మనుషుల మీద..నాకు నమ్మకం పోయింది…!

నేటి మనుషుల మీద
నాకు నమ్మకం పోయింది..
మాటలలో వుంది మార్మికత
చేతలలో పారదర్శకత లేదు
మోహాల్లో సాత్వికాభినయం
ప్రజా క్షేత్రంలో నటనాభిషేకం..!

దొంగెవరో..దొరెవరో తెలియటంలేదు..?
అందరూ పెద్ద మనుషుల్లా కన్పించే
మనుషులు మనసుల కల్తీల మీద
మానవ వనరుల సంస్థ చేత
తప్పక దర్యాప్తు చేయించాలి…!

ఏది నిజమో.. ఏది అబద్ధమో
ఇప్పటికీ అర్థం కాకుండా వుంది
అయోమయ మాయ లోకంలో
దేశం కొట్టు మిట్టాడు తోంది
త్రిశంకు స్వర్గంలో పడి ప్రజలు
నిత్యమూ వేలాడుతున్నారు…!

నరంలేని నాలుకలు కల్లలతో
అష్ట వంకరులు తిరుగుతోంది
వాస్తవాలకు నూక మసి పూసి
మారేడు కాయను చేస్తున్నారు
పచ్చి మోసాలడ్డు కొనేందుకు
పంచదారను అద్దుతున్నారు…!

నిజాలు నిలకడ మీద తెలిసినా
ఆ ముసుగులను తొలగించి
సరి కొత్త వేషాలను వేస్తున్నారు
మళ్లీ అవే బొంకులను వల్లిస్తున్నారు…!

వాస్తవాలకు అసత్యాలకు మధ్య
ప్రచారాలకు ప్రలోభాలకు నడుమ
సన్నటి సరళరేఖ కన్పించటం లేదు..?
ఎనిమిది దిక్కులు వైపు చూస్తోంది
దేవుడిపై భారమేసి లౌకిక ప్రపంచం…!
ఇట్లు
మీ
కోటేశ్వరరావు ఉప్పాల

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *