విజయమే..దరహాసం చేస్తూ…!
నిజ జీవితమంటే ఇదేను
పచ్చ పచ్చని తివాసీ కాదు
సుఖ దు:ఖాల తోరణం
వెలుగు నీడల సమ్మేళనం..!
ఏడాది కేడాదిగా మన
ఎడదలో పెరుగుతున్న
పెను బాధల పొదలను
ఆశల కత్తితో తొలగించాలి..!
మనసులో పెనవేసుకొన్న
కలతలను తలచుకొంటూ
కన్నీరును ధారగా కార్చకు
చిత్తములోని చిరు దీపాన్ని
చింతల చికాకులతో ఆర్పకు…!
ప్రకృతి లో ప్రతి జీవికి తప్పదు
చీడ పీడలతో ఈతి బాధలు
కాలమే వాటికి మందు రాస్తుంది
నిటారుగా వాటిని నిలబెడుతుంది…!
జీవన యానంలో.. మనకు
ముండ్లు,రాళ్లు ఎదురౌతాయి
తెలివిగా వాటిని తొలగిస్తూ
గమ్యం చేరటం మన కర్తవ్యం…!
అనుకున్నది సాధించేంట వరకు
ఆపకూడదు.. మన పయనం
సంకల్ప బలంతో ముందుకెళ్లితే
విజయమే దరహాసమును చేస్తూ
మనకు సాదర స్వాగతం పలుకుతుంది…
ఇట్లు
మీ
కోటేశ్వరరావు ఉప్పాల