అగ్నిపూవు!
అపజయాల జీవితం
కళ్ళు కాయలు కాసేలా చదివి
అనారోగ్యం పీడించి పీడించి
మనస్సు దహించుకు పోగా
ఉదయ కిరణాలు కనురెప్పల్లో కరిగిపోగా
రోజులకు రోజులు వృధా ప్రయాసలై
కళ్ళు తెరిస్తే కారుచీకట్ల కౌగిలింతలై
వేళాకోళమాడే పెదరాయుల్లు
కళ్ళల్లోంచి మరిగిన కన్నీటి దారలు!
పోకిరీ వెధవలు పొంచి పొంచి
కాటు వేసే కాలనాగులు
చదివిన చదువు బూడిదలో పోసిన పన్నీరై
దరిదాపుల్లో ఎవరూ లేని ఏకాకినై
హిమవన్నగం కరిగి కరిగి నీరై
సముద్రంలో కలిసి కనుమరుగైనట్లు!
దూరాలు సుదూరాలు నడచి నడచి
కాళ్ళ నొప్పులే గాని ఫలితం శూన్యం!
ఆకలి దప్పికలు మరచి నరకం కళ్ళ చూసి
రగిలి పగిలిన మనసు మూగ బాధ
ఎండి బీటలు వారిన చెరువులా
కన్నీళ్ళు ఇంకి కలలు కూడ రాని కళ్ళు
పగిలి బీటలు బడ్డ అద్దంలో అగుపడే వికృత ప్రతిబింబాలు
మనసు కయిన గాయంతో పాకుడు రాయిలా పాక్కుంటూ,,,,,,,!
అంధకార బంధుర చీకట్లు ముసిరి
పెనంపై మాడుతున్న రొట్టెలా
మండువేసవిలొ ముళ్ల కిరీటం తలపై పెట్టుకున్నట్లు
గుంపులో గోవిందయ్యనై
చావు తప్పి కన్ను లొట్టబోయినట్లు
ఒక చిన్న సర్కారీ కొలువులో
గానుగెద్దులా పనిచేస్తూ పదవీవిరమణ
దగ్గర దగ్గర దైవం చేత పూయించిన అగ్నిపూవును!
అపరాజిత్
సూర్యాపేట