రాళ్ళబండి కవితాప్రసాద్(తెలుగు అవధాని, కవి)

రాళ్ళబండి కవితాప్రసాద్ (మే 21, 1961 – మార్చి 15, 2015) తెలుగు అవధాని, కవి.
కవితాప్రసాద్ కృష్ణా జిల్లా, గంపలగూడెం మండలం, నెమలి గ్రామంలో 1961, మే 21వ తేదీన జన్మించాడు. ఇతనికి తల్లిదండ్రులు పెట్టిన పేరు వేంకటేశ్వర ప్రసాదరాజు. కవిత్వం పట్ల మోజుతో తన పేరును కవితాప్రసాద్‌గా మార్చుకున్నాడు. ఈయన తండ్రి కోటేశ్వర రాజు గారు తెలుగు పండితులు. తల్లి పేరు రత్నవర్ధనమ్మ. సత్తుపల్లిలో గణితశాస్త్రం ఐచ్చిక అంశంగా పట్టభద్రుడయ్యాడు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో అవధానవిద్యపై మసన చెన్నప్ప పర్యవేక్షణలో పి.హెచ్.డి. చేశాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇతడు గ్రూప్-1 అధికారిగా సాంఘిక సంక్షేమ శాఖలో సేవలను అందించాడు. ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక శాఖకు రెండు పర్యాయాలు సంచాలకుడుగా పనిచేశాడు. ఇతని పర్యవేక్షణలో నాలుగవ ప్రపంచ తెలుగు మహాసభలు తిరుపతిలో జరిగాయి. ఇతడు తెలంగాణ రాష్ట్ర షెడ్యూల్ కులాల అభివృద్ధిశాఖ జాయింట్ డైరెక్టర్‌గా పనిచేశాడు. మంత్రి కడియం శ్రీహరి వద్ద పీయస్ గా బాధ్యతలు నిర్వర్తించాడు. ఇతడు 2015 మార్చి 15న హైదరాబాదులోని బంజారా హిల్స్ లోని కేర్ ఆసుపత్రిలో హృద్రోగంతో మరణించాడు.

ఇతడు 500కు పైగా అవధానాలను చేశాడు. వాటిలో అష్టావధానాలతో పాటుగా శతావధానాలు, ద్విశతావధానాలు ఉన్నాయి. సంప్రదాయ అవధానంతో పాటు కథ, వచనకవిత, గణితం వంటి అనేక ప్రక్రియలను అవధానంలో చొప్పించాడు. ఒకసారి 25 నిమిషాలలో విచిత్ర అష్టావధానం చేసి పండితుల మెప్పు పొందాడు. వరంగల్లోని భద్రకాళి దేవాలయంలో ఏకదిన శతకరచన ధార అనే కార్యక్రమాన్ని చేపట్టి ఒకే రోజులో ఆశువుగా శతకాన్ని చెప్పాడు. ఆశుకవితా ఝరి పేరుతో గంటకు 500 పద్యాలు ఆశువుగా చెప్పాడు.

రచనలు
అగ్నిహంస
ఒంటరి పూలబుట్ట
దోసిట్లో భూమండలం
కాదంబిని
సప్తగిరిధామ శతకం.

2015లో తెలుగు విశ్వవిద్యాలయం సాహితీ పురస్కారం 2012 (సప్తగిరి ధామ కలియుగ సార్వభౌమ పుస్తకానికి).

మాధవి కాళ్ల
సేకరణ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *