సామాజిక శ్వాస

అక్షర కొరకు
అంశం :⁠- నేటి పిల్లల ప్రవర్తన,సామాజిక బాధ్యతలు
తేది:⁠- 10/12/2025
శీర్షిక:⁠- సామాజిక శ్వాస

కళ్ల ముందు ప్రపంచం
అరచేతిలో ఇంటర్నెట్
ప్రతి క్లిక్‌లో వేగం
కొత్త ప్రవర్తనకు స్వాగతం
తెర చాటున దాగున్న
ఏకాంతపు నవ్వులు

గేమ్స్‌లో గెలుపులకై
పగలంతా పరుగులు
నిజమైన స్నేహాలు
లైకుల్లో పోగేయగా
మానవ స్పర్శకు దూరమై

మనసు మౌనంగా నిలిచిపోతూ
తక్షణ ఫలితాలకై పెరిగే ఆరాటం
ఓపిక నేర్పని ఈ ఆధునిక పోరాటం
అపారమైన శక్తి నీలో దాగుందని
ప్రశ్నించే గుణం ఆలోచించే బుద్ధి ఉన్నా

ప్రతి సమస్యకు పరిష్కారం అన్వేషించే ధీరత
నీవే రేపటి ప్రపంచానికి కొత్త నాంది
సామాజిక బాధ్యత అంటే కేవలం మాట కాదు
చట్టాలను పాటించడమే సరిపోదు
నీ చుట్టూ ఉన్న ఆ పచ్చదనాన్ని కాపాడు

ప్లాస్టిక్‌ను తరిమేయడానికి మొదటి అడుగు వేస్తూ
ఆన్‌లైన్‌లో పలికే ప్రతి మాటకు విలువ ఇస్తూ
సైబర్ దాడుల నుండి సమాజాన్ని రక్షిస్తూ
తప్పుడు వార్తకు అడ్డుకట్ట వేసే జ్ఞానంతో
అదే నీవు నేర్చుకోవలసిన గొప్ప పౌర ధర్మం

కష్టాల్లో ఉన్నవారికి చేయూత అందిస్తూ
నీ ప్రేమను సానుభూతిని పంచుతూ
స్క్రీన్ వెలుగును పక్కన పెట్టి సూర్యరశ్మిలో నడవాలని
శారీరక, మానసిక ఆరోగ్యాన్ని ప్రేమించాలని
డిజిటల్ ప్రపంచంలోనూ మనిషిగా జీవించాలని
నీ ప్రవర్తనే లోకానికి మార్గం కావాలని
సామాజిక శ్వాసతో బాల్యం వర్థిల్లాలి…

మాధవి కాళ్ల..
హామీ పత్రం :⁠-
                      ఈ కవిత నా సొంతమని హామీ ఇస్తున్నాను..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *