డాక్టర్ ఆశావాది ప్రకాశరావు (1944 ఆగష్టు 2 – 2022 ఫిబ్రవరి 17) సాహితీ ప్రపంచంలో బహుముఖ ప్రజ్ఞాశాలిగా, బహుగ్రంథరచయితగా, అవధానిగా, కవిగా పేరు గడించాడు. 2021లో పద్మశ్రీ పురస్కారం దక్కింది. రాష్ట్ర ప్రభుత్వం కళారత్న బిరుదుతో సత్కరించింది.
తారణ నామ సంవత్సరం, శ్రావణమాసం, త్రయోదశి, బుధవారం 1944వ సంవత్సరం ఆగష్టు 2 వ తేదీ ఆశావాది ప్రకాశరావు కుళ్ళాయమ్మ, పక్కీరప్ప దంపతులకు కొరివిపల్లి గ్రామంలో మాతామహుల ఇంటిలో జన్మించాడు. ఇతని అసలు పేరు ఆసాది ప్రకాశం. ఇతని గురువు నండూరి రామకృష్ణమాచార్య ఇతని పేరును ఆశావాది ప్రకాశరావుగా మార్చాడు.[2] దళిత కుటుంబంలో జన్మించిన ఇతని బాల్యం బెళుగుప్ప, శీరిపి గ్రామాలలో గడిచింది. ఆ గ్రామాలలోని సోషియల్ వెల్ఫేర్ స్కూళ్లలో ప్రాథమిక విద్యను అభ్యసించాడు. అనంతపురం పట్టణంలోని పొట్టి శ్రీరాములు మునిసిపల్ బాయ్స్ స్కూలులోనూ, రాజేంద్ర మునిసిపల్ హైస్కూలులోను 1953-1959 మధ్య చదివాడు. అనంతపురం గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజీలో 1960-61ల మధ్య పి.యు.సి. చదివాడు. అదే కాలేజీలో 1962-65లో బి.ఏ. స్పెషల్ తెలుగు చదివాడు. తరువాత ఎ.పి.పి.ఎస్.సి.గ్రూప్-4 పరీక్షనెగ్గి లోయర్ డివిజినల్ క్లర్క్‌గా ఏలూరులో కొద్దిరోజులు పనిచేశాడు. తన ప్రగతికి అవరోధంగా భావించి ఆ ఉద్యోగం వదిలి వెంకటాద్రిపల్లె, వై.రాంపురం,కణేకల్, కుర్లి జిల్లాపరిషత్ పాఠశాలలో తెలుగుపండితుడిగా 1965-68ల మధ్య పనిచేశాడు. అనంతపురం పి.జి.సెంటర్(శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం, తిరుపతికి అనుబంధం) నుండి తెలుగు భాషాసాహిత్యాలలో ఎం.ఏ. 1968-70ల మధ్య చదివాడు. 1970 నుండి రాయదుర్గం గవర్నమెంటు జూనియర్ కాలేజీలోను,అనంతపురం, గుంతకల్లు, నగరి, పుంగనూరు,పెనుకొండలలోని గవర్నమెంట్ డిగ్రీకాలేజీలలో ఆంధ్రోపన్యాసకునిగా పనిచేశాడు. పెనుకొండ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు ప్రిన్సిపాల్‌గా పనిచేసి 2002లో పదవీవిరమణ చేశాడు. ప్రస్తుతం పెనుకొండలో నివసిస్తున్నాడు. 17-02-2022 (గురువారం) వ తేదీన తన స్వగృహం (పెనుకొండ) లో గుండెపోటుతో కన్నుమూశారు.
అవధాన విద్యలో డాక్టర్.సి.వి.సుబ్బన్న శతావధానిని గురువుగా స్వీకరించి అతని ఆశీస్సులతో ఆశుకవిత అలవరచుకున్నాడు. 1963లో తన 19వయేట మొదటి అవధానం చేశాడు. అప్పటి నుండి ఆంధ్రసాహితీ చరిత్రలో దళితులలో ఏకైక అవధానిగా ముద్రవేసికొని అసాధారణ ధారణాశక్తితో, అనిర్వచనీయమైన మహేంద్రజాలశక్తితో శ్రోతలను మంత్రముగ్ధులను చేశాడు. ఇతడు ఆంధ్రదేశంలోనే కాకుండా ఆంధ్రేతర ప్రాంతాలైన తరుత్తణి, అరక్కోణం, పళ్ళిపట్టు, హోసూరు,బెంగళూరు, బళ్లారి, తుంగభద్రడ్యామ్, దోణిమలై, ఢిల్లీ మొదలైన పలుప్రాంతాలలో 171 అష్టావధానాలు, ఒక ద్విగుణిత అష్టావధానం చేశాడు. ఇతని అవధానాలు దూరదర్శన్, ఆకాశవాణిలలో కూడా ప్రసారం అయ్యాయి. కొన్ని ఆశుకవితా ప్రదర్శనలు కూడా ఇచ్చాడు.
1978-1983 ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమీ హైదరాబాదు – కార్యవర్గసభ్యుడు.
1996-2002 శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం – పాలకమండలి సభ్యుడు.
తిరుమల తిరుపతి దేవస్థానం – గ్రంథనిపుణుల మండలి సభ్యుడు – రెండుసార్లు
రాయల కళా గోష్ఠి అనంతపురం – వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి – రెండు దశాబ్దాలు
ఆథర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా – న్యూఢిల్లీ – సభ్యుడు
ఆంధ్ర పద్య కవితాసదస్సు -అనంతపురం జిల్లా అధ్యక్షుడిగా నాలుగు సంవత్సరాలు – రాయలసీమ ప్రాంత కార్యదర్శిగా ఆరు సంవత్సరాలు – రాష్ట్ర అధ్యక్షుడిగా రెండేండ్లు.
ఆం.ప్ర.సామాజిక సమరసతావేదిక – రాష్ట్ర అధ్యక్షుడు -2007 నుండి.
రాయలసీమ రచయిత్రీరచయితల మహాసభ – సాహిత్యవిభాగ కార్యదర్శి – మూడు సంవత్సరాలు
దోమా వేంకటస్వామిగుప్త సాహిత్యపీఠము, కడప – పద్యశిక్షణాతరగతుల నిర్వహణ – ఒక పర్యాయము
సి.వి.సుబ్బన్న శతావధాని కళాపీఠము, ప్రొద్దుటూరు – కార్యదర్శి – రెండు సంవత్సరాలు
ఘనగిరి సాంస్కృతిక మండలి,పెనుకొండ – కార్యదర్శి – ఒక దశాబ్దము
ఆం.ప్ర.సాంస్కృతిక శాఖ, హైదరాబాదు – పద్యశిక్షణాతరగతుల నిర్వహణ – ఒక పర్యాయము
సాహితీ గగన్‌మహల్, పెనుకొండ – సలహామండలి సభ్యుడు
కలుగోట్ల విజయాత్రేయ సాహితీ రజతోత్సవ సంఘం, కర్నూలు – సభ్యుడు
ఆం.ప్ర.సాహితీ సాంస్కృతిక సంస్థల సమాఖ్య, మచిలీపట్నం – సభ్యుడు
జిల్లా సాంస్కృతికమండలి, అనంతపురం – కార్యవర్గ సభ్యుడు – ఐదు సంవత్సరాలు
అభ్యుదయ రచయితల సంఘం, అనంతపురం జిల్లా – సహకార్యదర్శి – ఒక సంవత్సరం
అనంతపురం జిల్లా రచయితల సంఘం – కార్యవర్గ సభ్యుడు – నాలుగు సంవత్సరాలు
మహాకవి గుఱ్ఱం జాషువా శతజయంతి కమిటీ, అనంతపురం – ఉపాధ్యక్షుడు – రెండు సంవత్సరాలు
అనంతసాహితి, గుత్తి – వ్యవస్థాపకుడు, సలహాసంఘ సభ్యుడు
భువనవిజయ శారదాపీఠము, గుంతకల్లు – వ్యవస్థాపక అధ్యక్షుడు
పాంచజన్య ప్రజ్ఞాసదస్సు,పెనుకొండ – వ్యవస్థాపక హితవరి
శ్రీ కళామంజరి, షాద్‌నగర్ – ప్రధాన సలహాదారు – 1995 నుండి
శ్రీశైలజ్యోతి (మాసపత్రిక), అనంతపురం – సహాయ సంపాదకుడు – రెండు సంవత్సరాలు
తెలుగు విశ్వవిద్యాలయం – అవార్డు కమిటీ సలహాసభ్యుడు – నాలుగు పర్యాయాలు
రాష్ట్రస్థాయి పద్యనాటక పోటీలు (లలితకళాపరిషత్, అనంతపురం) – న్యాయనిర్ణేతల సంఘం సభ్యుడు – ఒక పర్యాయం
వేకువ (సాహితీ సాంస్కృతిక సాంఘిక సేవా సంస్థ),పెనుకొండ – సలహాసంఘసభ్యుడు -2009 నుండి.
అంతర్జాతీయ బాలల ఉద్యమసంస్థ న్యూఢిల్లీ – సభ్యుడు – రెండు సంవత్సరాలు
అధికార భాషా సమీక్షాసంఘం – జిల్లాస్థాయి సభ్యుడు – మూడు సంవత్సరాలు
తెలుగు భాషా వికాస ఉద్యమం – సలహాసంఘ సభ్యుడు – రెండు సంవత్సరాలు.
పుష్పాంజలి : 1968లో వెలువడిన ఈ పుస్తకంలో డాక్టర్.సి.వి.సుబ్బన్న శతావధాని వెంట అవధాన సభలకు వెళ్ళినప్పుడు తన గురువు కవితావైభవాన్ని గురించి ఆశావాది ప్రకాశరావు ఆశువుగా చెప్పిన పద్యాలు ఉన్నాయి.
వరదరాజశతకము : సమాజంలోని అసమానతలపై ఎక్కుపెట్టిన బాణం. వనాధిజా మనోజ! వరదరాజ అనే మకుటంతో 108 పద్యాలున్నాయి. 1969లో ప్రకటితం.
నిర్యోష్ఠ్య కృష్ణశతకము : రాప్తాటి ఓబిరెడ్డి వ్రాసిన ఈ శతకానికి ఆశావాది ప్రకాశరావు లఘుటీక వ్రాశాడు. 1972లో వెలువడింది.
విద్యాభూషణ : తన అభివృద్ధికి కారణమైన భోగిశెట్టి జూగప్ప,ఐ.ఏ.ఎస్.(రిటైర్డ్) జీవితచరిత్ర ఇది. రాయలకళాగోష్ఠి అనంతపురం తరఫున 1973లో ప్రకటించాడు.
మెరుపు తీగలు : పద్యఖండికల సంపుటి. అవ్వారి సాహిత్యపరిషత్, బుక్కరాయసముద్రం పక్షాన 1976లో వెలువడింది. గురువుగారైన నండూరి రామకృష్ణమాచార్యకి అంకితమివ్వబడిన ఈ గ్రంథంలో తన జీవితంలో తారసిల్లిన విద్వాంసులపై కవితలున్నాయి.
ఆర్కెస్ట్రా : ఇది ఇతని సంపాదకత్వంలో వెలువడిన వచనకవితాసంకలనము. 1979 రాయలకళాగోష్ఠి ప్రచురణ.
చెళ్లపిళ్లరాయ చరిత్రము : తాళ్లపాక అన్నమయ్య వ్రాసిన యక్షగానం ఇది. దీనిలోని ఇతివృత్తం బీబీ నాంచారి కళ్యాణగాథ. అముద్రితంగా తాళపత్రాలలో ఉన్న ఈ గ్రంథాన్ని ఆశావాది ప్రకాశరావు వెలికి తీసి పరిష్కరించి భువనవిజయ శారదాపీఠం(గుంతకల్లు) పక్షాన 1982లో ప్రచురించాడు. దీనికి విపులమైన పీఠిక వ్రాశాడు. కవికాలాదులను నిర్ణయించాడు.
శ్రీ రాప్తాటి పరిచయ పారిజాతము : అజ్ఞాతంగా ఉన్న అద్భుతమైన కవి రాప్తాటి ఓబిరెడ్డి జీవిత సాహిత్యాలను వివరించే లఘు గ్రంథం. 1986లో అచ్చయ్యింది.
సహాయాచారి సాహితీ సాహచర్యము : నడితోక మృత్యుంజయ సహాయాచారి వ్రాసిన సాయిలీలా గుచ్ఛము అనే గ్రంథంలో ఆశావాది ప్రకాశరావు వ్రాసిన ఈ వ్యాసం 1986లో చిన్న పుస్తకంగా వెలువడింది.
పోతన భాగవతము -తృతీయ స్కంధము : తిరుమల తిరుపతి దేవస్థానము వారి పోతన భాగవతం ప్రాజెక్టులో భాగంగా భాగవతం తృతీయ స్కంధానికి సరళగద్యానువాదంగా వ్రాసిన ఈ గ్రంథం 1986 నుండి అనేక ముద్రణలు పొందింది.
అంతరంగ తరంగాలు : ఈ వచనకవితా సంకలనంలో 52 ఖండికలున్నాయి. 1988లో నవ్యసాహితీ సమితి ప్రొద్దుటూరు ఈ పుస్తకాన్ని ప్రచురించింది. దీనిలోని కవితలు కొన్ని హిందీలోనికి అనువదించ బడ్డాయి.
ప్రహ్లాద చరిత్ర – ఎఱ్ఱన పోతన తులనాత్మక పరిశీలన : ఒంగోలులోని ఎఱ్ఱన పీఠం నిర్వహించిన సిద్ధాంతగ్రంథాల పోటీలో బహుమతి పొంది 1989లో అదే సంస్థ చేత ప్రచురింపబడింది. డాక్టర్ జి.చెన్నయ్య సహరచయిత.
జ్యోతిస్సుప్రభాతము : కె.మునిరెడ్డి సంస్కృతంలో రచించిన శ్లోకాలకు ఆశావాది ప్రకాశరావు చేసిన ఆంధ్రవచనానువాదం. 1989లో బ్రహ్మజ్ఞాన జ్యోతి ఆశ్రమం, తిరుత్తణి ప్రకటించింది.
హనుమత్ స్తోత్రమంజరి : ఆశావాది ప్రకాశరావు సంకలనం చేసిన ఈ గ్రంథాన్ని 1989లో దోర్నాదుల చిన్నవరదరాజు ప్రచురించాడు.
సుబ్రహ్మణ్య స్తోత్రకదంబము : ఆశావాది ప్రకాశరావు సంకలనం చేసిన ఈ గ్రంథాన్ని 1990లో దోర్నాదుల చిన్నవరదరాజు ప్రచురించాడు.
లోకలీలాసూక్తము : భువనవిజయ శారదాపీఠం (గుంతకల్లు) ప్రచురించింది. 1990లో వెలువడింది.
దీవనసేసలు: నూతన వధూవరులకు ఆశీర్వాద సందేశరూపమైన ఆశావాది కవితలు (55పద్యాలు + 2 వచన కవితఖండికలు) ఈ పుస్తకంలో ఉన్నాయి. 1992లో ప్రకటింపబడింది.
అవధాన చాటువులు : ఆంధ్రపద్యకవితాసదస్సు అనంతపురం శాఖ ప్రచురించిన ఈ పుస్తకంలో కడప చిత్తూరు జిల్లాలలో చేసిన 24 అవధానాల విశేషాలు ఉన్నాయి. దీనిలో మొత్తం 153 పద్యాలు ఉన్నాయి. 1993లో అచ్చయ్యింది.
రామకథా కలశం : 35 పద్యాలున్న ఆశు లఘుకావ్యం. దోర్నాదుల చిన్నవరదరాజు షష్టిపూర్తి సందర్భంగా ఆశావాది చెప్పినవి ఈ పద్యాలు. 1993లో ప్రకటింపబడింది.
అవధాన దీపిక : అనంతకళాపీఠం పక్షాన 1998లో ప్రచురింపబడింది. అనంతపురం పట్టణంలో చేసిన 21 అవధానాల సంపుటి ఇది. తన తల్లిదండ్రులు కుళ్ళాయమ్మ, టీచర్ పక్కీరప్పలకు ఈ పుస్తకం అంకితమిచ్చాడు.
కళ్యాణవాణి – శాంతి నారాయణ(సంకలనకర్త)
ఆశావాది ప్రకాశరావు సాహిత్యము – అనుశీలన – మంకాల రామచంద్రుడు -పి.హెచ్.డి. సిద్ధాంత గ్రంథం
అక్షరకిరీటి ఆశావాది – పి.రామసుబ్బారెడ్డి (సంకలనకర్త)
అవధానాచార్య ఆశావాది – మాడభూషి అనంతాచార్యులు
ఆశావాది కవితాంతరంగం – యన్.శాంతమ్మ
ఆశావాది రచనాదృక్పథం – యన్.శాంతమ్మ
ఆశావాది గ్రంథావలోకనం – ఆర్.రంగస్వామిగౌడ్ (సంకలనకర్త)
ఆశావాది అంతరంగతరంగాలు – ఒక పరిశీలన – యన్.హేమావతి (ఎం.ఫిల్. సిద్ధాంత వ్యాసం)
హిరణ్మయి – ఆశావాది సాహితీస్వర్ణోత్సవాల విశేష సంచిక
కమల పురస్కృతుడు ఆశావాది – పద్మశ్రీ పురస్కారం లభించిన సందర్భంగా వెలువరించిన అభినందన సంచిక. టి.శ్రీరంగస్వామి (సంకలనకర్త).
భారత ప్రభుత్వం నుండి పద్మశ్రీ పురస్కారం
పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం – గౌరవ డాక్టరేట్ (డి.లిట్)ప్రదానం
లోకనాయక్ పౌండేషన్, విశాఖపట్నం – అవధాన శిరోమణి పురస్కారం
ఆరాధన సాంస్కృతిక సంస్థ హైదరాబాదు – జీవన సాఫల్య పురస్కారం
భారతీ సాహితీసమితి, గుంతకల్లు – కందుకూరి వీరేశలింగం శతజయంతి పురస్కారం
ఆంధ్ర సంఘం,హోసూరు – శ్రీకృష్ణదేవరాయల పట్టాభిషేకోత్సవ పురస్కారం
పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం – కార్యమపూడి రాజమన్నారు ధర్మనిధి పురస్కారం
శ్రీ దోమా వేంకటస్వామిగుప్త సాహిత్యపీఠం, కడప – శతావధాని పురస్కారం
ఉన్నత విద్యాశాఖ, ఆం.ప్ర.ప్రభుత్వం – ఉత్తమ అధ్యాపక పురస్కారం
టి.సుబ్బరామిరెడ్డి ఫౌండేషన్, విజయవాడ – కళాబంధు పురస్కారం.
ఇతనిని ఎందరో ప్రముఖులు సన్మానించారు. వారిలో బాబూ జగ్జీవన్ రాం, బెజవాడ గోపాలరెడ్డి,కోట్ల విజయభాస్కరరెడ్డి, ఎన్.టి.రామారావు, నారా చంద్రబాబునాయుడు, కొణిజేటి రోశయ్య, నేదురుమల్లి జనార్ధనరెడ్డి, మండలి బుద్ధప్రసాద్,పి.వి.ఆర్.కె ప్రసాద్, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, గొల్లపూడి మారుతీరావు మొదలైన వారున్నారు.
బిరుదులు
బాలకవి – సర్వేపల్లి రాధాకృష్ణన్
అవధానాచార్య – బద్దెన కళాపీఠము,బద్వేలు
అభినవ సాహితీసోమయాజి – నండూరి శిష్యసమితి, అనంతపురం
శారదాతనయ – ఆంధ్రసంఘం, తిరుత్తణి
కళాతపస్వి – జైభారత్ కళానికేతన్, పత్తికొండ
పండితమిత్ర – శ్రీశైల జగద్గురు పీఠం, గుంతకల్లు
అవధాన కిశోర – శ్రీకృష్ణదేవరాయ గ్రంథమాల, అనంతపురం
వాణీవరపుత్ర – భాగ్యసమితి, బద్వేలు
అవధాన కోకిల – చైతన్యభారతి, రాయదుర్గం
అపర జాషువా – జిల్లా రచయితలసంఘం, కడప
మధురకవి – యస్.సి.పోష్టల్ ఉద్యోగుల సంఘం,గుంతకల్లు.
77 యేళ్ల డాక్టర్ ఆశావాది ప్రకాశరావు అనంతపురం జిల్లా పెనుకొండలోని స్వగృహంలో 2022 ఫిబ్రవరి 17న గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు.
మాధవి కాళ్ల
సేకరణ