vennela poojitha

కృష్ణవేణి(మత్తు వీడిన ప్రేమ పయనం)

అక్షర కొరకు
అంశం :⁠- నేటి పిల్లల ప్రవర్తన,సామాజిక బాధ్యతలు
తేది:⁠- 12/12/2025
శీర్షిక:⁠- కృష్ణవేణి(మత్తు వీడిన ప్రేమ పయనం)

                 అజయ్ డిగ్రీ కళాశాలలో చదువుతున్న చురుకైన విద్యార్థి. 
                 అతనికి తన క్లాస్‌మేట్ అయిన కృష్ణవేణి అంటే చాలా ఇష్టం. 
             అది కేవలం స్నేహం కాదు,తీక్షణమైన ఆకర్షణ,తొందరపాటు ప్రేమ. 

కృష్ణవేణి కూడా అజయ్ వైపు మొగ్గు చూపింది. వారు తరగతి గదిలో, క్యాంటీన్‌లో కలిసి గడపడం, రోజంతా ఫోన్లలో మాట్లాడుకోవడం వారి ప్రపంచమైంది. ఈ తొలి ప్రేమ వల్ల వారి చదువు కొద్దిగా పక్కకు మళ్లింది.
ఒకరోజు అజయ్ స్నేహితుల్లో ఒకడైన విక్రమ్ వారికి పరిచయమయ్యాడు. విక్రమ్ తరచుగా కొత్త అనుభూతి పేరుతో చిన్న చిన్న పార్టీలకు పిలిచేవాడు. మొదట్లో ఉల్లాసంగా, సరదాగా అనిపించినప్పటికీ…
ఆ పార్టీలలో గంజాయి వినియోగం అలవాటుగా మారింది.
కృష్ణవేణి ముందు అజయ్ ధైర్యాన్ని చూపడానికి, విక్రమ్ బలవంతంతో…
మొదట్లో గంజాయిని ప్రయత్నించాడు. ఆ ఉల్లాసం తాత్కాలికమే. క్రమంగా అజయ్‌కు డ్రగ్స్ అలవాటు పెరిగింది. పరీక్షలు దగ్గర పడుతున్నా, చదువుపై దృష్టి పెట్టలేకపోయాడు. కృష్ణవేణి ఎంత మందలించినా,
“కేవలం సరదా కోసమే” అని చెప్పి, తనను పట్టించుకోవడం మానేశాడు.
అజయ్ ప్రవర్తన పూర్తిగా మారిపోయింది , తన ప్రేమ స్థానంలో విసుగు కృష్ణవేణిని దూరం పెట్టడం మొదలుపెట్టాడు. డ్రగ్స్ దొరకనప్పుడు విపరీతమైన ఆవేశానికి లోనయ్యేవాడు. తల్లిదండ్రులను, స్నేహితులను మోసం చేయడం, డబ్బు కోసం అబద్ధాలు చెప్పడం మొదలుపెట్టాడు. సమాజం పట్ల, తన భవిష్యత్తు పట్ల ఏమాత్రం శ్రద్ధ లేకుండా పోయింది?
అజయ్ డ్రగ్స్‌కు బానిస అవ్వడం చూసి కృష్ణవేణి గుండె పగిలింది. ఇది కేవలం అతని వ్యక్తిగత సమస్య కాదని, తమ భవిష్యత్తు, తన చుట్టూ ఉన్న సమాజంపై కూడా ప్రభావం చూపే ప్రమాదకరమైన అలవాటు అని ఆమె గ్రహించింది. ఆమె ప్రేమ ఎంత బలమైనదైనా, ఈ వ్యసనం ముందు నిలబడలేదని తెలుసుకుంది.
ఆమె ఒక ధైర్యమైన నిర్ణయం తీసుకుంది.
ముందుగా, అజయ్‌ను చివరిసారిగా హెచ్చరించింది. అతను మారడానికి నిరాకరించడంతో… ఆమె అతని ప్రేమను వదులుకుంది. ఆమె కళాశాల కౌన్సెలర్‌ను, తల్లిదండ్రులను సంప్రదించి, అజయ్ పరిస్థితి గురించి వివరించింది.
కృష్ణవేణి దూరం కావడం, తల్లిదండ్రుల ఒత్తిడి, మరియు కౌన్సిలింగ్ వల్ల అజయ్ కొద్దిగా కదిలాడు.
అతను చికిత్స కేంద్రంలో చేరి డ్రగ్స్ నుండి బయటపడటానికి తీవ్రంగా పోరాడాడు. అతనిలో మార్పుకి కృష్ణవేణి ప్రేమ కాకపోయినా, ఆమె తన పట్ల చూపిన బాధ్యత , తన నిర్ణయం కారణమయ్యాయి.
అజయ్ పూర్తిగా కోలుకున్నాక, అతను పాత స్నేహితులందరినీ వదిలేశాడు. తాను చేసిన తప్పును గుర్తించి, తన చదువుపై దృష్టి పెట్టాడు.
కృష్ణవేణిని కలిసి క్షమించమని అడిగాడు. ఆమె అతనిని కేవలం స్నేహితుడిగా అంగీకరించి, ఈ విజయాన్ని అభినందించింది. అజయ్ తన జీవితంలోకి రావడంతో…
కొత్త లక్ష్యాన్ని ఎంచుకున్నాడు.
తాను మారడానికి కారణమైన డ్రగ్స్ వ్యసనం నుండి ఇతరులను కాపాడటం. అతను తన కళాశాలలో, చుట్టుపక్కల యువతలో డ్రగ్స్ వ్యతిరేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా తన సామాజిక బాధ్యతను నిర్వర్తించడం ప్రారంభించాడు.
ప్రేమ మన జీవితంలో ఒక భాగమే కావచ్చు, కానీ , మత్తు మందులు మొత్తం జీవితాన్నే నాశనం చేయగలవు. కృష్ణవేణి తన ప్రేమ కంటే తన బాధ్యతను, తన తోటి యువత భవిష్యత్తును ముఖ్యంగా భావించింది. ఆమె ప్రేమకు లొంగిపోకుండా, సరైన నిర్ణయం తీసుకోవడం ద్వారా, పరోక్షంగా అజయ్ జీవితాన్ని రక్షించి, తన నిజమైన సామాజిక బాధ్యతను చాటుకుంది.

మాధవి కాళ్ల..
హామీ పత్రం :⁠-
                      ఈ కథ నా సొంతమని హామీ ఇస్తున్నాను..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *