మాకంటు ఎవరున్నారో…!!!
కాలమనే గొడుగు క్రింద
ఉదయ సంధ్యలు రంగులు మారినా…
అదే మనుష్యుల మధ్యన మాదోలోకం
ఉషస్సులతో వెలుగులకు గౌరవమైనా…
నలిపే ఆకలి కార్చేకన్ను మాకు సొంతం
కంటికొచ్చినా కాలికొచ్చినా సాయమవని
వింత లోకంలో మాకంటూ ఎవరున్నారో…
సంఘం మరిచిన అనాధలం
చూపలేని మానవత్వానికి దోషులం
చచ్చిన ఆత్మగౌరవంతో దేహాలమైనా
నిండని యాతనలతో ఆకలి యుద్ధమే…
కాలిన కడుపునకు మాడే గంజినీళ్ళే…
ఇది శాపమా లేక ఆయాచిత వరమా…
తెలిపేవారెవరో మాకై నడిచేవారెందరో…
పొద్దులు తెలుపని బుద్ధులు
పులిసిన పూటకు తెరిచిన నాలుకను
తడుపుకోలేని నిత్య జీవనయానంలో…
బోధపడేదేముంది ముఖమారడం తప్పా
ఏమరపాటెందుకని ఎక్కడిదీ లోపమని
నిలదీసిన క్షణాలు వెర్రితనాలతో పోకడే…
అతకని బతుకులు చిల్లుల
జల్లెడలో చేరుకోలేని జీవనగతులు
చీదరింపులే కాని అక్కున చేర్చుకొనే
వారెవ్వరులేని మా ప్రయాణం ఎందాకో…
ఒంటరైన ఓర్పులతో మాకుమేమే మార్గం
సమాజాన కరుణకు నోచుకోని శిలలమని
ఉచితాల ఉప్పెనలు సంక్షేమ సాగరాలు
పారేదెంతవరకో వరద నిలిచేది ఏదరికో…
దేరంగుల భైరవ (కర్నూలు)
9100688396