డిజిటల్ యుగంలో వసంతాగమనం

అక్షర ఉగాది పండుగ పోటీ కొరకు

అంశం :⁠- ఉగాది పండుగ

తేది:⁠- 12/03/2026

శీర్షిక:⁠- డిజిటల్ యుగంలో వసంతాగమనం

        చైత్ర మాసపు తొలి వేకువన ప్రకృతి పులకించింది.కానీ,రాఘవ ఇంట్లో మాత్రం అలారం మోగక ముందే స్మార్ట్‌ఫోన్ నోటిఫికేషన్ల మోత మొదలైంది. 

ఒకప్పుడు ఉగాది అంటే… తెల్లవారుజామున లేచి, మామిడి తోరణాలు కట్టి, పొయ్యి మీద పచ్చడి తయారు చేసే హడావిడి ఉండేది. ఇప్పుడు ఆ హడావిడి అంతా వాట్సాప్ గ్రూపుల్లో హ్యాపీ ఉగాది మెసేజ్‌ల రూపంలోకి మారింది.
రాఘవ తన ఐప్యాడ్ తెరిచి ఆన్‌లైన్ పంచాంగాన్ని చూశాడు. ఒకప్పుడు ఊరి గుడిలో అందరూ కలిసి వినే పంచాంగ శ్రవణం, ఇప్పుడు యూట్యూబ్ లైవ్ స్ట్రీమింగ్‌లోకి వచ్చేసింది. రాశిఫలాల గురించి తన భార్యకు వివరిస్తూనే…
ఉగాది పచ్చడి కోసం అవసరమైన వేపపూత, కొత్త చింతపండును ఆన్‌లైన్ గ్రూసరీ యాప్ ద్వారా ఆర్డర్ చేశాడు.
కాసేపటికి డెలివరీ బాయ్ తెచ్చిన ప్యాకెట్లతో పచ్చడి సిద్ధమైంది.
రాఘవ తన కొడుకు అభికి ఉగాది పచ్చడి ప్రాముఖ్యతను వివరిస్తూ,
“చూడు అభి! ఈ పచ్చడిలో తీపి, వగరు, చేదు అన్నీ ఉంటాయి. మన జీవితం కూడా సుఖదుఃఖాల మేళవింపే అని ఇది గుర్తు చేస్తుంది” అన్నాడు.
అభి మాత్రం పచ్చడిని స్పూన్‌తో తింటూ, తన ఫోన్‌లో ఆ పచ్చడిని ఫోటో తీసి హ్యాష్టాగ్ ఉగాది వైబ్స్ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంలో మునిగిపోయాడు.
అంతలో అమెరికాలో ఉంటున్న తన కూతురు నుండి వీడియో కాల్ వచ్చింది. మునుపటి కాలంలో పండుగకు అందరూ ఒకే చోట కలిసేవారు.
ఇప్పుడు దేశాలు దాటినా, జూమ్ కాల్స్ ద్వారా ముఖాముఖి పలకరించుకోవడం సాధ్యమవుతోంది. ఇది సాంకేతికత అందించిన గొప్ప వరం.
వారు కలిసి ఆన్‌లైన్‌లోనే ఉగాది కవి సమ్మేళనాన్ని వీక్షించారు. ఆధునిక కాలంలో తెలుగు సంస్కృతి తన రూపు మార్చుకున్నా, మూలాలు మాత్రం మారని సత్యమని రాఘవకు అర్థమైంది.
సాయంత్రం రాఘవ తన బాల్కనీలో కూర్చుని ఆకాశం వైపు చూశాడు. టెక్నాలజీ వల్ల పండుగ జరుపుకునే తీరు సులభతరమైంది.
కానీ, ఆత్మీయతలు , డిజిటల్ మెసేజ్‌లకే పరిమితం కాకూడదని, అప్పుడప్పుడు స్మార్ట్‌ఫోన్ పక్కన పెట్టి ఎదుటివారితో… మనసు విప్పి మాట్లాడటమే నిజమైన నూతన సంవత్సర ఆరంభం అని అతడు గ్రహించాడు. పరాభవ నామ సంవత్సరం అందరి జీవితాల్లో సరికొత్త వెలుగులు నింపాలని కోరుకుంటూ, తన వాకిలి ముందు వేసిన రంగవల్లికను చూసి మురిసిపోయాడు.

మాధవి కాళ్ల..
హామీ పత్రం :⁠-
                      ఈ కథ నా సొంతం అని హామీ ఇస్తున్నాను..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *