదు. ఆ తర్వాత నేను నా కోసం కన్నా అతని గురించే బాగా ఆలోచించాను. నేను అతన్ని పెళ్లి చేసుకుని, ఎంత ప్రేమించినా, అతను సుఖపడలేడని అనిపించింది. అందుకే నేనే అతనికి బ్రేకప్ చెప్పేసాను” ఏమీ దాచుకోకుండా వివరించింది సుచరిత.
మధు కొద్దిసేపు మౌనంగా ఉండటాన్ని గమనించి – “మీరు ఇంకా ఏమైనా అడగాలనుకుంటే అడగండి. అదికూడా నాతో మీకు పెళ్లికి ఇష్టమైతేనే అడగండి. కాకపోతే ఈ టాపిక్ ఇక్కడితో ఆపేద్దాం” చాలా కూల్ గా చెప్పింది.
“మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టమే. మీ గురించి నేను అడగకుండానే చెప్పారు. మరి నా గురించి ఏమీ అడగరా?” సుచరితను సూటిగా అడిగాడు.
“మిమ్మల్ని ఇష్టపడ్డాను కాబట్టే నా గురించి చెప్పాను. అలాగే ఇప్పుడు మీరు నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టమని చెప్పారు కాబట్టే అడుగుతున్నాను. మీ గురించి కూడా చెప్పండి” అన్నది.
మధు తనకి అప్పుడప్పుడు స్నేహితులతో కలిసి తాగే అలవాటుందని సుచరితకు చెప్పాడు.
“అప్పుడప్పుడే కదా! పెళ్లయ్యాక మానేయలేరా” అని అడిగింది ఆమె.
“అంత పెద్ద కష్టం ఏమీ కాదు. అయితే స్నేహితుల ముందు లోకువైపోతాను. అందుకని ఆ మాట నేను ఇవ్వలేను. మాట ఇచ్చి తప్పటం నాకు ఇష్టం ఉండదు. అయితే నేను చాలా పరిమితంగా తాగుతాను. తాగిన చాలా అదుపులో ఉంటాను. మహా అయితే నెలకు ఒక్క పార్టీ కన్నా ఎక్కువ ఉండదు. డిసెంబర్ 31 లాంటి స్పెషల్ అకేషన్స్ తప్పించుకోలేను” నిజాయితీగా చెప్పాడు మధు.
అలా ఒకరికొకరు మనసు విప్పి మాట్లాడుకునే పెళ్లి చేసుకున్నారు. నాలుగు సంవత్సరాలు గడిచేయి. ఇప్పటివరకు ఏ గొడవలు లేవు. ఈ మధ్య ఇద్దరి మధ్య గొడవలు తారస్థాయికి చేరాయి.
సుచరితను ప్రేమించిన అబ్బాయి వీళ్ళుంటున్న వీధిలోకే ఒక అపార్ట్మెంట్ లో విలాసవంతమైన ఫ్లాట్ కొని కుటుంబంతో దిగాడు. అనుకోకుండా కనబడిన సుచరితను చూసి యోగక్షేమాలు అడిగాడు. ఆమె కూడా మాట్లాడి ఇంటికి భార్యతో కలిసి టీ తాగటానికి రమ్మని ఆహ్వానించింది.
ఓ ఆదివారం రోజున రవి తన భార్యతో పాటు ఏడాది పసి పిల్లవాడితో సుచరిత ఇంటికి వచ్చాడు. మధు కూడా ఉన్నాడు. పరిచయాలయ్యాయి. సరదాగా మాట్లాడుకున్నారు. జరిగిన విషయాలు గుర్తుకు తెచ్చుకున్నారు. అంతా బాగానే జరిగింది. మధు కూడా పట్టించుకోలేదు.
ఓ రోజు రాత్రి బెడ్ రూమ్లో మధుతో – “అప్పట్లో రవి అంత ఆకర్షణీయంగా ఉండేవాడు కాదు. అతని భార్య కూడా చాలా అందంగా ఉంది. వాళ్ల బాబు కూడా బాగున్నాడు కదండీ” అన్నది.
భార్య అలా మాట్లాడటం మధుకి మనసులో గుచ్చుకుంది. అప్పటికి సర్దుకున్నాడు.
సుచరిత మరొక రోజున భర్తతో ఒంటరిగా ఉన్నప్పుడు – “రవి భార్య నాకు మంచి స్నేహితురాలు అయిపోయిందండి. అన్ని విషయాలు చాలా ఫ్రీగా మాట్లాడుతుంది. రవి కూడా మా విషయం ఆమెకు చెప్పాడంట. ఫైనల్ ఇయర్ లో చదువు కుంటు పడకూడదని నాతో అలా అనేవాడట. నేను బ్రేకప్ చెప్తే నాకే ఇష్టం లేదనుకుని బాధపడి మనసుని చదువు వైపు మళ్ళించాడట. చాలా మంచి ఉద్యోగం వచ్చింది. పాపం నేనే అతన్ని అపార్థం చేసుకున్నాను” అన్నది.
ఆ రోజు మొదలు మధు ప్రతిరోజూ ఇంటికి తాగి వచ్చేవాడు. సుచరితతో గొడవ పెట్టుకునే వాడు. భర్త ప్రవర్తనలో వచ్చిన మార్పుకి చాలా బాధపడింది సుచరిత.
ఈ రోజు ఉదయం రవి భార్య సుచరితను కలిసినప్పుడు ఒక విషయం తెలిసింది. మధు ఫ్రెండ్స్ లో ఒకతను రవి ఉంటున్న అపార్ట్మెంట్లోనే ఓ ప్లాట్ లో ఉంటున్నాడట. మధుతో పాటు తాగటానికి వెళ్తూ ఉంటాడట. ఆడవాళ్ళను నమ్మకూడదు. వాళ్ల మనసులు చంచలమని తాగే సమయంలో సుచరిత గురించి అనుమానం వ్యక్తం చేశాడట. ఆ స్నేహితుడు ఆ విషయాన్ని అతని భార్యకు చెప్పాడంట. అతను భార్య అపార్ట్మెంట్లో అందరితో చెప్పి ఆనందిస్తుందట. ఆ కోపంలోని భర్తపై అరిచి ‘వాగుతున్నావ్’ అని ఏకవచనంలో సంభోదించింది.
సుచరిత స్నేహితుడు రవికి తన భార్య ద్వారా విషయం తెలిసింది. సుచరిత భర్తతో గొడవ పడుతున్నట్లు కూడా తెలిసి బాధపడ్డాడు. అతడే స్వయంగా మధుని అతని ఆఫీసులోనే కలిశాడు.
“మీరు ఏమీ అనుకోకండి. భార్యాభర్తల విషయంలో మూడవ వారు కల్పించుకోకూడదు. అయితే మీ మీద నాకు నమ్మకం ఎక్కువ. అందుకే మాట్లాడాలని వచ్చాను” చాలా సంస్కారంగా మాట్లాడాడు. అందుకే అతనితో కలిసి ఓ రెస్టారెంట్ కి వెళ్ళాడు మధు.
“బ్రదర్ నాకు విషయం తెలిసింది. నా భార్య ద్వారా తెలిసింది. ఆడవాళ్ళ నోటిలో మాట ఆగదు కదా. మీరు ఆమె విషయంలో అనుమాన పడుతున్నట్లు తెలిసి అడుగుతున్నాను. ఇటువంటి విషయాలు బయటపడితే మన పరువే పోతుంది. నాకు తెలిసి సుచరిత చాలా మంచిది. మీకు ఎవరి మీద అనుమానమో నాకు చెప్పండి. కావాలని మీకు అనుమానం వచ్చేటట్లు ఎవరైనా చేస్తున్నారని నాకు అనిపిస్తుంది. మన స్నేహితులుగా కలిసాం కదా. ఒకరికొకరు సహకరించుకోవాలి కదా. అందుకే నా అంతటి నేను వచ్చాను బ్రదర్” అన్నాడు.
మధుకి తల తిరిగింది. తన ఎదురుగుండా బ్రేకప్ చెప్పిన బాయ్ ఫ్రెండ్ ను పొగిడినందుకు తట్టుకోలేక తను చేసిన తప్పుని గ్రహించాడు. రవి మొహంలో నిజాయితీ కొట్టొచ్చినట్లు కనబడింది. సుచరిత మీద అభిమానంతో అతడు ఆమెను కలవకుండా తన దగ్గరకు రావటం మరీ నచ్చింది. కళ్ళల్లోకి వచ్చిన కన్నీరును తుడుచుకున్నాడు.
“అదేం లేదు బ్రదర్. నేనే తాగేసి పొరపాటున తప్పుగా మాట్లాడాను. అందుకే ఈ రోజు నుండి తాగటం మానేస్తున్నాను. మా కుటుంబం కోసం మీరు చూపిస్తున్న అపేక్షకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ సంఘటనతో మనం మరింత దగ్గరయ్యాం” అని కౌగిలించుకున్నాడు.
భర్తలో వచ్చిన మార్పుకి సుచరిత ఆశ్చర్యపోయింది. ఆమెను అపురూపంగా చూసుకోవడంతో పాటు తాగడం పూర్తిగా మానేశాడు. తొందరపడి చేసిన తప్పుకి క్షమాపణ కూడా అడిగాడు.
తరచూ రవి కుటుంబంతో ఒక్కొక్క వారం ఒక్కొక్క ఇంటిలో కలిసి సంతోషాలను పంచుకునేవారు.
ఒక రోజున బెడ్ రూమ్లో మధు తన భార్య సుచరితతో – “పెళ్ళికి ముందు అంత నిజాయితీగా ఉన్న విషయాన్ని ఉన్నట్లు చెప్పి నా ఎదలో మహారాణిగా కూర్చున్నావు. మగవాడికి అభద్రతాభావం అనేది ఉండకూడదు. నమ్మకం ఉండాలి. నాకు నీ మీద నిజంగా నమ్మకం ఉంది” అన్నాడు.
“మరి అలా ఎలా అనగలిగారు” అన్నది సుచరిత.
“దానికి కారణం నీవే!” అన్నాడు
ఏమిటా కారణమన్నట్లు చూస్తున్న భార్యను దగ్గరకు తీసుకుని – “ఎంతైనా మేము పరాయి ఆడవాళ్లను మీ ముందు పొగిడితే మీరు ఎలా బాధ పడిపోతారో, అంతకన్నా ఎక్కువగా మేము కూడా బాధపడతాం. అది మాటిమాటికీ చేస్తే మనసు కూడా తప్పటడుగులు వేయొచ్చు. ఈ విషయంలో ఆడవాళ్ళ కన్నా మగవాళ్లే బలహీనులు. పాపం తెలియక అందరూ ఆడవాళ్లను బలహీనులంటారు” హత్తుకుని ముద్దు పెట్టుకుని ఆమెను మాట్లాడినీయలేదు.
కథ సమాప్తం
••••••••••••••••••••