అతను అంటరానితనం, కులవ్యవస్థ నిర్మూలనతో పాటు మహిళోద్ధరణకు కృషి చేసాడు. 1873 సెప్టెంబరు 24న, ఫులే తన అనుచరులతో కలిసి, దిగువ కులాల ప్రజలకు సమాన హక్కులను పొందటానికి సత్యశోధక్ సమాజ్ (సొసైటీ ఆఫ్ సీకర్స్ ఆఫ్ ట్రూత్) ను ఏర్పాటు చేశాడు అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం పనిచేసిన ఈ సంఘంలో అన్ని మతాలు, కులాల ప్రజలు కూడా చేరవచ్చు. లాగ్రేంజ్‌లోని సామాజిక సంస్కరణ ఉద్యమంలో ఫులే ఒక ముఖ్యమైన వ్యక్తిగా పరిగణించబడ్డాడు. అతను, అతని భార్య సావిత్రిబాయి ఫులే భారతదేశంలో మహిళా విద్యకు మార్గదర్శకులు. అతను మహిళలకు, తక్కువ కుల ప్రజలకు విద్యను అందించే ప్రయత్నాలకు ప్రసిద్ధి చెందాడు. ఫులే బాలికల కోసం మొదటి పాఠశాలను 1848లో పూణేలో ప్రారంభించాడు. అతను వితంతువుల కోసం ఒక గృహాన్ని కూడా స్థాపించాడు. భారతదేశ బాలికల కోసం ఒక పాఠశాల ప్రారంభించిన మొట్టమొదటి స్థానిక భారతీయులలో ఈ జంట ఉన్నారు. విద్య యొక్క విశ్వీకరణను సమర్థించిన మొదటి సంస్కర్త కూడా ఆయనే.
దీనిలో బ్రాహ్మణీయ అమానుష సూత్రాలను, శూద్రులు- అతి శూద్రులపై బ్రాహ్మణుల క్రూర వెైఖరిని ఫూలే తులనాత్మకంగా పరిశీలించాడు. సహపంక్తి భోజనానికి సంసిద్ధత ప్రకటించాడు. 1883లో కల్టివేటర్స్ విప్‌కార్డ్ (సేద్యగాడి చెర్నకోల) పుస్తక రచన పూర్తిచేశాడు. ఏప్రిల్‌లో బొంబాయిలో జరిగిన ఒక సమావేశంలో పుస్తకాన్ని వినిపించాడు. 1885లో సత్యసారాంశం ప్రచురించాడు. ఇదే సమయంలో ప్రచురితమైన తన ‘హెచ్చరిక’ (వార్నింగ్) బుక్‌లెట్‌లో ప్రార్థనా సమాజం, బ్రహ్మసమాజం తదితర బ్రాహ్మణీయ సంస్థలమీద తీవ్ర విమర్శలు చేశాడు. 1891లో ఫూలే రచించిన ‘సార్వజనిక్ సత్యధర్మ పుస్తకం’ ఆయన మరణాంతరం ప్రచురితమైంది. ఇందులో చాతుర్వర్ణ వ్యవస్థను దుయ్యబట్టాడు. మద్యపానాన్ని వ్యతిరేకించి, 1888లో మున్సిపాలిటీ అధ్యక్షునికి మద్యం షాపులను మూసి వేయవలసిందిగా ఉత్తరం వ్రాశాడు. ఆయన వ్రాసిన 33 ఆర్టికల్స్ గల సార్వజనిక్ సత్యధర్మ పుస్తకంలో కుటుంబ సృష్టి నియమాల గురించి వివరిస్తూ ప్రపంచం మొత్తాన్ని ఒక కుటుంబంగా వ్యక్తీకరించాడు.
ప్రతి ఒక్కరికి సమాన స్వేచ్ఛ హక్కును తీర్మానించాడు. సత్యశోధక సమాజం తరపున ప్రారంభించిన ‘దీనబంధు’ వారపత్రికలో రెైతులు, కార్మికుల సమస్యలు, బాధలు వివరించేవాడు. శెత్కర్యాచ అస్సోడ్ (కల్టివేటర్స్ విప్‌కార్డ్) పుస్తకం సామాజిక ప్రాముఖ్యం గలది. భారతదేశంలో కులం గురించిన సిద్ధాంతాన్ని శాస్త్రీయంగా రూపొందించిన తొలి దార్శనికుడు ఫూలే. దుర్మార్గమైన కులవ్యవస్థ సమూలంగా నిర్మూలన కావాలని ఆయన కోరుకున్నాడు. ఆయన ఆలోచనలకి, విశ్లేషణకి ‘గులాంగిరి’ అద్దం పడుతుంది. మనుషుల చుట్టూ బ్రాహ్మణులు చుట్టిన దాస్యపు సంకెళ్ళ నుండి వాళ్ళు విముక్తికావడం, తోటి శూద్రుల నిజపరిస్థితిని బహిర్గతం చేయడం, ఇవి ఏకాస్త విద్యనెైనా నేర్చిన శూద్రసహోదరుల కర్తవ్యాలు. ప్రతిగ్రామంలోనూ శూద్రులకు పాఠశాలలు కావాలి. కానీ వాటిలో బ్రాహ్మణ ఉపాధ్యాయులు మాత్రం వద్దన్నాడు.
భారతదేశంలోని శూద్రాతి శూద్రులు (దళిత బహుజన, ఆదివాసీ గిరిజన, ముస్లిం మైనార్టీలు) బ్రాహ్మణీయ కుల వ్యవస్థలో బానిసలుగా ఉన్నారనీ, వీరు అమెరికాలోని నల్లజాతి బానిసల్లాగా ఉన్నారని చెప్పిన మొట్టమొదటి వ్యక్తి ఫూలే. అందుకే బ్రాహ్మణీయ కుల వ్యవస్థలోని బానిసత్వానికి వ్యతిరేకంగా పోరాడడమొక్కటే మన ముందున్న ప్రథమ కర్తవ్యంగా ఫూలే ప్రకటించారు.
బడుగులు బానిసలుగా ఉండడానికి బ్రాహ్మణీయ దోపిడీ, అణచివేత, వివక్షలను అర్థం చేసుకోకపోవడం, అందుకు చదువు లేకపోవడమే మూలమని ఫూలే గ్రహించాడు. 1834-38 కాలంలో ఫూలే మరాఠీ పాఠశాలలో చేరి విద్యాభ్యాసం ప్రారంభించారు. శూద్రులు, అగ్రవర్ణాలకు సేవలు చేయాలేగానీ విద్య నేర్చుకోకూడదని బ్రాహ్మణులు ఆయన తండ్రి గోవిందరావును బెదిరించి ఫూలే చదువు (బడి) మానిపించారు. బ్రాహ్మణుల కుటిలోపాయాల్ని గ్రహించిన ఫూలే తన తండ్రి స్నేహితులైన ముస్లిం, క్రిస్టియన్ మతస్థులైన వారి ద్వారా లహుజీబువామాంగ్ వద్ద క్రిస్టియన్ మిషనరీ (ఇంగ్లీష్) పాఠశాలలో మళ్లీ విద్యాభ్యాసం ప్రారంభించి బ్రాహ్మణ విద్యార్థుల కన్నా ప్రతిభావంతుడయ్యాడు.
తరగతి గదిలో స్నేహం ఏర్పడ్డ ఓ బ్రాహ్మణ విద్యార్థి ఫూలేను తన వివాహానికి ఆహ్వానిస్తాడు. ఆ వివాహానికి హాజరైన ఫూలేను బ్రాహ్మణులు, తోటమాలి కులస్తుడని తెలుసుకొని బ్రాహ్మణులతో పెళ్ళిలో సమానంగా నడవడమా? అంటూ, శూద్రుడంటూ ఫూలే ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తారు. అలా అవమానించిన బ్రాహ్మణుల దోపిడీ, అణిచివేతల్ని బహిర్గతపర్చాలని కంకణం కట్టుకొని 1848లో పుణేలో మొట్టమొదటగా దళిత (అస్పృశ్యులకు) బాలికలకు పాఠశాల నెలకొల్పారు. ఆ తదనంతరం 1851లో మరో రెండు పాఠశాలల్ని నెలకొల్పారు. శ్రామిక ప్రజల కోసం 1855లో ‘రాత్రి బడి’ని స్థాపించారు. ఇలా బ్రాహ్మణ వ్యతిరేకతతో శూద్ర వర్గంలోని అతిశూద్రులకు విద్యావ్యాప్తి చేయడంతో బెంబేలెత్తిన బ్రాహ్మణులు 1849లో ఫూలేను ఆయన తండ్రి చేత కుటుంబం నుంచి బహిష్కరింపజేశారు. అయినా ఫూలే కలత చెందక మొక్కవోని ధైర్యంతో, పట్టుదలతో మరింత ముందుకు పోయాడు. జీవిత భాగస్వామి సావిత్రీభాయి సహకారంతో బ్రాహ్మణ వ్యతిరేక సాంస్కృతిక పోరాటాల్ని నిర్మించారు ఫూలే.
గాంధీజీ కంటే ముందే మహాత్మునిగా జన నీరాజనాలందుకున్న జోతీరావు ఫూలే దంపతులు నివసించిన భవనం నేటికీ పుణేలో నిలిచి ఉంది. ఆ భవనంలోని హాలులో ఫూలే, సావిత్రిబాయి ఫూలే, సాహు మహరాజ్‌ల సరసన మరో నిలువెత్తు చిత్రపటం కనబడుతుంది. ఆయన ఫూలే సామాజిక సంస్కరణోద్యమానికి తుదిశ్వాస వరకు చేదోడువాదోడై నిలిచిన జాయా కారాడీ లింగు తెలంగాణం కన్న మున్నూరు కాపు బిడ్డ . నైజాం సంస్థానంలో న్యాయమూర్తి పదవిని కాదనుకొని తండ్రిలా భవన నిర్మాణవృత్తిని చేపట్టారు. పుణే, ముంబైలలో సామాజిక ఉద్యమకారునిగా సుప్రసిద్ధులైన ఆయన పుణే మునిసిపాలిటీకి ఎన్నికై, 12 ఏళ్ళు ప్రజాప్రతినిధిగా పనిచేశారు. కారాడీ లింగువంటి సహచరుడు దొరకడం ఫూలే అదృష్టమని చరిత్రకారులు అంటారు. కారాడి లింగు తండ్రి జాయా ఎల్లప్పలింగు ముంబైలో భవన నిర్మాణ కాంట్రాక్టరు. ఫూలే కొంతకాలం భవన నిర్మాణ కాంట్రాక్టరుగా పనిచేశారు. అప్పుడే ఆయనకు ముంబై తెలుగు ప్రజల పితామహునిగా ప్రసిద్ధులైన కాంట్రాక్టరు రామయ్య వెంకయ్య అయ్యవారితో పరిచయమైంది. వెంకయ్య ఫూలేను ముంబైకి ఆహ్వానించి, తోటి కాంట్రాక్టర్లతో కలిసి సత్యశోధక సమాజాన్ని విస్తరింపజేయడానికి, పాఠశాలలను ఏర్పాటుచేసి నడపడానికి ఆర్థిక, హార్దిక సహాయాలను అందించారు. సత్యశోధక సమాజానికి తెలుగువారి విరాళాలే ప్రధాన ఆర్థిక వనరుగా ఉండేవి.
అందులో బొంబాయి నిర్మాణానికి తెలంగాణ నుండి వలస వెళ్ళి ఎదిగిన మున్నూరుకాపులే అధికం.బొంబాయిలో సత్యశోధక్ సమాజ్ శాఖ పుట్టింది సయాజీ నాగు మున్నూరుకాపు ఇంటిలోనే.
వెంకయ్య ఇల్లే అనాథ బాలల ఆశ్రమంగా ఉండేది. వారిని గొప్పవిద్యావంతులుగా, సత్యశోధకులుగా చేసిన ఘనత వెంకయ్యదే. ఆయన రచించిన ‘ఈశ్వరునికి ప్రార్థన’ను మరాఠీలోని తొలి వ్యంగ్యరచన గా గుర్తించాలని సాహిత్య చరిత్రకారులు కోరుతున్నారు. ఫూలే ప్రసిద్ధ గ్రంథం ‘గులాంగిరి’ని ఆయనే ప్రచురించారు.
వెంకయ్య కుటుంబ సభ్యులు సావిత్రీబాయి జీవిత చరిత్రను కూర్చి, మూడుమార్లు ప్రచురించారు. సాహు మహారాజ్‌కు ఆంతరంగిక సలహాదారుగా పనిచేసిన భాస్కర్‌రావ్ జాదవ్, రామయ్య తీర్చిదిద్దిన ఆణిముత్యాలలో ఒకరు మాత్రమే. జాదవ్ సత్యశోధక ఉద్యమ నాయకునిగా అన్ని వర్గాల గుర్తింపును పొందారు. ఫూలే ఆలోచనల వ్యాప్తికి, కార్మిక సమస్యలను వెలుగులోకి తేవడానికి కృషిచేసిన ‘దీనబంధు’ పత్రికకు ఆయనే వెన్నెముకై నిలిచారు. ఫూలేకు అడుగడుగుడునా అండదండగా నిలిచి, ఆయన తర్వాత కూడా సత్యశోధక సమాజ ఉద్యమాన్ని కొనసాగించిన వారిలో తెలుగువారి పాత్ర అద్వితీయమైనది.
మాధవి కాళ్ల
సేకరణ