అక్షర ప్రేమలేఖల కొరకుఅంశం :⁠- చిత్రంతేది:⁠- 18/01/2026శీర్షిక:⁠- అనంత కాలపు అనురాగ లేఖ

నా ప్రాణానికి ప్రాణమైన నీకు…

ఓ ప్రియతమా…

 నా మనసు ఒక వింతైన ఉద్వేగానికి లోనవుతోంది.నువ్వు నా పక్కన ఉన్నప్పుడు,ఆకాశంలోని నక్షత్రాలు మన చుట్టూ నాట్యంచేస్తున్నట్లు అనిపిస్తుంది.మన ప్రేమ కేవలం ఈ భూమికి పరిమితం కాదు ,

అది అనంతమైన అంతరిక్షంలాంటిది. రంగురంగుల నీహారికల మధ్య, కాంతి వేగంతో ప్రయాణించే మన భావాలు ఒకదానికొకటి ఎప్పుడూ తోడుంటాయి. నీ కళ్లల్లో చూసినప్పుడు నాకు ఈ విశ్వం తాలూకు రహస్యాలన్నీ అర్థమవుతాయి.
నీ చూపులో ఒక సమ్మోహనం ఉంది.
నీ నవ్వులో ఒక పరవశం ఉంది.
ఆ రంగుల నీడల్లో మనం ఒకరికొకరం అంకితమైపోవడం కంటే గొప్ప అదృష్టం మరొకటి ఉంటుందా?

మనం పెరిగిన ఈ పల్లెటూరి వాతావరణం, ఆ సంక్రాంతి సంబరాలు, రంగులతో అలంకరించిన ఆ బసవన్న. మన ప్రేమకు మూగ సాక్ష్యాలు. పసుపు, కుంకుమల అలంకారంతో, మెడలో గంటల సవ్వడితో ఆ నందీశ్వరుడు మన ముంగిట నిలిచినప్పుడల్లా, మన బంధం కూడా అంతే పవిత్రమైనది అని నా మనసు చెబుతుంది.
ఆ గంటల సవ్వడిలో నీ మాటలు వింటాను, ఆ బసవన్న కళ్లలోని నిశ్శబ్దంలో నీ మౌనాన్ని చదువుతాను. పండుగ రోజున కొత్త బట్టలు కట్టుకుని నీ కోసం ఎదురుచూసే ఆ క్షణాలు, నా జీవితంలో అత్యంత మధురమైనవి.

నిజమే.. కాలం ఎప్పుడూ మనకు అనుకూలంగా ఉండదు. ఏదో ఒక రూపంలో మనల్ని దూరంగా ఉంచాలని ప్రయత్నిస్తుంది. కానీ దూరం పెరిగిన కొద్దీ ప్రేమ విలువ పెరుగుతుంది అంటారు కదా?
నీ జ్ఞాపకాల లిపి నా గుండె గోడల మీద ఎప్పటికీ చెరిగిపోదు? నువ్వు నా పక్కన లేని ప్రతి క్షణం, నా హృదయం నిన్ను తలుచుకుంటూ నలిపి వేయబడుతోంది.

నీ వాలు చూపుల కోసం
నీ మధురమైన మాటల కోసం
నా ప్రాణం పరితపిస్తోంది.
నీలో వికసించే ఆ విరులు
నీ మాటల్లోని ఆ తీయదనం
నా జీవన గమ్యానికి దిక్సూచీలు.
మన మధ్య ఉన్న ఈ ఎడబాటు తాత్కాలికమే.
ఈ హృదయం మళ్ళీ నీ వెచ్చని రాక కోసం
నీ స్పర్శ కోసం వేచి చూస్తూనే ఉంటుంది.

చెప్పాల్సినవి చాలా ఉన్నాయి , రాసే కొద్దీ అక్షరాలు పెరుగుతూనే ఉంటాయి. కానీ , నా మనసులోని భావం మాత్రం తరగదు. మనం మళ్ళీ కలుస్తాం.
ఆ నింగీ నేలా కలిసే చోట
ఆ మంచు నిప్పులు జతకట్టే చోట
ఈ విశ్వమంతా మన ప్రేమ నిండిపోయేలా.. ఆ రోజు కోసం నేను వెయ్యి కళ్లతో నిరీక్షిస్తాను.
నీ అక్షరాల కోసం, నీ పిలుపు కోసం ఎదురుచూస్తూ…
సదా నీ ప్రేమలో….

నీ ప్రాణం…

మాధవి కాళ్ల..
హామీ పత్రం :⁠-
                      ఈ లేఖ నా సొంతం అని హామీ ఇస్తున్నాను..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *