మధురమైన జ్ఞాపకం

అది నా డిగ్రీ చదువుల కాలం. ఆకాశమంత ఆశలు, అరవిరిసిన ఊహలు, లోకం పోకడ తెలియని అమాయకత్వం కలగలిసిన వయసు. మా కుటుంబానికి వారు దూరపు బంధువులు. పరిచయం నామమాత్రమే అయినా, ఒక అనుకోని కలయిక నా జీవన గమనాన్నే మారుస్తుందని అప్పుడు ఊహించలేదు.

నిశ్శబ్ద పరిచయం.. నిండైన అనురాగం
ఒక సాధారణ షాపింగ్ సమయంలో ఆమె తమ్ముడితో మొదలైన పరిచయం, ప్రాణస్నేహంగా మారింది. ఆ స్నేహమే నన్ను వారి ఇంటి గుమ్మం తొక్కేలా చేసింది. అక్కడే తొలిసారి ఆమెను చూశాను. ఆమెతో మాటలు తక్కువే అయినా, మా మధ్యన ఒక అదృశ్యమైన ఆత్మీయ వారధి నిర్మితమైంది. నేను వెళ్ళగానే నా గొంతు వినబడగానే ఆమె ముఖంలో విరిసే ఆ చిరునవ్వు, పలకరింపు కోసం బయటకు వచ్చే ఆ ఆత్రుత… నా రోజును వెలిగించేవి. మూడు వసంతాలు అలా స్నేహపు నీడలో, ప్రేమ చివుళ్లు తొడుగుతూ గడిచిపోయాయి.
తొలి పలకరింత.. మధుర జ్ఞాపకం…..
నా మనసులోని మాటను ఆమెకు చెప్పే ధైర్యం సరిపోలేదు. ఎక్కడ స్నేహం విచ్ఛిన్నమవుతుందో, ఆమె తమ్ముడితో ఉన్న అనుబంధం దెబ్బతింటుందోనన్న ఆందోళన. చివరకు ఒకరోజు నిర్ణయం తీసుకున్నాను. ముందుగా అతనికే చెప్పాలి అనిపించింది.

“మన స్నేహం చెడిపోకూడదు” అని చెప్పి నా మనసు బయటపెట్టాను. కానీ అతను కోపంగా స్పందించాడు. నాతో మాట్లాడటం మానేశాడు. ఆ ఇంటికి వెళ్లడమూ ఆగిపోయింది. ఒక రోజు ఫోన్ మోగింది.
ఆ ల్యాండ్‌లైన్ రింగ్‌లో ఆమె గొంతు అమృతంలా వినిపించింది. “నాని .. నువ్వంటే నాకు ఇష్టం. కానీ నువ్వు ముందు నాకు కాకుండా మా తమ్ముడికి చెప్పిన ఆ పద్ధతి, ఆ నిజాయతీ నాకు ఇంకా బాగా నచ్చింది” అంది. ఆ క్షణం నా గుండె పులకించింది. మా మధ్య ప్రేమాయణం మూడు ఏళ్లు మధురంగా సాగింది.
అంతవరకు ఆర్థికంగా ఇద్దరం సమానమే. కానీ 2004 రాజకీయ మార్పులు మా తలరాతను మార్చేశాయి. వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో ఆమె తండ్రికి పదవులు వరించాయి. ఒక్కసారిగా వారి స్థాయి ఆకాశాన్ని తాకింది. పెళ్లి ప్రస్తావన వస్తే, వారి వైపు నుంచి తిరస్కారం ఎదురైంది. నాకు ఉద్యోగం ఉన్నా, నా ప్రేమ కన్నా వారి హోదాయే వారికి పెద్దదైంది.

“ఎందుకు?” అని నేనడిగినప్పుడు, ఆమె ఒక్క మాటే చెప్పింది — “భయం వేసింది… మన గురించి ఇంట్లో చెప్పడానికి ధైర్యం కాలేదు.”

ఆ మాట నా మనసును ముక్కలు చేసింది. కోపం, బాధ, అవమానం కలగలిపి ఒక నిర్ణయం తీసుకున్నాను. సంవత్సరం కూడా గడవక ముందే మా ఇంటివారు చూసిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను…
కాలక్రమేణా నా భార్యతో కొత్త జీవితం మొదలైంది. బాధలు మసకబారాయి. కొన్ని సంవత్సరాల తరువాత ఆమె మళ్లీ నా జీవితంలోకి వచ్చింది. ఒకరోజు ఫోన్ చేసి క్షమాపణలు చెప్పింది. “నువ్వంటే ఇప్పటికీ ఇష్టం. మన మధ్య దేహ సంబంధం అవసరం లేదు… ప్రేమగా మాట్లాడితే చాలు,” అంది. ఆమె భర్త ప్రతిరోజూ మద్యం సేవించి ఆమెను బాధపెడుతున్నాడని ఏడ్చింది. ఆమె పరిస్థితి చూసి జాలి వేసింది. మళ్లీ మాట్లాడటం ప్రారంభించాను. కానీ అది ఎక్కువ కాలం నిలవలేదు. ఒక ఉదయం అనుకోకుండా ఆమె భర్త గుండెపోటుతో మరణించాడు.

ఆ వార్త విన్నప్పుడు నా మనసు కలిసిపోయింది. జీవితం ఎంత విచిత్రమో అర్థమైంది. అయినా నేను మరోసారి ఒక గీత గీసుకున్నాను. గతాన్ని మళ్లీ తెరవకూడదని నిర్ణయించుకున్నాను. ఆమె నంబర్‌ బ్లాక్‌ చేశాను.

ఈ రోజు ఆమె దగ్గర కోట్ల ఆస్తులు ఉండవచ్చు, కానీ ఆత్మతృప్తి లేని ఆ జీవితం ఒక వెలితి. ఈ కథలో ఎవరూ దోషులు లేరు… పరిస్థితులు, భయం, కాలం మాత్రమే మమ్మల్ని వేరు చేశాయి. కొన్ని ప్రేమలు కలిసి నడవడానికి రావు, మనల్ని సంస్కరించడానికి వస్తాయి.

ప్రేమ ఉంటే సరిపోదు.. దానికి కాలం కలిసి రావాలి, మనసులో ధైర్యం ఉండాలి.

నా జీవితంలో ఆమె ఒక మధురమైన జ్ఞాపకం మాత్రమే. కానీ నా భార్యతో సాగే ఈ పవిత్ర ప్రయాణమే నా నిజమైన కావ్యం

-నాని

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *