నాయని కృష్ణకుమారి(తెలుగు రచయిత్రి)

నాయని కృష్ణకుమారి (మార్చి 14, 1930 – జనవరి 30, 2016) తెలుగు రచయిత్రి. ఆమె కవి నాయని సుబ్బారావు కుమార్తె.
నాయని కృష్ణకుమారి గుంటూరు జిల్లాలో 1930, మార్చి 14 న జన్మించారు. ఈమె తల్లిదండ్రులు హనుమాయమ్మ, నాయని సుబ్బారావు. ఈమెకు ఒక తమ్ముడు, ముగ్గురు చెల్లెళ్లు ఉన్నారు.ఆమె అక్షరాలా బాల్యం నుంచి కవిత్త్వ తత్త్వం ఆకళించుకున్న కవయిత్రి. సుబ్బారావుగారు ప్రముఖసాహితీవేత్తలతో జరుపుతున్న చర్చలు వింటూ చిన్నతనంలోనే నలుగురిలో నిర్భయంగా మెలగడం, మాట్లాడడం నేర్చారు ఆమె.

ఆమె పాఠశాల చదువు నరసరావుపేట, శ్రీకాకుళం లలో పూర్తిచేశారు. గుంటూరులో కాలేజీచదువు పూర్తి అయిన తరువాత 1948లో ఆమె తెలుగు ఎం.ఎ. చెయ్యడానికి విశాఖపట్నం వెళ్లారు. అక్కడ ఉన్న మూడేళ్లూ ఆమె సాహిత్యాభిలాషని తీర్చి దిద్దడానికి ఎంతగానో తోడ్పడినాయి. అంతకుముందే, ఆమె బి.యే. చదువుతున్న రోజులలో ఆంధ్రులచరిత్ర క్లాసులో రాసుకున్న నోట్సు ఆధారంగా “ఆంధ్రులకథ” అన్న పుస్తకం రాసి ప్రచురించారు. అప్పటికి ఆమె వయసు 18 ఏళ్లు. ఆపుస్తకం ఆనాడు స్కూళ్లలో పాఠ్యపుస్తకంగా తీసుకుంది ఆంధ్రప్రభుత్వం. విశాఖపట్నంలో ఉన్నప్పుడు ఆమెకి అనేకమంది రచయితలతో పరిచయం అయింది. కృష్ణకుమారిగారు విశేషంగా సాహిత్యసభలలో, నాటకాలలో పాల్గొంటూ, తన సాహిత్య కృషికి బలమైన పునాదులు వేసుకున్నారు. ఆమె తెలుగు యం.ఏ. అయినతరువాత, మద్రాసులో ఒక ఏడాది లెక్చరరుగా పనిచేసి, తరువాత హైదరాబాదు వచ్చి స్థిరపడ్డారు. ఉస్మానియా యూనివర్సిటీలో లెక్చరరుగా మొదలు పెట్టి, రీడరయి, ప్రొఫెసరయి, ఆ తరువాత, పొట్టిశ్రీరాములు తెలుగు యూనివర్సిటి వైస్ ఛాన్సలర్‍గా 1999 లో పదవీ విరమణ చేశారు.

ఉస్మానియా యూనివర్సిటీలో తిక్కన కవితావైభవంమీద పి.హెచ్.డి మొదలు పెట్టేరు కానీ పూర్తి చేయ్యలేదు. ఆతరువాత, ఆమె భర్త మధునసూదనరావు, మిత్రులు అంతటి నరసింహం ప్రోత్సహించగా, తెలుగు జానపదసాహిత్యంలో పరిశోధన చేసి, పి.హెచ్.డి. పట్టా అందుకున్నారు. ఆమె సిద్ధాంతగ్రంథం, “జానపదగేయగాథలు” అన్న శీర్షికతో 1977లో ప్రచురించారు. ఆ తరువాత ఆమె తన దృష్టి అంతా జానపదసాహిత్యంమీదే కేంద్రీకరించింది.

అగ్నిపుత్రి (1978)
ఆయాతా (కథల సంకలనం)
ఏం చెప్పను నేస్తం (కవితాసంకలనం. 1988)
పరిశీలన (వ్యాససంకలనం. 1977)
పరిశోధన (వ్యాససంకలనం. ఆంధ్ర సారస్వత పరిషత్ ప్రచురణ. 1979)
తెలుగు జానపద వాఙ్మయము. సంఘము, సంస్కృతి, సాహిత్యం. పరిశోధన గ్రంథం. (పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయము. 2000)
జానపద సరస్వతి. (జానపద సాహిత్య పరిషత్. 1996)
కాశ్మీర దీపకళిక (యాత్రాచరిత్ర)

బిరుదురాజు రామరాజు, నాయని కృష్ణకుమారి. (సం.) జానపద వాఙ్మయచరిత్ర.
అంతటి నరసింహం. వినయశీలి విజ్ఞానశీలి కృష్ణకుమారి. (నాయని కృష్ణకుమారి సన్మానసంచిక, 1990. పు. 12-24)
చేకూరి రామారావు. (సం.) విదుషి: నాయని కృష్ణకుమారి సన్మాన సంచిక. (హైదరాబాదు, 1990).
గృహలక్ష్మి స్వర్ణకంకణం
పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ ఉత్తమ రచయిత్రి బహుమతి
ఆంధ్ర ప్రదేశ్ సాహిత్య ఎకాడమీ బహుమతి.

2016, జనవరి 30 న మరణించారు.

మాధవి కాళ్ల
సేకరణ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *