త్రిపురారిభట్ల వీరరాఘవస్వామి(పండితులు, రచయిత)

త్రిపురారిభట్ల వీరరాఘవస్వామి (సెప్టెంబరు 9, 1892 – జనవరి 30, 1981) పండితులు, రచయిత, నాట్య కళాకారుడు.
వీరు వైదికులు, భారద్వాజస గోత్రులు, ఆపస్తంబ సూత్రులు. 1892 సెప్టెంబరు 9 న (నందన నామ సంవత్సర భాద్రపద శుక్ల తదియ, శుక్రవారం) వెంకటప్పయ్య శాస్త్రి, అన్నపూర్ణమ్మ దంపతులకు జన్మించారు. స్వస్థలం తెనాలి మండలం బుర్రిపాలెం. చిన్ననాడు ఆంగ్లవిద్యను అభ్యసించినా, తర్వాతకాలంలో ఆయన సంస్కృత భాషను నేర్చుకొని కావ్య, నాటక, అలంకార, తర్క, వ్యాకరణ, పూర్వమీమాంస జ్యోతిశాస్త్రాలలో పాండిత్యాన్ని సంపాదించారు. శ్రీ కళ్యాణానంద భారతీ స్వామివద్ద వేదాంత భాష్యం చదివి, శ్రీవిద్యలో పాదుకాంత దీక్ష గ్రహించి, వేదాంత పారీణ అను బిరుదును పొందారు. తెనాలిలోని రామ విలాస సభకు వీరు ఉపదేష్ట.

చలనచిత్రరంగంలో కూడా ఆయన గడించారు. సినీనటి కాంచనమాలకు ఆయన నాట్యశాస్త్ర గురువు. విప్రనారాయణ చిత్రానికి సినేరియో రచయితగాను, నాట్యరంగ విధాతగాను, ఉషా పరిణయం చిత్రానికి రచయితగాను పనిచేశారు. తల్లావజ్ఝల శివశంకరశాస్త్రితో కలసి సాహితీ సమితిని స్థాపించారు. ఆ సంస్థలో కార్యదర్శిగాను, మంత్రిగాను, ఉపాద్యక్షునిగాను సుమారు 25 సంవత్సరాలు పనిచేశారు.

వీరు సాహితి పత్రికకు, విశ్వజనీయ గ్రంథావళికి సహ సంపాదకులుగా పనిచేశారు. తెనాలిలోని సంస్కృత పాఠశాలకు తొలి ప్రధానోపాధ్యాయులుగా పనిచేశారు.

వీరు ఎన్నో కవితలను, కథానికలను, వ్యాకరణ గ్రంథాలను, నవలలను రచించారు.
వీరు ఆంధ్ర విశ్వకళాపరిషత్తు సెనేటులో, సిండికేటులో, పాఠ్యగ్రంథ నిర్ణాయక సంఘంలోను సభ్యులుగా వ్యవహరించారు.
ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీలో మొదట సాధారణ సభ్యత్వం పొంది, తర్వాత విశిష్ట సభ్యత్వాన్ని పొందారు.
వీరు 1981 జనవరి 30 న పరమపదించారు.
తెనాలిలో ఆయన నివసించిన వీధికి “త్రిపురారిభట్లవారి విథి” అని పేరు పెట్టారు.

వాల్మీకి విజయము
కపాల కుండల (నవల) బెంగాలీ భాషలో బంకించంద్ర చటర్జీ రచనకు తెలుగు అనువాదం
ఏకోత్తర శతి బెంగాలీ భాషలో రవీంద్రనాథ ఠాగుర్ రచించిన రచనను కేంద్ర సాహిత్య అకాడమి కోరికపై తెలుగుపద్యకావ్యంగా అనువదించారు.
నవమాలిక. దీనిని జయా పబ్లిషర్స్, తెనాలిలో 1948లో ప్రచురించారు.

మాధవి కాళ్ల
సేకరణ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *