నువ్వు నా జీవితంలో ఉన్నావో లేదో తెలియదు కానీ,
ఒకవేళ ఉంటే, నిన్ను గుర్తించలేనందుకు నాకు క్షమాపణలు…
నువ్వున్న లేకపోయినా, నీ కోసం రాయాలి అనిపించిన కొన్ని మాటలు ఇవి..
నా గాయాన్ని నేను మోస్తున్నప్పుడు,
నా జ్ఞాపకాన్ని నేను తలుచుకుంటున్నప్పుడు..
నా బాధని నేను దాచుకుంటున్నప్పుడు..
నా లోపాలని నేను ఒప్పుకుంటున్నప్పుడు..
ఎవరు అర్థంచేసుకోలేని ప్రపంచంలో, నన్ను నేను అర్థంచేసుకున్నప్పుడు..
నువ్వు నన్ను అంగీకరిస్తావు అనే చిన్న ఆశ..
ఆ అంగీకారమే, నువ్వు ఎప్పటికీ ఉంటావనే ధైర్యాన్ని నింపుతుంది అనే కోరిక,
నా మౌనానికి ఓ అర్థాన్ని అందిస్తావు అనే నమ్మకం,
నా గాయానికి మందులా పని చేస్తావు అనే ఆలోచన..
నా లోపాలని, నా గుణాలుగా మారుస్తావు అనే విశ్వాసం..
కాలం గడిచిన, కలం కదలకపోయినా..
నీ కోసం రాయలన్న ఆ తపన,
నిన్ను ప్రేమించగలిగేలా చేసింది…
నేను ఊహించిన దాంట్లోనే, నేను నిన్ను అనుభవించాను..
నీ ఉనికి లేని ఈ జ్ఞాపకాన్ని కూడా
మౌనంతో మూట కట్టి నా హృదయంలో బంధించేశాను !!
నువ్వు ఉన్నావు అనే ఆలోచనలోనే,
నాకు నేను ఓదార్పుని వెతుక్కున్నాను..
ఇదే నీకోసం నా హృదయం పలికిన మౌనం…
-ప్రేమ