అంశం
రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారి గురించి
డా. భీంరావ్ రామ్‌జీ అంబేద్కర్ గారు భారతదేశ చరిత్రలో అత్యంత ప్రాముఖ్యత గల వ్యక్తి. ఆయన గొప్ప సామాజిక సంస్కర్త, రాజ్యాంగ నిర్మాత, న్యాయ వేత్త, ఆర్థికవేత్త మరియు అణగారిన వర్గాల హక్కుల కోసం పోరాడిన మహానాయకుడు. భారతదేశానికి సమానత్వం, న్యాయం, స్వేచ్ఛ వంటి విలువలను అందించిన మహనీయుడు అంబేద్కర్ గారు.అంబేద్కర్ గారు 1891 ఏప్రిల్ 14న మధ్య ప్రదేశ్ రాష్ట్రంలోని మహూ లో జన్మించారు. ఆయన తండ్రి గారు రామ్‌జీ మాలోజీ సక్పాల్, తల్లి భీమాబాయి. చిన్నతనం నుంచే ఆయన తీవ్ర సామాజిక వివక్షను ఎదుర్కొన్నారు. చదువులో ప్రతిభ ఉన్నప్పటికీ, కుల వివక్ష కారణంగా అనేక అవమానాలు భరించాల్సి వచ్చింది. అయినా అవి ఆయనను కుంగదీయలేదు. మరింత దృఢ సంకల్పంతో ముందుకు నడిపించాయి.
అంబేద్కర్ గారు భారతదేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా ఉన్నత విద్యను అభ్యసించారు. అమెరికాలోని కొలంబియా విశ్వవిద్యాలయం, ఇంగ్లండ్‌లోని లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లలో చదివి గొప్ప పాండిత్యం సంపాదించారు. విద్యనే సమాజ మార్పుకు ఆయుధమని ఆయన నమ్మారు.భారత స్వాతంత్ర్యం అనంతరం భారత రాజ్యాంగ రచన కమిటీకి అంబేద్కర్ గారు చైర్మన్‌గా నియమితులయ్యారు. భారత రాజ్యాంగాన్ని రూపకల్పన చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ప్రతి పౌరుడికి సమాన హక్కులు, స్వేచ్ఛ, న్యాయం కల్పించేలా రాజ్యాంగాన్ని రూపొందించారు. అందుకే ఆయనను “భారత రాజ్యాంగ శిల్పి” అని గౌరవిస్తారు.
అంబేద్కర్ గారు జీవితాంతం దళితులు, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేశారు. అస్పృశ్యతను నిర్మూలించాలనే లక్ష్యంతో అనేక ఉద్యమాలు చేపట్టారు. 1956లో అంబేద్కర్ గారు బౌద్ధమతాన్ని స్వీకరించి, సమానత్వం మరియు మానవ గౌరవాన్ని ప్రబోధించారు. అదే సంవత్సరంలో డిసెంబర్ 6న ఆయన పరమపదించారు. అయితే ఆయన ఆలోచనలు, ఆదర్శాలు నేటికీ కోట్లాది మందికి మార్గదర్శకంగా ఉన్నాయి.
డా. బీ.ఆర్. అంబేద్కర్ గారి జీవితం మనకు ధైర్యం, విద్య ప్రాముఖ్యత, సమానత్వం విలువలను నేర్పుతుంది. అంబేద్కర్ గారి ఆశయాలను అనుసరించడం ప్రతి భారతీయుడి బాధ్యత.
వెంకట భాను ప్రసాద్ చలసాని.